ఇందిరమ్మ స్కీమ్‌‌లో అనర్హులకు చెక్ !..ఆఫీసర్ల సర్వేలో 1,950 మంది గుర్తింపు

ఇందిరమ్మ స్కీమ్‌‌లో అనర్హులకు చెక్ !..ఆఫీసర్ల సర్వేలో 1,950 మంది గుర్తింపు
  • గతంలో సగం ఇల్లు కట్టుకున్న వారిని సైతం ఎంపిక చేసిన సెక్రటరీలు 
  • అలాంటి వారి ఇండ్లను రద్దు చేసిన అధికారులు
  • కొత్త  వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు
  • అనర్హులను ఎంపిక చేసిన సెక్రటరీల సస్పెన్షన్‌‌
  • ఇంటి నిర్మాణాలపై సెక్రటరీలకు గైడ్‌‌లైన్స్‌‌

హైదరాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. అక్కడక్కడ అనర్హులు బయటపడుతున్నారు. ఇండ్ల నిర్మాణంలో 360 డిగ్రీల సర్వే, జియోట్యాగింగ్, ఆర్టిఫీషియల్‌‌ ఇంటలిజెన్స్‌‌, లొకేషన్‌‌తో పాటు ఇంటి నాలుగువైపులా, పై నుంచి ఫొటోలు తీయడం వంటి అంశాలను అమలుచేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కొందరు గ్రామ పంచాయతీ సెక్రటరీల నిర్వాకం వల్ల అనర్హులకు ఇండ్లు దక్కినట్లు అధికారుల సర్వేలో తేలింది. 

రాష్ట్ర వ్యాప్తంగా 1,950 మంది అనర్హులు

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న తప్పులతో అర్హులకు బదులు అనర్హులు లబ్ధిదారుల లిస్ట్‌‌లో చేరినట్లు ఆఫీసర్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ఆఫీసర్లు చేపట్టిన వెరిఫికేషన్‌‌లో 1,950 మంది అనర్హులు ఉన్నట్లు వెల్లడైంది. బేస్‌‌మెంట్‌‌ పూర్తయిన తరువాత తొలి దశలో రూ. లక్ష చెల్లించే సమయంలో అనర్హులను గుర్తించారు. వెంటనే వీరికి ఇండ్లను రద్దు చేసి వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని హౌసింగ్ కార్పొరేషన్‌‌ ఎండీ వీపీ.గౌతమ్ ఇటీవల కలెక్టర్లను ఆదేశించారు.

తొలి దశలో సొంత జాగా ఉండి అత్యంత నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ 1,950 మంది గతంలోనే ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసి బెస్‌‌మెంట్‌‌ వరకు నిర్మించి వదిలేసిన వాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వారి ఫొటోలను పంచాయతీ సెక్రటరీలు యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేశారు. పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, ఏఈ, డీఈఈ, పీడీ, కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాతే దశల వారీగా లబ్ధిదారులకు బిల్స్‌‌ చెల్లిస్తున్నారు. అయినప్పటికీ తప్పులు జరుగుతున్నాయని, అనర్హులు సెలక్ట్ అవుతున్నారని హౌసింగ్ అధికారులు అంటున్నారు.

సెక్రటరీలకు కొత్త గైడ్ లైన్స్

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌లో రానున్న రోజుల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, మండలాల్లో హౌసింగ్ ఏఈలు చేయాల్సిన, చేయకూడని అంశాలపై కార్పొరేషన్‌‌ ఎండీ సర్క్యులర్‌‌ జారీ చేశారు. ఇందిరమ్మ మొబైల్ యాప్‌‌లో ఫొటో క్యాప్చర్‌‌ సమయంలో సెక్రటరీలు తప్పులు చేస్తున్నారని ఈ సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు. భూమి నుంచి 45 సెంటీమీటర్లు బేస్‌‌మెంట్‌‌ పూర్తయిన తర్వాతే ఫొటో తీయాలని, బేస్‌‌మెంట్‌‌కు సమానంగా మట్టి నింపి ఉండాలని, మొబైల్‌‌ యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసే ముందు లోకేషన్‌‌ గుర్తించే వరకు సెక్రటరీలు ఆగాలని సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు.

కచ్చితంగా రెండు గదులు, కిచెన్, టాయిలెట్‌‌తో కలిపి నిర్మించాలని, అది కూడా 400 ఎస్‌‌ఎఫ్‌‌టీ నుంచి 600 ఎస్‌‌ఎఫ్‌‌టీ మధ్య ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. బేస్‌‌మెంట్‌‌ ముందు, సైడ్, పై నుంచి ఫొటో తీసి అప్‌‌లోడ్‌‌ చేయాలని సూచించారు. ఇండ్లు పూర్తయ్యే వరకు దశల వారీగా హౌసింగ్ ఏఈలు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ గైడ్‌‌లైన్స్‌‌, రూల్స్‌‌ను లబ్ధిదారులకు వివరించాలని సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు.

సెక్రటరీల సస్పెన్షన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులను ఎంపిక చేస్తున్న సెక్రటరీలపై కలెక్టర్లు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివిధ జిల్లాలో సెక్రటరీల తప్పు ఉందని తేలిన చోట్ల వారిని విధుల నుంచి సస్పెండ్‌‌ చేశారు. ఇటీవల నాగర్ కర్నూల్‌‌ జిల్లాలో నలుగురు, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు సెక్రటరీలను కలెక్టర్లు సస్పెండ్ చేశారు.

ఒకే సారి పెద్ద సంఖ్యలో గృహప్రవేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఇందిరమ్మ ఇండ్లు ఓపెనింగ్‌‌కు సిద్ధంగా ఉన్నాయి. మరో 8 వేల ఇండ్లు స్లాబ్‌‌లు పూర్తి కాగా చివరి దశకు చేరుకున్నాయి. శ్రావణమాసంలోనే సీఎం, మంత్రులతో గృహ ప్రవేశాలు చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకు 1.73 లక్షల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 57 వేల ఇండ్లు పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రూ.386.12 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.