రాష్ట్రంలో 23 శాతం మందిలో చూపు సమస్య

రాష్ట్రంలో 23 శాతం మందిలో చూపు సమస్య
  • హైదరాబాద్​లో 36 శాతం మంది బాధితులు 
  • కరోనాకు ముందటితో పోలిస్తే 4 రెట్లు అధికం 
  • ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి 
  • కరోనా ప్రభావంతో పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం 
  • ఎక్కువ సేపు స్క్రీన్ చూడడంతో కండ్లపై ఎఫెక్ట్ 
  • బడి పిల్లలందరికీ టెస్టులు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం 

హైదరాబాద్‌‌, వెలుగు: బడి పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. లాక్ డౌన్ టైమ్​లో డిజిటల్​, ఆన్ లైన్ క్లాసులతో టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూడడం పెరిగి పిల్లల కండ్లపై ఎఫెక్ట్ పడింది. క్లాస్ రూమ్ లో బోర్డు కనిపించక చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఏ క్లాసులో చూసినా ఐదారుగురు అద్దాలతోనే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో కంటి సమస్యలు తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌‌, రంగారెడ్డి, నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లాల్లో సర్వే చేసింది. ప్రతి వంద మందిలో సగటున 23 మంది పిల్లలు కండ్లు సరిగా కనబడక ఇబ్బంది పడుతున్నట్టు ఇందులో తేలింది. కరోనాకు ముందు 6 శాతం మంది పిల్లల్లో మాత్రమే చూపు సమస్య ఉండగా, ఇప్పుడది ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. బాధిత పిల్లల్లో దాదాపు 95 శాతం మంది దూరపు చూపు సమస్యతోనే బాధపడుతున్నట్లు డాక్టర్లు సర్వేలో గుర్తించారు. ఆ పిల్లలకు అవసరమైన అద్దాలు అందజేశారు. కాగా, హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాల్లో ఏకంగా 36 శాతం మందిలో కంటి చూపు సమస్య ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.   

మూడు జిల్లాల్లో సర్వే 

అర్బన్‌‌, రూరల్‌‌, ట్రైబల్ అని మూడు రకాలుగా విభజించి పైలట్ సర్వే చేశారు. అర్బన్‌‌లో భాగంగా హైదరాబాద్‌‌ ముషీరాబాద్‌‌లోని ఓ స్కూల్‌‌ను ఎంచుకున్నారు. అక్కడి పిల్లలకు కంటి పరీక్షలు చేయగా, 36 శాతం మందికి చూపు సమస్య ఉన్నట్టు గుర్తించారు. రూరల్ విభాగంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఓ స్కూల్‌‌ను ఎంచుకొని టెస్టులు చేశారు. ఇక్కడ 18 శాతం మంది పిల్లల్లో చూపు సమస్య ఉన్నట్టు తేలింది. ట్రైబల్‌‌ ఏరియాల్లో సమస్యను తెలుసుకునేందుకు నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పిల్లలకు టెస్టులు చేశారు. వీరిలో 9.5 శాతం మందికి చూపు సమస్య ఉన్నట్టు వెల్లడైంది. మొత్తంగా మూడు ఏరియాల్లో సగటు తీస్తే 23 శాతం మంది పిల్లల్లో చూపు సమస్య ఉన్నట్టు గుర్తించారు. 

సమస్యకు కారణాలివీ...  

కరోనా కారణంగా స్టూడెంట్లు దాదాపు రెండేండ్లు ఆన్​లైన్​క్లాసులకే పరిమితమయ్యారు. దీంతో టీవీలు, ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. కరోనా వల్ల బయటకు వెళ్లే అవకాశం లేక ఎక్కువ సేపు వాటితోనే గడిపారు. బయటకు వెళ్లకపోవడంతో సూర్యరశ్మికి దూరమయ్యారు. దీంతో చిన్నారులు మయోపియా (సమీపదృష్టి) బారినపడ్డారని డాక్టర్లు చెబుతున్నారు. కృత్రిమ వెలుతురులో మొబైల్​స్క్రీన్​ను గంటల తరబడి చూడడం వల్ల కూడా కండ్ల పనితీరు దెబ్బతిని మయోపియాకు దారితీసిందంటున్నారు. మయోపియా వచ్చిన పిల్లలు దగ్గరి వస్తువులను బాగానే చూడగలిగినా దూరంగా ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేరు. హైదరాబాద్‌‌ వంటి అర్బన్ ఏరియాల్లో ఇండ్లలోకి వెలుతురు రాకపోవడం, తల్లిదండ్రులు పిల్లలకు సొంతంగా స్మార్ట్‌‌ఫోన్లు, ల్యాప్ టాప్‌‌లు కొనివ్వడం, ఆడుకోవడానికి బయటకు పంపించకుండా స్క్రీన్ చూడడానికి అనుమతివ్వడం లాంటి కారణాలతో ఇక్కడి పిల్లల్లో సమస్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. అర్బన్‌‌తో పోలిస్తే రూరల్‌‌లో కొంత స్ర్కీన్ టైమ్ తక్కువగా ఉంటుంది. రూరల్ ఏరియాల్లోని పిల్లలతో పోలిస్తే ట్రైబల్ ఏరియాల్లో ఉండే పిల్లల స్ర్కీన్‌‌ టైమ్ ఇంకా తక్కువగా ఉంటుంది. అలాగే సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌‌పోజ్ అవుతుంటారు.   

ఇవి తినండి.. 

