రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి.. కాపాడబోతే ప్రాణాలు పోయినయ్​

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి.. కాపాడబోతే ప్రాణాలు పోయినయ్​
  •     రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి.. కాపాడబోతే ప్రాణాలు పోయినయ్​
  •     బైక్​పై వెళ్తుండగా ఢీకొట్టిన వాహనం
  •     పైకి లేపుతుండగా ఇద్దరిపై నుంచి దూసుకెళ్లిన మరో వెహికల్​
  •     కల్వకుర్తిలో ఇద్దరు కన్నుమూత

కల్వకుర్తి, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేస్తుండగా గుర్తు తెలియని వెహికల్​ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కల్వకుర్తికి చెందిన నవాజ్​(25) అత్తగారి ఊరైన జడ్చర్లకు వెళ్లి గురువారం రాత్రి బైక్​పై కల్వకుర్తికి బయలుదేరాడు. నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలోని దేవరకొండ–కోదాడ మెయిన్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డాడు.

 బైక్​మీద పడడంతో అరుస్తుండగా, కోదాడ నుంచి కొత్తకోటకు వెళ్తున్న బొలెరో పాల వ్యాన్​ డ్రైవర్, క్లీనర్లు గమనించారు. బాధితుడికి సాయం చేసేందుకు వెళ్లారు. వీరిలో బొలెరో డ్రైవర్ నరసింహ.. నవాజ్ పై పడిన బైక్​ను పక్కకు తీశాడు. క్లీనర్ అశోక్(22) నవాజ్​ను లేపేందుకు ప్రయత్నిస్తుండగా, మరో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఇద్దరిపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో నవాజ్, అశోక్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. 

కల్వకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీలను కలకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ ది కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. నవాజ్ కు భార్య, కూతురు ఉన్నారు.