వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 3 వేల ఫిర్యాదులు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 3 వేల ఫిర్యాదులు
  • రూ.16 కోట్లకు పైగా నష్టపోయిన బాధితులు 
  • పోయినేడు 129 కేసులు.. ఈసారి 610 ఎఫ్ఐఆర్ లు
  • కేసులను సాల్వ్ చేయలేకపోతున్న పోలీసులు 
  • సైబర్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం

హనుమకొండ, వెలుగు: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మార్ట్​ఫోన్లు, ఇంటర్నెట్​సాయంతో జనం బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఈ ఏడాది వరంగల్ కమిషనరేట్​పరిధిలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈసారి 25 రెట్లు ఎక్కువ కంప్లయింట్లు వచ్చాయి. పోయినేడు 129 కేసులు మాత్రమే నమోదవ్వగా, ఈసారి ఏకంగా 3,004 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఇక 2019లో 89, 2020లో 99 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే గడిచిన మూడేండ్లలో దాదాపు 300 రెట్లు కేసులు పెరిగాయి. అయితే ఈ ఏడాది కంప్లయింట్లు అనూహ్యంగా పెరగడంతో పోలీసులు రూ.లక్షకు పైగా జరిగిన నేరాలకు మాత్రమే కేసులు నమోదు చేశారు. దీంతో ఈసారి 3 వేలకు పైగా కంప్లయింట్స్ వచ్చినప్పటికీ, 619 కేసులు మాత్రమే నమోదు చేశారు. ఈ కేసుల్లో మొత్తం రూ.16 కోట్లకు పైగా బాధితులు నష్టపోయారు.  

24 కోట్లకు రికవరీ 3 కోట్లే... 

సైబర్ ఫ్రాడ్ జరిగిన 24 గంటల్లోగా 1930 టోల్ ఫ్రీ నెంబర్ లేదా లోకల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే ఖాతాలోని అమౌంట్ ను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కేసుల ఛేదన, చోరీ సొత్తు రికవరీ చాలా తక్కువగా ఉంటోంది. గత నాలుగేండ్లలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 927 కేసులు నమోదు కాగా.. పోలీసులు  234 కేసులను ఛేదించి 204 మందిని అరెస్ట్ చేశారు. నాలుగేండ్లలో దాదాపు రూ.23.48 కోట్లను సైబర్​ దొంగలు దోచుకోగా, కేవలం రూ.3.04 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. హర్యానాలోని గుర్గావ్, రాజస్థాన్​లోని భరత్​పూర్, జార్ఖండ్​లోని జామ్ తార, పశ్చిమ బెంగాల్​లోని కోల్​కతా లాంటి ప్రాంతాల్లో సైబర్ ముఠాలు ఏర్పడ్డాయని.. ఈ ముఠాలు ఆన్​ లైన్ ద్వారా ఫైనాన్షియల్, నాన్​ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నాయని సైబర్ క్రైమ్​పోలీసులు​తెలిపారు. ప్రత్యేకంగా ఇన్ స్టిట్యూట్లు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాయని చెప్పారు. లింక్​లు, ఓటీపీలు పంపించి బోల్తా కొట్టించడంపై నేర్పిస్తున్నాయని పేర్కొన్నారు. 

సైబర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎంతో మేలు.. 

రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్​కమిషనరేట్​ల పరిధిలో ప్రత్యేకంగా సైబర్​స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న నగరం కావడం, సైబర్ క్రైమ్స్​ పెరుగుతుండడంతో వరంగల్ లోనూ సెపరేట్ గా సైబర్​స్టేషన్​ ఏర్పాటు చేయాలనే ప్రపోజల్ ఉంది. కానీ ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం కమిషనరేట్​ బిల్డింగులో సైబర్​వింగ్ మాత్రమే పని చేస్తుండటంతో కేసుల ఛేదనకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఒక సీఐ, అసిస్టెంట్ అనాలిటికల్​ఆఫీసర్, ఇంకో ఏడుగురు కానిస్టేబుళ్లు మాత్రమే పని చేస్తున్నారు. దీంతో కేసులు పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటున్నాయి. సైబర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఒక ఏసీపీ స్థాయి ఆఫీసర్​ తో పాటు ఇద్దరు సీఐలు, పది మంది ఎస్సైలు, మిగతా సిబ్బంది అంతా కలిపి దాదాపు 40 మంది స్టాఫ్ సైబర్​ నేరాల నియంత్రణ, కేసుల ఛేదనకు పని చేసే అవకాశం ఉంటుంది. 

బాధితుల్లో చదువుకున్నోళ్లే ఎక్కువ.. 

మల్టీ నేషనల్​ కంపెనీల్లో ఉద్యోగాలు, కేవైసీ అప్ డేషన్, క్రెడిట్ కార్డ్స్, బిజినెస్, గిఫ్టులు, బిట్ కాయిన్స్, షేర్​మార్కెటింగ్, డేటింగ్, మ్యాట్రిమొనీ యాప్స్ తదితరాల పేరుతో సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు డీటెయిల్స్ అప్​డేట్​ చేయాలంటూ లింక్​లు పంపించి, లేదంటే ఎనీ డెస్క్​లాంటి యాప్​లు ఇన్​స్టాల్​ చేయించి మోసం చేస్తున్నారు. ఓఎల్ఎక్స్​లో తక్కువ ధరకే వెహికల్స్​ అమ్ముతామనో.. అమ్మాయిల ఫొటోలను ఎర వేసి బోల్తా కొట్టించడమో చేస్తున్నారు. అయితే వీరి బారినపడి మోసపోతున్న వారిలో ఎక్కువ శాతం చదువుకున్నోళ్లే ఉంటున్నారు. నమోదైన కేసుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు,  స్టూడెంట్లు, పోలీసులు, లీడర్లు కూడా బాధితులుగా ఉన్నారు.