ఎక్కడ చూసినా చెత్తే .. జీవీపీలుఎత్తేసిన చోటనే తెచ్చిపోస్తున్న జనం 

ఎక్కడ చూసినా చెత్తే .. జీవీపీలుఎత్తేసిన చోటనే తెచ్చిపోస్తున్న జనం 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని రోడ్ల వెంట చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గార్బేజ్ ఫ్రీ సిటీ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 3,400 గార్బేజ్​వల్నరబుల్​పాయింట్లు(జీవీపీ) ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఇటీవల 492 చోట్ల ఎత్తేశారు..

తొలగించిన సర్కిళ్లలోని సిబ్బందికి అవార్డులు ఇచ్చి, సన్మానాలు చేశారు. అయితే ఇంటి ముందుకు స్వచ్ఛ ఆటోలు రాని కాలనీవాసులు చేసేదేం లేక రాత్రి సమయంలో చెత్తను తెచ్చి రోడ్ల వెంట కుప్పలుగా పోస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తకుప్పలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బల్దియా పరిధిలో దాదాపు 5 వేల కాలనీలు ఉండగా వెయ్యికి పైగా కాలనీల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతోంది. .

కార్వాన్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, మలక్ పేట, జూబ్లీ హిల్స్, బేగంపేట, మూసాపేట, పఠాన్ చెరువు, సరూర్ నగర్ తదితర సర్కిళ్లల్లో సమస్య ఎక్కువగా ఉంది. తమ కాలనీలకు స్వచ్ఛ ఆటోలు రావడం లేదని, కొన్నిచోట్ల అంతా ఆఫీసులకు, పనులకు వెళ్లాక వస్తున్నాయని జనం వాపోతున్నారు. ఇంటి బయట పెడితే ఎవరూ తీసుకెళ్లడం లేదని, అదే టైంలో కుక్కలు, పిల్లులు పాడు చేస్తున్నాయని చెబుతున్నారు. దీంతో చేసేదేం లేక రాత్రి సమయంలో గతంలో డస్ట్​బిన్​లు ఉండే ప్రాంతాల్లోనే చెత్త పారబోస్తున్నారు.

డస్ట్​బిన్​లు లేకపోవడంతో కుప్పలుగా పేరుకుపోయి రోడ్లపైకి వస్తోంది.4,500 స్వచ్ఛ ఆటోలు ఉన్నప్పటికీ, రోజూ వెయ్యి ఆటోలు ఫీల్డ్ లోకే రావడం లేదు. వచ్చిన వారు లిమిటెడ్ గా తీసుకెళ్తున్నారు. ఫలితంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్​ నుంచి కాలనీలు, బస్తీల వరకు చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. టోలీచౌకి, పార్సిగుట్ట, యూసుఫ్ గూడ, సుల్తాన్​బజార్, అల్వాల్, కోఠి, అబిడ్స్, కింగ్​కోఠి, అమీర్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జీడిమెట్ల, కూకట్ పల్లి, మాదాపూర్, గౌలిపురా తదితర ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్​లోని మేయర్ ఇంటికి సమీపంలో రోడ్డు వెంట చెత్తకుప్పలు ఇబ్బందికరంగా మారాయి. ఏటా చెత్త తరలింపునకు రూ.460 కోట్ల ఖర్చు చేస్తున్నప్పటికీ సమస్య తీరడం లేదు.