కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తకున్నా..ఏటా 16 వేల కోట్లు కట్టాల్సిందే

కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తకున్నా..ఏటా 16 వేల కోట్లు కట్టాల్సిందే
  • ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా రూ.25 వేల కోట్ల భారం
  • రాష్ట్ర బడ్జెట్​లో 20 శాతం నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు
  • వచ్చే 12 ఏండ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మోయాల్సిందే 
  • ఫైనాన్షియల్​గా ఈ ప్రాజెక్టు ఏమాత్రం వయబుల్ ​కాదు.. 2019లోనే బ్యారేజీల్లో డ్యామేజీల గుర్తింపు
  • డ్రాఫ్ట్​ రిపోర్టులో తేల్చిచెప్పిన కాగ్

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చుక్క నీళ్లు ఎత్తిపోయకున్నా ఏటా బడ్జెట్​ నుంచి రూ.16 వేల కోట్లు చెల్లించాల్సిందేనని కంప్ట్రోలర్ ​అండ్​ఆడిటర్​జనరల్ (కాగ్) తేల్చి చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం కోసమే రూ.25,109.41 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని, ఇది రాష్ట్ర బడ్జెట్​లో దాదాపు 20 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కాగ్​ డ్రాఫ్ట్​ రిపోర్టు తాజాగా బయటకొచ్చింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పు  ఈ ఏడాది లోన్​రీపేమెంట్​ఈఎంఐ రూ.14,462 కోట్లు, విద్యుత్​సంస్థలతో ఇరిగేషన్​శాఖ చేసుకున్న ఒప్పందం మేరకు ఏటా ఫిక్స్​డ్​చార్జీల రూపేణ చెల్లించాల్సిన రూ.1,337.59 కోట్లు, ఆపరేషన్​ అండ్ ​మెయింటెనెన్స్ ఖర్చు రూ.273 కోట్లు కలిపి రూ.16 వేల కోట్లు చుక్కా నీళ్లు ఎత్తిపోయకున్నా చెల్లించాల్సిందేనని కాగ్​పేర్కొంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం నాటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని దాదాపు అన్ని పంప్​హౌస్​లు అందుబాటులోకి వచ్చి పూర్తి స్థాయిలో కరెంట్​వినియోగం ప్రారంభమవుతుందని,  అన్ని పంపులు రన్​చేస్తే ఏటా రూ.936.97 కోట్ల కరెంట్​బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టులో ఒక్క మోటారు నడిచినా, నడువకున్నా ఏటా ఫిక్సుడ్​చార్జీల రూపేణ రూ.1,337.59 కోట్లు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన లోన్​ల రీపేమెంట్, కరెంట్​బిల్లులు, ప్రాజెక్టు ఆపరేషన్​అండ్​మెయింటనెన్స్​కు వెచ్చించే మొత్తాన్ని కలుపుకుంటే ఏటా బడ్జెట్​లో రూ.25 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కాగ్​స్పష్టం చేసింది. ఇలా ఖజానా నుంచి 2031–32 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా రూ.24 వేల కోట్ల నుంచి రూ.21 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి రెండేళ్లు రూ.19 వేల కోట్లకు పైగా, 2034 –35లో రూ.15 వేల కోట్లు, 2035 –36 ఆర్థిక సంవత్సరంలో రూ.11,359 కోట్లు ఖజానా నుంచే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

రీఇంజనీరింగ్​తో మరింత నష్టం

కాళేశ్వరం ద్వారా 195 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఏటా కరెంట్ ​బిల్లుల కోసమే రూ.9,400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కాగ్ చెప్పింది. కానీ ఇరిగేషన్ ​డిపార్ట్​మెంట్ ​సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్​లో కరెంట్ ​చార్జీల కోసం రూ.4,148.80 కోట్లే ఖర్చవుతాయని పేర్కొన్నదని కాగ్ ​ఎత్తిచూపింది. ఎనర్జీ ఫిక్స్​డ్​ చార్జీలను కలుపుకుంటే మొత్తం కరెంట్​చార్జీలకు రూ.10,374.56 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక టీఎంసీ నీటిని లిఫ్ట్​ చేయడానికి రూ.1.33 కోట్ల చొప్పున160 టీఎంసీలకు రూ.212.89 కోట్లు ఖర్చయ్యేది.. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మూడు స్టేజీల్లో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి రూ.8.61 కోట్లు ఖర్చవుతాయి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు195 టీఎంసీలు ఎత్తిపోయడానికి రూ.1,679 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మేడిగడ్డ నుంచి180 టీఎంసీలే ఎత్తిపోసినా తుమ్మిడిహెట్టితో పోల్చితే రూ.1,336.91 కోట్లు అదనంగా ఖర్చు చేయాలి. రీ ఇంజనీరింగ్ ​పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్​ల కోసం రూ.21,879 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని కాగ్​పేర్కొంది.

రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలే ఆదాయం

సీడబ్ల్యూసీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.81,911.01 కోట్లతో అనుమతులు ఇచ్చిందని, అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం రూపాయి ఖర్చు చేస్తే 1.52 రూపాయల ఆదాయం సమకూరుతుందని డీపీఆర్​లో పేర్కొన్నారని, కానీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1,49,317.22 కోట్లకు పెరిగిందని కాగ్​ తెలిపింది. రిజర్వాయర్లలో చేపల పెంపకం ద్వారా రూ.1,750 కోట్ల ఆదాయం సమకూరుతుందని, 20 రిజర్వాయర్ల పరిధిలోని 3.5 లక్షల హెక్టార్ల పరిధిలో చేపల పెంపకం ఉంటుందని గత ప్రభుత్వం చెప్పిందని, కానీ16 రిజర్వాయర్ల పరిధిలోని 30,823 హెక్టార్లలోనే చేపల పెంపకం చేపట్టినట్లు కాగ్​చెప్పింది. తద్వారా రూ.154 కోట్ల ఆదాయమే సమకూరనుందని, డీపీఆర్​లో దీన్ని పది రెట్లు పెంచి చూపించినట్లు పేర్కొంది. పరిశ్రమలకు16 టీఎంసీల నీటిని సరఫరా చేయడం ద్వారా రూ.3,805 కోట్లు వస్తాయని గత సర్కారు చెప్పిందని,  కానీ రూ.914.50 కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదని చెప్పింది. ప్రాజెక్టు కోసం రూపాయి ఖర్చు చేస్తే 52 పైసల ఆదాయమే వస్తుందని చెప్పింది.

లోపాలు ముందే ఎత్తిచూపిన కాగ్​

భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల కింద ఒక టీఎంసీ నీళ్లతో 7,784 ఎకరాల నుంచి10 వేల ఎకరాలు సాగవుతుండగా, కాళేశ్వరం కింద వానాకాలంలో ఒక టీఎంసీతో17,668 ఎకరాలు, యాసంగి​లో ఒక టీఎంసీతో 18,163 ఎకరాలు సాగవుతుందని డీపీఆర్​లో గత ప్రభుత్వం పేర్కొన్నదని, దేశంలోని ఏ ఒక్క ప్రాజెక్టు కింద ఒక టీఎంసీతో పది వేల ఎకరాలకు మించి సాగవడం లేదని కాగ్​ఆక్షేపించింది. కాళేశ్వరంలో ఉద్దేశపూర్వకంగా సాగు విస్తీర్ణాన్ని డబుల్​చేసి చూపించిందని కాగ్ ​ఎత్తిచూపింది.

పంట ఉత్పత్తులను పెంచి చూపి

కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున లోన్లు తెచ్చుకోవడానికి గత సర్కారు డీపీఆర్​లో వ్యవసాయ ఉత్పత్తులను భారీగా పెంచి చూపిందని కాగ్ చెప్పింది. సాధారణంగా ఒక హెక్టార్ (రెండున్నర ఎకరాల్లో)లో 31.92 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా కాళేశ్వరం కింద 50 క్వింటాళ్లు వస్తుందని పేర్కొన్నదని,  మక్క హెక్టార్ కు 50 క్వింటాళ్లు, జొన్నలు 40 క్వింటాళ్లు, పెసలు, మినుములు 22 క్వింటాళ్ల చొప్పున, వేరుశనగ 40 క్వింటాళ్లు, పత్తి 35 క్వింటాళ్లు, సోయాబీన్​ 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చూపిందని, కానీ ఆ స్థాయిలో దిగుబడి ఉండదని కాగ్​ చెప్పింది. కాళేశ్వరం నీళ్లతో పండే పంటల ద్వారా రూ.15,107 కోట్ల ఆదాయం వస్తుందని డీపీఆర్​లో పేర్కొనగా.. వాస్తవంగా 12,621.92 కోట్లకు మించి రాదని కాగ్ తేల్చిచెప్పింది.