సర్కారు.. సాయమేది? .. భారీ వర్షాలు, వరదలతో 40 వేల కుటుంబాలు ఆగం

సర్కారు.. సాయమేది? .. భారీ వర్షాలు, వరదలతో 40 వేల కుటుంబాలు ఆగం
  • సర్కారు.. సాయమేది?
  • భారీ వర్షాలు, వరదలతో 40 వేల కుటుంబాలు ఆగం
  • పరామర్శలు తప్ప పైసా ఇయ్యని మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం
  • 30 మందికి పైగా చనిపోతే అంత్యక్రియలకూ ఆదుకోలే
  • ఇండ్లు కూలిన వాళ్ల దిక్కు కూడా చూస్తలే
  • కట్టుబట్టలతో మిగిలిన బాధితులు.. నిత్యావసరాలకూ కటకట  
  • పంట నష్ట పరిహారంపైనా ప్రకటన చేయలే
  • పరామర్శలు తప్ప పైసా ఇయ్యని మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం
  • 30 మందికి పైగా చనిపోతే అంత్యక్రియలకూ ఆదుకోలే
  • ఇండ్లు కూలిన వాళ్ల దిక్కు కూడా చూస్తలే
  • కట్టుబట్టలతో మిగిలిన బాధితులు.. నిత్యావసరాలకూ కటకట  
  • పంట నష్ట పరిహారంపైనా ప్రకటన చేయలే

3 వేల దాకా ఇండ్లు కూలిపోతే ఏ ఒక్కరికీ పరిహారం రాలేదు. వరదలకు 30 మందిపైగా చనిపోతే.. తక్షణ సాయం కింద అంత్యక్రియలకైనా పైసలియ్యలేదు. మరోవైపు 16 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయి, వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసి, ఎలా గట్టెక్కాలో తెలియక కన్నీళ్లతో దిక్కులు చూస్తున్న రైతులకు భరోసా ఇచ్చేటోళ్లు లేరు. ఇటీవలే కేంద్రం నుంచి రూ.188 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ వచ్చినా.. వాటిని ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారుకు చేతులు రావడం లేదు.

సర్వం కోల్పోయి అగోలిస్తున్న బాధితులు

ఈ నెల 23, 24 తేదీల్లో కుండపోత వర్షాలకు ఉత్తర తెలంగాణ అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగి, వందలాది చెరువులు తెగిపోయి ఊళ్లు, పంటపొలాలు నీట మునిగాయి. వర్షాలు, వరద తీవ్రత ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వందకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరంగల్‌‌‌‌, ఖమ్మం, మంచిర్యాల టౌన్లలో 200కుపైగా కాలనీలు జలమయమయ్యాయి. గోదావరి ముంపు వల్ల ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. మోరంచ, జంపన్నవాగు ఉధృతితో మోరంచపల్లి, కొండాయి లాంటి గ్రామాలు తుడిచిపెట్టుకపోయాయి. వరద బాధితుల్లో ఎంతో మంది కట్టుబట్టలతో మిగిలారు. వేలాది కుటుంబాలు తినడానికి తిండిలేక అగోలిస్తున్నాయి. నిత్యావసరాలకూ కటకట ఏర్పడడంతో వండుకునే పరిస్థితీ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు వచ్చి ఓదార్చడమే తప్ప పైసా సాయం చేయడం లేదు. కేవలం ములుగు జిల్లాకు మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌ రూ.కోటి ప్రకటించి వెళ్లిపోయారు. ఆ సొమ్ము కూడా కలెక్టర్ అకౌంట్‌‌లోనే ఉంది. వీటితో తెగిన రోడ్ల మరమ్మతులు, పునరావాస కేంద్రాల ఏర్పాటు లాంటి పనులే చేస్తున్నారు. సర్కారు ఏమీ ఇవ్వకపోవడంతో పలువురు లీడర్లు తమ ట్రస్ట్‌‌‌‌ల తరపున ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు.

అవకాశమున్నా ఆదుకోలే!

విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు తక్షణ సాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్టేట్​డిజాస్టర్ రెస్పాన్స్​ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద ఏటా రెండు విడతల్లో కేంద్రం ఫండ్స్ కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్డీఆర్ఎఫ్ కింద తెలంగాణకు కేంద్రం రూ.479 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్రం 75% వాటా కింద రూ.358 కోట్లు ఇస్తే, రాష్ట్రం 25% వాటాగా రూ.120 కోట్లు ఇవ్వాలి. కేంద్రం మొదటి విడతగా ఇటీవల 188.80 కోట్లను రాష్ట్రానికి రిలీజ్ చేసింది. స్టేట్​వాటాగా 25% కలిపితే సుమారు రూ.246 కోట్లు రాష్ట్రం వద్ద ఉన్నాయి. వీటి యుటిలైజేషన్​ సర్టిఫికెట్లు సమర్పిస్తే కేంద్రం నుంచి మరో రూ.188.80 కోట్లు వస్తాయి. 2015 ఏప్రిల్​1 నుంచి అమల్లోకి వచ్చిన జీవో ప్రకారం వరదలో ఇండ్లు మునిగితే బట్టలకు రూ.1,800, పాత్రలు, ఇంటి సామాన్లకు రూ.2 వేల చొప్పున రూ.3,800 తక్షణ సాయంగా చెల్లించాలి. పాక్షికంగా కూలిన ఇండ్లకు రూ.3,200 చొప్పున,  పూర్తిగా కూలిపోతే రూ.96 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. రాష్ట్రంలో వెయ్యి ఇండ్లు పూర్తిగా, 2 వేలకు పైగా పాక్షికంగా కూలిపోగా, బాధితులకు ఎలాంటి సాయం చేయలేదు. దీంతో ఇండ్లు కోల్పోయిన బాధితులు సర్కారు బడుల్లో, గుడుల్లో, బంధువుల ఇండ్లలో కాలం వెల్లదీస్తున్నారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, అవయవాలను కోల్పోతే రూ.60 వేల నుంచి రూ.2 లక్షల దాకా అందించాలని ఎస్డీఆర్ఎఫ్ నిబంధనలు చెప్తున్నాయి. కానీ ప్రాణ నష్టం జరిగిన వారికి కూడా తక్షణ సాయం అందించకపోవడంతో పేదలు అంత్యక్రియలకూ దిక్కులు చూడాల్సి వస్తోంది.