కంటి ఆరోగ్యానికి విటమిన్–ఎ అవసరం. ఇది క్యారెట్, ఆరెంజ్,  పాలు, డెయిరీ ఉత్పత్తులు, ఆకు కూరలు, ఉడకబెట్టిన గుడ్లు, కాలేయం, చేపలు, రొయ్యల్లో అధికంగా ఉంటుంది. క్యారెట్, చిలకడదుంప, ఆకుకూరలు, టమాట, క్యాప్సికం, బొప్పాయి, గుమ్మడి.. ఇలా ఆయా సీజన్లలో దొరికే తాజా పండ్లు, కూరగాయలు తీసుకున్నా విటమిన్ ఎ శరీరానికి అందుతుంది. 

ఇలా చేయండి.. 

స్ర్కీన్‌‌ టైమ్‌‌ తగ్గించాలి. అవసరమైతే తప్ప ఫోన్‌‌లో వీడియోలు చూడొద్దు. సోషల్ మీడియా వినియోగానికి రోజూ కొంత టైమ్‌‌ లిమిట్ పెట్టుకోవాలి. వీలును బట్టి వారానికి ఒకట్రెండు రోజులు స్ర్కీన్‌‌ (ఫోన్ లేకుండా) చూడకుండా గడపాలి. రోజూ కొంతసేపు విశాలమైన ప్రదేశాల్లో, పార్కుల్లో గడపాలి. 

స్ర్కీనింగ్ సిద్దిపేట నుంచి.. 

ఎక్కువ మంది పిల్లల్లో చూపు సమస్య ఉన్నట్టు పైలట్ సర్వేలో తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కంటి వెలుగు తరహాలో టెస్టులు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయనున్నారు. ఎవరికైనా సర్జరీలు అవసరమైతే ఉచితంగా చేయిస్తామని బ్లైండ్‌‌నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహించాలని, సిద్దిపేట జిల్లాలో మొదలుపెట్టాలని భావిస్తున్నారు. తొలుత 8, 9, 10వ తరగతి స్టూడెంట్లకు, ఆ తర్వాత 6, 7వ తరగతి విద్యార్థులకు, మూడో దశలో 1 నుంచి 5వ తరగతి స్టూడెంట్లకు టెస్టులు చేయాలని ప్రణాళికలు రూపొందించామని హెల్త్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. 

అన్ని స్కూళ్లలో టెస్టులు చేయిస్తం.. 

ఆన్‌‌లైన్‌‌ క్లాసులతో పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటయ్యారు. ఈ అలవాటు కంటి సమస్యలను తెచ్చిపెట్టింది. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్ల సమస్యను అలాగే వదిలేస్తున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో పిల్లలు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పిల్లలకు కంటి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. స్కూళ్లల్లో క్యాంపులు పెట్టి, దశలవారీగా పిల్లలందరికీ టెస్టులు చేయించి అద్దాలు అందజేస్తాం. తల్లిదండ్రులు కూడా పిల్లల స్ర్కీన్ టైమ్‌‌ను తగ్గించేందుకు చొరవ చూపాలి.

- హరీశ్‌‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి 

ఎన్నో అనర్థాలు.. 

  • కంటి సమస్యకు నిద్రలేమీ కారణమే. పిల్లలైనా, పెద్ద వాళ్లయినా రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు ఫోన్‌‌తో గడుపుతున్నారు.  ఫోన్ స్ర్కీన్‌‌ లైట్‌‌ నేరుగా కంటిపై పడడం, రేడియేషన్​ ఎఫెక్ట్‌‌తో కంటి పొరలు దెబ్బతింటున్నాయి. దీంతో చాలామందికి  నిద్రపట్టదు. కండ్లకు  రెస్ట్ దొరక్క చూపు మందగిస్తుంది.
  • ఎలక్ట్రానిక్ స్క్రీన్ నుంచి వెలువడే నీలికాంతి వల్ల కంటి రెటీనాలోని కొన్ని సున్నితమైన కణాలు అతిగా ఉత్తేజితమవుతాయి. దీని వల్ల నిద్రలేమి, కలత నిద్ర ఉండొచ్చు. పిల్లలకైతే ప్రవర్తనలో సైతం తేడాలొస్తాయి.  రంగులను గుర్తించే శక్తి తగ్గుతుంది.
  • ఒక్కసారి కంటి సమస్యలు వస్తే  అవి తరతరాలకూ కొనసాగొచ్చు. తల్లికో, తండ్రికో దృష్టి లోపాలుంటే పుట్టే పిల్లలకూ ఆ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. 
  • కండ్ల మసక, దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడాన్ని చాలా మంది పట్టించుకోవట్లేదు. కొన్నేండ్లు అలాగే వదిలేస్తే మెల్లకన్ను రావొచ్చు. కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది.

కంటికి సూర్యరశ్మి అవసరం..

పిల్లలు గంటల తరబడి స్ర్కీన్‌‌ దగ్గరగా పెట్టుకొని చూస్తున్నారు. దీని వల్ల కండ్లు ఒత్తిడికి గురై మయోపియా బారినపడుతున్నారు. ఆఫ్‌‌లైన్ క్లాసులు మొదలైన తర్వాత చాలా మంది పిల్లలు బ్లాక్‌‌ బోర్డు మీది అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అలాగే వదిలేస్తే మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆన్‌‌లైన్‌‌ క్లాసులు తప్పనిసరి అయినప్పుడు పిల్లలకు స్మార్ట్‌‌ ఫోన్లకు బదులు ల్యాప్‌‌టాప్స్‌‌ లేదా డెస్క్‌‌టాప్స్‌‌ ఇవ్వాలి. గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్లు ఇవ్వొద్దు. పిల్లలు బయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. కంటికి సూర్యరశ్మి చాలా అవసరం. పిల్లలను వీలైనంత సమయం ఎండలో ఉండనివ్వాలి. 

- డాక్టర్ అమర్‌‌‌‌సింగ్ నాయక్‌‌, ఆఫ్తాల్మాలజిస్ట్‌‌, అడిషనల్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్