యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్‌ రేప్.. హత్య చేసి చెట్టుకు ఉరి

యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్‌ రేప్.. హత్య చేసి చెట్టుకు ఉరి

ఓ దళిత యువతిపై అమానుష ఘటన జరిగింది. కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత తప్పించుకోవడానికి ఆమెను చంపేసి.. మృతదేహాన్ని ఓ మర్రి చెట్టుకు వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆ దుర్మార్గులు. గుజరాత్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటకు వచ్చింది.

గుజరాత్‌లోని మోదసా తాలూకా సైరా గ్రామానికి చెందిన ఓ దళిత యువతి (19) జనవరి 1న కనిపించకుండా పోయింది. ఆమెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి కారుతో తీసుకెళ్లి, గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఆమెను చంపేసి, వాళ్ల ఊరికి సమీపంలో ఓ మర్రి చెట్టుకు వేలాడదీశారు. జనవరి 5న ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేశారు. అయితే తమ బిడ్డను తెలిసిన వాళ్లే రేప్ చేశారని, వారిని కాపాడడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారంటూ గ్రామ ప్రజలు, దళిత సంఘాలు నిరసనలకు దిగారు.

కారులో తీసుకెళ్లి.. గ్యాంగ్ రేప్

బాధితురాలు జనవరి 1న తన సోదరితో కలిసి మోదసా టౌన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి ఆమె సోదరి మాత్రమే ఇంటికి చేరింది. బాధిత యువతి మాత్రం ఇంటికి రాలేదు. రాత్రికి కూడా రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆమె కోసం వెతుకులాడారు. వారి కంగారు చూసిన బాధితురాలి సోదరి భయంగా విషయం చెప్పింది. తనతో పాటు వెళ్లిన ఆమెను బీమాల్ భర్వాడ్ అనే వ్యక్తి ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లాడని, ఈ విషయం ఇంట్లో చెప్పొదని చెప్పారని తెలిపింది. దీంతో అతడిపై కిడ్నాప్ కేసు పెట్టేందుకు మోదసా టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లగా తొలుత ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత మళ్లీ మళ్లీ తిరగడంతో కేసు తీసుకున్నారు. ఆమె కిడ్నాప్ జరిగిన రెండ్రోజుల తర్వాత జనవరి 3న టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్కే రబారీ.. ఆమె ఓ వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, తిరిగి వచ్చేస్తుందటూ తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ తర్వాతి రోజే మళ్లీ ఆ ఇన్‌స్పెక్టర్ తన స్టేషన్ పరిధిలోకి ఈ కేసు రాదని చెప్పి చేతులు దులుపుకున్నాడు. ఇంతలో జనవరి 5న ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అయితే ఆ ఊరిలోనే ఉన్న బీమాల్ ఆ కారును తన స్నేహితులు ముగ్గురు తీసుకెళ్లారని, ఎక్కడికెళ్లారో తెలియదని చెప్పాడు.

ఇంకా నిందితుల అరెస్టు లేదు..

దీనిపై పోలీసులు ముందు యాక్సిడెంటల్ డెత్ కేసుగా నమోదు చేశారు. కానీ ఇది గ్యాంగ్ రేప్, మర్డర్ అని కుటుంబసభ్యులు చెప్పారు. ఆ తర్వాత రెండ్రోజులకు జనవరి 7న పోలీసులు గ్యాంగ్ రేప్, మర్డర్‌గా కేసు ఫైల్ చేశారు. బీమాల్, అతడి ముగ్గురు స్నేహితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ, తగిన ఆధారాలు లేకపోవడంతో ఇంకా వారిని అరెస్టు చేసేందుకు చేయలేదని పోలీసుల చెబుతున్నారు.

అయితే కేసును నీరుగార్చే ప్రయత్నం చేసి, కంప్లైంట్ తీసుకోనని చెప్పిన ఇన్‌స్పెక్టర్ రబారీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ఊరి జనమంతా నిరసనకు దిగారు. అలాగే నిందితులను అరెస్టు చేసి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ, ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడంతో నిరసనలు ఆగలేదు.

మరోవైపు సోషల్ మీడియాలోనూ జస్టిస్ ఫర్ కాజల్ (#Justiceforkajal) పేరుతో ఆమెకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ హీరో, జనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా సహా పలువురు ప్రముఖులు కూడా ట్వీట్లు చేశారు. నిందితులను ఉరి తీవయాలని డిమాండ్ చేశారు.