
వినాయక నిమజ్జనం తమకు ఛాలెంజింగ్ బందోబస్తు అని అన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్. ఇందుకోసం నెలరోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి ఆయా విభాగాలతో సమన్వయం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సారి నిమజ్జనం కోసం 3 వేల 200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్ట్ ల్లోబందోబస్తు విధుల్లో పాల్గొంటారని చెప్పారు.
గణేష్ నిమజ్జనాల కోసం నెల రోజుల ముందునుంచే రూట్ ఇన్స్ఫెక్షన్స్ చేసి ఆయా విభాగాలకు అవసరమైన సూచననలు ముందుగానే చేశామని తెలిపారు. విగ్రహాలు అమ్మే దూల్ పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రణాళికా బద్ధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సారి వినాయక నిమజ్జనాలకు పది వేల పైగా టస్కర్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పది లక్షల మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
వ్యక్తిగత వాహనాలు వద్దు.. ప్రజా రవాణా వినియోగించాలి:
శనివారం (సెప్టెంబర్ 06) ఉదయం ఆరు గంటలకు బడా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుందని తెలిపారు సీపీ. నాలుగో నెంబర్ క్రేన్ వద్ద 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. బడా గణేష్ నిమజ్జనం చూడటానికి వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వినియోగించాలని కోరారు.
పార్కింగ్ స్థలాలు అక్కడే:
నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్దభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ MMTS స్టేషన్ తదితర ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విగ్రహాలు వచ్చే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు:
వినాయక విగ్రహాలు వచ్చే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. భక్తులు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుందని తెలిపారు. ఆయా రూట్లో జనరల్ ట్రాఫిక్ అనుమతి ఉండదని చెప్పారు.
ఇక సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయని చెప్పారు. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయని అన్నారు. టప్పచబుత్ర, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
ప్రధాన రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్:
నిమజ్జనం సందర్భంగా ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు సీపీ జోయల్ డేవిస్. సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్ గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయని తెపారు. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశిఫా ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు చెప్పారు.
►ALSO READ : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. 29 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ
శివాజీ బ్రిడ్జ్, పుత్లీబౌలి, హిమాయత్నగర్, వైఎంసిఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాం డ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు. ట్రాఫిక్ ఆంక్షలు దృష్టా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లకు వెళ్లే వారికి:
విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ స్కై వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లేవారు బేగంపేట, ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారు.
డ్రోన్లు, హై రైజ్ కెమెరాలతో పర్యవేక్షణ:
నిమజ్జనం కోసం వాహనాలు కదిలే తీరును రెండు డ్రోన్లు,14 ప్రాంతాల్లో హై రైజ్ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు సీపీ చెప్పారు. చిన్న విగ్రహాలు తీసుకుని వచ్చే వారు వారికీ కేటాయించిన బేబీ ఫాండ్ లలో నిమజ్జనం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటమే కాకుండా క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తామని తెలిపారు.
గత నాలుగు రోజుల నుండి ప్రయివేట్ బస్సులను సిటీలోకి అనుమతించడం లేదని చెప్పిన సీపీ.. ఆర్టీసీ బస్సులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ జనాలకు అందిస్తామని తెలిపారు.
భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారని చెప్పారు.