కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో భూమాయ..భారీగా అక్రమాలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో భూమాయ..భారీగా అక్రమాలు

కరీంనగర్, వెలుగు : తమది కాని రెండెకరాల భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్​చేసుకున్నరు. దాన్ని వేరే వాళ్లకు అమ్మి కోట్లలో సంపాదించుకున్నరు. డాక్యుమెంట్లలో సర్వే నంబర్ వేస్తే తెలుస్తదని తెలివిగా ఇంటి నంబర్ వేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నరు. ఇలా ఒకటే ఇంటి నంబర్​పై 29 రిజిస్ట్రేషన్లు చేయడంతో ఆ  నోటా ఈ నోటా పడి బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు నామామాత్రంగా ఎంక్వైరీ చేసి రిజిష్ట్రేషన్లు రద్దు చేసి వదిలేశారు. ఈ దొంగ డాక్యుమెంట్లు సృష్టించింది ఎవరు? ఫేక్  సర్టిఫికెట్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసి అమ్మిన వాళ్లెవరు? లాంటి విషయాలు  తేల్చకుండా వదిలేయడంపై ప్రస్తుతం అనుమానాలు కలుగుతున్నాయి. కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్​ మండలంలో జరిగిన ఈ వ్యవహారంలో తవ్విన కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి.  

అన్ని ఫేక్ డాక్యుమెంట్లే.. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని 629 సర్వే నంబర్ లో ప్రభుత్వ, అసైన్డ్​భూమి కలిపి సుమారు 58 ఎకరాలుంది. ఇందులో ప్రభుత్వ అవసరాలకు పోగా కొంత భూమిని  పేదలకు కేటాయించారు. 629/13, 629/14 సర్వే నంబర్లలోని రెండెకరాల భూమి నుస్తులాపూర్ కు  చెందిన సర్వర్ జానీకి చెందినది.  దీనిపై గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కన్నుపడింది. ఈ జాగాను హస్తగతం చేసుకోవడానికి ప్లాన్ వేశారు. యజమాని జానీ 2021 మే లో చనిపోయాడు. కానీ ఈయన బతికుండగానే 2007లో  చనిపోయినట్లుగా 2008 లో ఫేక్ డెత్ సర్టిఫికెట్  సృష్టించారు.   జానీకి ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. జానీకి కేవలం భార్య మాత్రమే ఉందని తిమ్మాపూర్ తహసీల్దార్  ఆఫీస్ నుంచి 2009 లో ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకున్నారు. వీటి సాయంతో  ఫేక్ డాక్యుమెంట్లు తయారుచేశారు. 

లేని ఇంటికి నంబర్  

గ్రామానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. ఇతని అనుచరులు కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో చేతులు కలిపి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకున్నారు. వీరు రెండెకరాలను ఎలాగైనా రిజిస్ట్రేషన్​చేసుకోవాలని ఓపెన్ ల్యాండ్ లో  2–91/10 అనే ఇంటి నెంబర్  తీసుకున్నారు. అక్కడ కనీసం పునాదులు కూడా  తీయలేదు. కానీ ఎలాగో ఇంటి నంబర్​ సంపాదించి దానికి ఇంటి పన్ను కట్టినట్లు రశీదు, గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫై కాపీ తీసుకున్నారు. కానీ గ్రామపంచాయతీ రశీదులపై ప్రస్తుతం ఉన్న సెక్రెటరీ సంతకానికి బదులు ఇంతకు ముందు పని చేసిన కార్యదర్శి సంతకాలున్నాయి. రశీదులపై ఎలాంటి తేదీలు కూడా లేవు. ఇదంతా గ్రామ పంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది చేతివాటంతోనే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తోడు కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఈ  ఇంటి నంబర్​ వివరాలను ఆన్ లైన్ చేయడం చూస్తే పలు అనుమానాలు కలగక మానవు. ఈ ఇంటి నంబర్లు ఇవ్వడంలోనూ కింది స్థాయి నుంచి పై ఆఫీసర్ల వరకు పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.  

గుడ్డిగా రిజిష్ట్రేషన్లు.. 

అక్రమార్కులు రెండెకరాల స్థలాన్ని 29 ప్లాట్లుగా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీటన్నింటికి ఒకటే ఇంటి నంబర్​చూపారు. తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్​ఆఫీస్ లో రిజిస్ట్రేషన్​చేసేప్పుడు సర్వే నంబర్ కాకుండా ఇంటి నంబర్లు తెచ్చారు. సర్వే నంబర్లు పరిశీలిస్తే పూర్తిగా అసైన్డ్, గవర్నమెంట్ ల్యాండ్​ అని తెలిసేది. గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న రశీదుల్లో తేదీలు లేని విషయాన్ని కూడా పట్టించుకోలేదు. రెవెన్యూ ఆఫీస్ నుంచి ఫేక్ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు పెట్టగా, రికార్డులు పరిశీలించలేదు. ఇలా ఏమాత్రం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా గుడ్డిగా రిజిస్ట్రేషన్​చేశారు. రిజిస్ట్రేషన్​చేసే టైంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  రామకృష్ణ కాలనీలో ఈ ఒక్కేట కాదని, ఇలాంటి అసైన్డ్​, ప్రభుత్వ  భూములకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మిన కేసులు ఎన్నో ఉన్నట్టు తెలుస్తోంది.   

బాధ్యులపై చర్యలేవి? 

రామకృష్ణ కాలనీ లో అసైన్డ్​ల్యాండ్ ను అమ్మిన ఘటనపై అడిషనల్​కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ విచారణ మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీలో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఒకే ఇంటి నంబర్​మీద చేసుకున్న రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అయితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామపంచాయతీలో  తప్పు చేసిందెవరు? ఎలా ఆన్ లైన్ లోకి మారింది? ఏవీ పరిశీలించకుండా రిజిస్ట్రేషన్లు చేసిన వారెవరు? అనే దానిపై విచారణ జరపడం లేదు. ఈ కథను ఇంతటితో ముగిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయి.