నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

అంగన్ వాడి స్కూల్లో దారుణం
స్కూల్ స్కావెంజర్ నిర్వాకం
ఫోక్సో చట్టం కింద కేసు, రిమాండ్
మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి

రేగోడ్, వెలుగు: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారి అత్యాచారం, హత్య ఉదంతం మరువక ముందే మరో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. అంగన్ వాడి స్కూళ్లో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొత్వాన్ పల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొత్వాన్ పల్లి ప్రైమరీ స్కూల్ ఆవరణలోని అంగన్ వాడి కేంద్రం లో నాలుగేళ్ల చిన్నారి చదువుకుంటోంది. అదే స్కూల్లో రెండేళ్లుగా స్కావెంజర్ గా పని చేస్తున్న సార జైపాల్ చిన్నారులపై కన్నేశాడు. ఈ నెల 22 న స్కూల్ ముగిసిన తర్వాత అక్కడే ఆడుకుంటున్న పాపను స్కూల్ పై అంతస్తులోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన మిగతా పిల్లలు కేకలు వేసుకుంటూ వెళ్లి చిన్నారి ఇంట్లోవాళ్లకి చెప్పారు. వెంటనే తల్లితండ్రులు స్కూల్​కు చేరుకుని నిందితుడు జైపాల్ ను నిలదీశారు.

పంచాయితీ తేలకపోవడంతో..

చిన్నారిపై జరిగిన విషయం బయటికి తెలిస్తే ఊరి పరువు పోతుందని గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. మూడ్రోజులుగా చర్చలు జరిగినా పంచాయితీ ఎటూ తేలకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఆందోల్ ఎం‌‌ఎల్‌‌ఏ చంటి క్రాంతి కిరణ్ పాప కుటుంబీకులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారుల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్​వాడి టీచర్ లావణ్య, ఆయా లలిత పై చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీడీపీవో శశికళ చెప్పారు. అత్యాచారానికి యత్నించిన స్కూల్ స్కావెంజర్ జైపాల్ ను విధుల  నుండి తొలగించినట్లు కొత్వాన్ పల్లి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సరస్వతి చెప్పారు.