పల్లెవెలుగు బస్సులో 182 మంది మహిళలు!

పల్లెవెలుగు బస్సులో 182 మంది మహిళలు!
  • ఓవర్ లోడ్​తో టైర్ ​నుంచి పొగలు  
  • అప్రమత్తమై ఆపేసిన డ్రైవర్​
  • వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు...

ధన్వాడ. వెలుగు : మహాలక్ష్మి స్కీంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మహబూబ్​నగర్​ జిల్లాలోని ధన్వాడలో బుధవారం ఓ పల్లెవెలుగు బస్సులో 182 మంది మహిళలు ప్రయాణించడంతో బస్సు టైర్లలోంచి పొగలు వచ్చి నిలిచిపోయింది. ప్రయాణికుల కథనం ప్రకారం..మహబూబ్​నగర్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 06 యూపీ 3411) బుధవారం ఉదయం మహబూబ్​నగర్​ నుంచి 182 మంది ప్రయాణికులతో నారాయణపేటకు బయలుదేరింది.

జేపీఎన్ సీఈ ఇంజినీరింగ్​ కాలేజీ వద్ద  సుమారు 30 నుంచి 40 మంది స్టూడెంట్లు దిగారు. తర్వాత స్టేజీలో మరికొంతమంది మహిళలు ఎక్కారు. దీంతో బస్సు ఓవర్​లోడ్​అయి మరికల్​కు వెళ్లాక వెనక టైర్ నుంచి పొగలు రావడం మొదలైంది. ధన్వాడకు వచ్చాక పొగ ఎక్కువై కాలిన వాసన వచ్చింది. దీంతో డ్రైవర్​అప్రమత్తమై బస్సు ఆపేశాడు. అక్కడే ప్రయాణికులందరినీ దింపేసి వేరే బస్సుల్లో వారి  గమ్యస్థానాలకు తరలించారు.