జనాల జోలికోస్తే ఊరుకునేది లేదు

జనాల జోలికోస్తే ఊరుకునేది లేదు

కేంద్ర బడ్జెట్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడుతూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో విజన్ లేదన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగం విన్నాక తనకు.. ప్రస్తుతం రెండు భారతదేశాలు ఉన్నాయని అనిపించిందన్నారు. ఒకటి ధనికుల కోసం.. మరొకటి పేదల కోసమన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగంపై ఒక్క మాట కూడా లేదన్నారు. దేశవ్యాప్తంగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే... మీ ప్రభుత్వం వారికి ఒక్కటి కూడా ఇవ్వలేకపోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.  2021లో 3 కోట్ల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఈ రోజు భారతదేశం 50 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగాన్ని ఎదుర్కొంటుందన్నారు. మీరు మేడ్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా అని మాట్లాడుతున్నారు, కానీ యువతకు వారికి రావాల్సిన ఉపాధి లభించలేదన్నారు. వారికి ఉన్న ఉపాధి కనుమరుగైందన్నారు రాహుల్ గాంధీ. 


తనను అగౌరవపరిస్తే బాధపడతానని... కానీ దేశ ప్రజల్ని అగౌరవ పరిస్తే తాను ఊరుకోనన్నారు. ఈ దేశం కోసం తన కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. నానమ్మను చంపేశారు.. తన తండ్రిని బాంబులతో పేల్చేశారంటూ రాహుల్ సభలో ఉద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లతో పోలిస్తే దేశం బలహీన పడిందన్నారు. దేశంలో 48 శాతం ప్రజల ఆదాయం పడిపోయిందని ఆరోపించారు. దేశ పునాదుల్ని బలహీన పరుస్తున్నారని విమర్శించారు. దేశంలో పేదల్ని కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

ప్రస్తుతం భారత జాతి ప్రమాదంలో ఉందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశ పునదులతో ఆడగుకుంటున్నాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, పెగాసస్ వంటి వాటితో రాష్ట్రాల  ప్రజల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.  చైనీయులు తాము ఏమి చేయాలనుకుంటున్నారో వారికి చాలా స్పష్టమైన అవగాహన ఉందన్నారు. భారతదేశ విదేశాంగ విధానంలోఏకైక అతిపెద్ద వ్యూహాత్మక లక్ష్యం పాకిస్తాన్, చైనాలను వేరువేరుగా ఉంచడం. కానీ మీరేం చేశారంటే వాళ్లను ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,