
నన్ గా మారాలనుకున్న యువతి బావిలో శవమై తేలింది. కాన్వెంట్‌లో 21 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన కేరళలో జరిగింది. చుంగప్పారాకు చెందని దివ్య గత ఐదేళ్ల నుంచి పతనమిట్ట జిల్లా, తిరువల్ల ప్రాంతానికి చెందిన పాలియక్కరలోని బాసిలియన్ సిస్టర్స్ కాన్వెంట్‌లో చదువుతుంది. ఆమె తన చదువు తర్వాత నన్ గా మారాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం దివ్య ఆద్యాత్మిక తరగతులకు హాజరవుతోంది. గురువారం దివ్య క్లాసులో ఉండగా.. టీచర్ ఒక విషయం గురించి రాయమని చెప్పింది. దాంతో దివ్య క్లాసు నుంచి బయటకు వచ్చింది. కాసేపటి తర్వాత కాన్వెంట్ ఆవరణలో ఉన్న బావిలో ఏదో పడ్డట్లు కొంతమంది నన్ లు శబ్దం విన్నారు. వెంటనే ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బందికి సమాచారమిచ్చారు. పోలీసులు దివ్యను బావి నుంచి బయటకు తీసి.. దగ్గరలో ఉన్న పుష్పగిరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దివ్య మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
‘దివ్య ఆధ్యాత్మిక తరగతులకు హాజరవుతోంది. తరగతి గదిలో టీచర్ దివ్యను ఏదో రాయమని చెప్పారు. వెంటనే దివ్య తరగతి గది నుంచి మధ్యలో దానిని రాయడానికి బయటకు వచ్చింది. ఇతర సన్యాసినులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. దివ్యకు ఎటువంటి సమస్యలు లేవు. దాంతో మేం దివ్య మరణాన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేశాం. కేసుకు సబంధించి విచారణ జరుగుతుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించాం’అని తిరువల్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఉమేష్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించి దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొంటూ మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
కాగా.. కాన్వెంట్ లోని బావి చుట్టూ రక్షణ గోడ ఉంది. అలాంటప్పుడు దివ్య బావిలో ఎలా పడిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
For More News..