యూఎల్‌‌‌‌సీ కింద 2 వేల 152 ఎకరాలు.. 22A కింద ఉండడంతో క్రయవిక్రయాలు బంద్.. బ్యాంకు లోన్లు రాక తిప్పలు

యూఎల్‌‌‌‌సీ కింద 2 వేల 152 ఎకరాలు.. 22A కింద ఉండడంతో క్రయవిక్రయాలు బంద్.. బ్యాంకు లోన్లు రాక తిప్పలు
  • రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు 
  • పేద, మధ్యతరగతి వారి అర్జీలు 4,325 పెండింగ్​
  • 22ఏ కింద ఉండడంతో క్రయవిక్రయాలు బంద్
  • బ్యాంకు లోన్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: అర్బన్ ల్యాండ్ సీలింగ్​యాక్ట్ కింద రాష్ట్రవ్యాప్తంగా 2,152 ఎకరాల భూములున్నట్లు ప్రభుత్వానికి ఉన్నతాధికారులు రిపోర్టు ఇచ్చారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్​చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరి జిల్లాల్లోనే ఉన్నట్లు తేల్చారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో జీవోలు 455, 456, 747 కింద ప్రజల నుంచి 11,388 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 5,809 దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా 5,579 దరఖాస్తులు ఏండ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి.

ఇందులో పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించిన జీవో 747 పరిధిలోనివే 4,325 దరఖాస్తులు ఉండటం గమనార్హం. అన్ని రకాల పన్నులు కట్టి, ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉండడంతో క్రయవిక్రయాలు సాగక, అత్యవసరాలకు బ్యాంకుల నుంచి లోన్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌‌‌‌లో ఉన్న యూఎల్సీ అప్లికేషన్లను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని త్వరగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం జారీ చేసింది.

థర్డ్ పార్టీ కొనుగోలుదారులకూ మేలు 
కోర్ సిటీ హైదరాబాద్‌‌‌‌తో పాటు వరంగల్ అర్బన్ పరిధిలోనూ యూఎల్సీ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 5,263 దరఖాస్తులు రాగా ఇందులో 4,927 క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ. 61.62 కోట్ల ఆదాయం వచ్చింది. జీవో 455 కింద 328, జీవో 456 కింద 2, జీవో 747 కింద 6 చొప్పున మొత్తం 336 దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. అలాగే వరంగల్ అర్బన్ పరిధిలో జీవో 747 కింద 190, జీవో 92 కింద 196 దరఖాస్తులు కలిపి మొత్తం 386 ఫైళ్లు నిలిచిపోయాయి.

థర్డ్​పార్టీ రూపంలో కొనుగోలు చేసిన వేలాది మంది పరిస్థితి దయనీయంగా మారింది. అసలు భూ యజమానుల నుంచి లేదా మధ్యవర్తుల నుంచి ప్లాట్లు కొనుక్కుని ఇండ్లు నిర్మించుకున్న వారి నుంచి వచ్చిన దరఖాస్తుల్లో మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరిలో 191, రంగారెడ్డిలో 163, వరంగల్‌‌‌‌లో 386, హైదరాబాద్‌‌‌‌లో 14 కలిపి మొత్తం 754 దరఖాస్తులు పరిశీలన దశలోనే ఆగిపోయాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం వీటిని క్లియర్ చేస్తే, ఏండ్ల తరబడి వివాదాల్లో చిక్కుకున్న ఈ 754 కుటుంబాలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ హక్కులు లభించనున్నాయి. 

నాలుగు ఏరియాల్లో 2,152 ఎకరాల భూమి
అధికారిక రికార్డుల ప్రకారం నాలుగు అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 879 క్లియరెన్స్ సర్టిఫికెట్ల పరిధిలో 2,152.22 ఎకరాల యూఎల్సీ భూమి ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరి జిల్లాలో 640 సీసీల పరిధిలో 1,252.64 ఎకరాలు ఉండగా, రంగారెడ్డిలో 118 సీసీల పరిధిలో 703 ఎకరాలు, వరంగల్‌‌‌‌లో 101.8 ఎకరాలు, హైదరాబాద్ జిల్లాలో 121 సీసీల పరిధిలో 94.78 ఎకరాల భూమి ఉంది. 

ఇప్పుడు అర్హులైన వారి దరఖాస్తులను వేరుచేసి వారికి పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి, రక్షణ కంచెలు వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కుతుందని ఆఫీసర్లు నివేదిక సమర్పించారు.