సర్కార్ హాస్టళ్లలో 2,147 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

సర్కార్ హాస్టళ్లలో 2,147 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత
  • పది నెలల్లో 34 చోట్ల ఫుడ్ పాయిజన్
  • సర్కార్ హాస్టళ్లలో 2,147 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత
  • వారానికో ఇన్సిడెంట్ వెలుగులోకి.. క్వాలిటీ లెస్ ఫుడ్, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
  • ‘హక్కు ఇన్షియేటివ్ స్టడీ’లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న స్టూడెంట్స్ కు పెట్టే భోజనం క్వాలిటీగా ఉండడం లేదు. దీంతో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి స్టూడెంట్స్ అస్వస్థతకు గురవుతున్నారు. తాగే నీళ్లు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు గడిచిన 10 నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరగగా, ఇందులో 2, 147 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటీవ్‘ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన స్టడీలో వెల్లడైంది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేనని, బయటికి రాని ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేకం ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధి కోట నీలిమ వెల్లడించారు.


18 జిల్లాల్లో  కేసులు


రాష్ట్రంలోని గురుకులాలకు సప్లై చేస్తున్న బియ్యాన్ని సరైన ప్లేస్ లో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి.  ఆ బియ్యాన్ని సరిగా కడగకపోవడం, పాడైపోయిన కూరగాయలు వండడం, కిచెన్  శుభ్రంగా ఉండకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని తనికెళ్ల ట్రైబల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ఘటన నుంచి ఈ నెల 5న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లోని కేజీబీవీలో అటుకుల టిఫిన్ లో పురుగులు వచ్చిన ఘటన వరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినట్లు ‘హక్కు ఇనిషియేటీవ్’ సంస్థ రిపోర్టులో వెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్గొండ, వికారాబాద్ లో రెండు చొప్పున, సిద్దిపేట, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒకటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జూలై 15న బాసర ట్రిపుల్ ఐటీ లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 150 మంది వరకు స్టూడెంట్స్ అస్వస్థతకు గురికాగా,  సిద్దిపేట మైనార్టీ బాలికల గురుకులంలో 120 మంది, ఖమ్మం జిల్లా తనికెళ్ల ట్రైబల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 100 మంది, గట్టు మండలంలో బాలికల గురుకుల స్కూల్ లో వంద మంది వరకు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

రికార్డు స్థాయిలో స్టూడెంట్స్​కు అస్వస్థత


గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ ఫుడ్ పాయిజన్, ఎక్కువ మంది అస్వస్థతకు గురైన ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఏటా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణాలెన్నో.. 

 

  • ఎప్పటికప్పుడు బియ్యం పంపిణీ చేయకుండా ఒకేసారి డంప్ చేస్తున్నారు. కిచెన్ లో తడిగా ఉన్న ఏరియాలో బియ్యం నిల్వం చేయడంతో పురుగు పడుతోంది. 
  • కిచెన్​లో పరిశుభ్రత పాటించడం లేదు. బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయి.  
  • చాలా చోట్ల తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వాడడం లేదు. సప్లయర్లు సెకండ్, థర్డ్ గ్రేడ్ నిత్యావసరాలను సప్లై చేస్తున్నారు. దీంతో కూరలు బాగుండడం లేదు. 
  • మిషన్ భగీరథ వాటర్ గురుకులాలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలినప్పుడు తాగే నీళ్లు కలుషితమవుతున్నాయి. చాలా చోట్ల బోరు వాటరే దిక్కవుతున్నది. 
  • కొన్ని చోట్ల పాడైపోయి, ఫంగస్ వచ్చిన ఆహారాన్ని కొన్నిసార్లు వడ్డిస్తున్నట్లు గుర్తించారు. 
  • ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేయడం లేదు. 

క్వాలిటీ బియ్యం,కూరగాయలు సప్లై చేయాలి


చాలా గురుకులాలు, హాస్టళ్లలో కిచెన్లు హైజినిక్​గా ఉండడం లేదు. కప్పలు, బొద్దింకలు, బల్లులు తిరుగుతున్నాయి. వంట చేస్తుండగా అవి అన్నం, కూరల్లో పడడంతోనే ఎక్కువ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. హాస్టల్ స్టూడెంట్స్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కలుషిత ఆహారం వల్ల వచ్చిన నొప్పిని సాధారణ కడుపు నొప్పిగానే భావిస్తున్నారు. వీరు భవిష్యత్ లో జీర్ణ సంబంధ వ్యాధులను ఎదుర్కొనే ప్రమాదముంది. ప్రభుత్వం కిచెన్లను ఆధునీకరించి బియ్యం, కూరగాయల్లో క్వాలిటీ ఉండేలా చూడాలి. మంత్రులు ట్వీట్ లతో సరిపెట్టొద్దు.    


- కోట నీలిమ, హక్కు ఇనిషియేటీవ్ ప్రతినిధి