పంట నష్ట  పరిహారంపైనా ప్రకటన చేయలే

ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మోరంచ, చలివాగు, జంపన్నవాగులు పొంగడం, 120 చెరువులు తెగిపోవడం వల్ల 15 వేల ఎకరాల్లో పంటలు కొట్టుకపోయి ఇసుక మేటలు వేశాయి. చెరువులు మరమ్మతులు చేసేదాకా మరో 50 వేల ఎకరాలను బీడు భూములుగా వదిలేయాల్సిన పరిస్థితి. ఈ జిల్లాల్లో ఇసుక మేటలను తొలగించడం మామూలు విషయం కాదు. ఇందుకు ఎకరాకు కనీసం రూ.50 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. మరోవైపు ఇటీవల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. 

ఆర్థిక సాయం ప్రకటించి పట్టించుకోలే


భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో 30 మందికిపైగా చనిపోయారు. అత్యధికంగా ములుగు జిల్లాలో 16 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 12 మంది డెడ్​బాడీలు దొరికాయి. భూపాలపల్లి జిల్లాలో ఆరుగురు చనిపోతే ఇంకా ఇద్దరి మృతదేహాలు దొరకలేదు. ఆసిఫాబాద్‌‌ జిల్లాలో తుంపెల్లి వాగులో ఇద్దరు, వరంగల్‌‌‌‌ సిటీలో ముగ్గురు, నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఒకరు, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌‌‌‌ మండలం నర్సింగరావుపల్లిలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో ఒకరు, కరీంనగర్‌‌‌‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో ఒకరు నీటిలో గల్లంతయ్యారు. ఆయా కుటుంబాలకు కేంద్రం ఇచ్చే ఎస్డీఆర్ఎఫ్ ద్వారా రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌ మూడు రోజుల కింద ములుగులో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఒక్కరికీ పైసా ఇయ్యలేదు. కనీసం అంత్యక్రియల కోసమైనా సాయం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పలకరించినోళ్లు లేరు


నేను ఒంటరి మహిళను. ఇద్దరు ఆడపిల్లలున్నరు. ఇల్లంతా కూలిపోయింది. మా బాగోగులు అడిగి తెలుసుకున్నవారు లేరు. పిండి మిల్లు దెబ్బతిని, వస్తువులు కొట్టుకపోయి రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. ఇప్పటి వరకు లీడర్లు గానీ, అధికారులు గానీ సాయం చేయలేదు. ఒక్కరిద్దరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఫొటోలు దిగి పోయిన్రు.


‒ కనూరి కృష్ణవేణి, వెంకటేశ్వర నగర్ కాలనీ, ఖమ్మం

బోరు కొట్టుక పోయింది

నాకు 4 ఎకరాల భూమి ఉంది. వర్షాలకు మానేరు ఉప్పొంగడంతో పొలాల్లోని బోరు, పైపులు కొట్టుకపోయాయి. రూ.80 వేలకు పైగా నష్టం వాటిల్లింది. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఈ ఇసుకను తీయాలంటే రూ.2 లక్షల ఖర్చు వస్తది. సర్కారు ఆదుకోకపోతే ఆత్మహత్యే గతి.


‒ ఇనుగంటి రవీందర్ రావు, వల్లెంకుంట, మల్హర్‌‌‌‌ మండలం

సాయం చేసినోళ్లే లేరు

నాలుగు రోజుల కింద పెద్ద వాన పడి మా పెంకుటిల్లు కూలిపోయింది. ఆఫీసర్లు వచ్చి చూసి పేరు రాసుకొని పోయిన్రు. ఇంత వరకు ఎలాంటి సాయం చేయలేదు. మా ఇల్లు కూలిపోయిన తెల్లారి నేను, నా పిల్లలు స్కూల్​లో ఉన్నం. తర్వాత అక్కడ ఉండనీయలే. మా పక్కింట్లో ఉంటున్నం. ఇలా ఎన్ని రోజులు ఉండగలం? సర్కారు సాయం చేస్తే ఇంటికి రిపేర్ చేయించుకుంటం.

- లక్ష్మి, తాళ్లపల్లిగడ్డ తండా, మెదక్ జిల్లా 

పైసా ఇయ్యలే

వర్షాలకు మా ఇల్లు కూలిపోయింది. రెవెన్యూ ఇన్​స్పెక్టర్ వచ్చి ఫొటో తీసుకొనిపోయిండు. గవర్నమెంట్ కు వివరాలు పంపుతమని, అక్కడి నుంచి డబ్బులు రాగానే ఇస్తామన్నరు. ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఎక్కడ ఉండాలో సమజైతలేదు. ఇప్పుడైతే చుట్టాల ఇంట్లో ఉంటున్నాం. సర్కారు ఆదుకుంటే రేకులైనా వేసుకుంటం.
- బొంగు చిన్న వెంకన్న, లింగాపూర్, కడెం మండలం, నిర్మల్​ జిల్లా.