- రోడ్డు విస్తరణ పేరిట ప్రైవేట్ ల్యాండ్‌లోని షాపులను నేలమట్టం చేసిన అధికారులు
- సెటిల్మెంట్ కోసం ఓ ప్రజాప్రతినిధికి రూ.3 కోట్ల నజరానా ?
- 40 ఏండ్లుగా టేలాల మీదనే బతుకుతున్నం.. న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
మంచిర్యాల, వెలుగు: తనకు ఓటేసి గెలిపించిన జనం కోసం పని చేయాల్సిన ప్రజాప్రతినిధే.. కమీషన్ల కక్కుర్తితో పేదల పొట్టకొట్టిన ఉదంతమిది. మంచిర్యాల నడిబొడ్డున ప్రైవేట్ భూ వివాదంలో తలదూర్చిన సదరు నేత.. పెద్ద మొత్తంలో నజరానా తీసుకొని పేదలను ఖాళీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ దుకాణాలు కాపాడుకునేందుకు పేదలు కోర్టుకు వెళ్లగా, స్టే ఆర్డర్ వచ్చే అవకాశముందని తెలిసిన సదరు ప్రజాప్రతినిధి అనుకున్నదే తడువు మున్సిపల్ అధికారుల సాయంతో షెడ్లను కూల్చివేయించాడు.
దీంతో ఆ షాపులే జీవనాధారంగా బతుకుతున్న చిరువ్యాపారులు ఉపాధికి దూరమయ్యారు. గతంలో షాపులపై రోజుకు వెయ్యి, రెండు వేలు వస్తే కుటుంబాలను పోషించుకున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బాధితులు వాపోతున్నారు. ప్రైవేట్ ల్యాండ్‌లో 40 ఏండ్ల నుంచి ఉన్న షాపులను మున్సిపల్ అధికారులు ఏ అధికారంతో కూల్చేశారని ప్రశ్నిస్తున్నారు. తమకు హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని, తిరిగి టేలాలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.3 కోట్ల నజరానా..
మంచిర్యాల పట్టణంలోని ఏ1 హోటల్ పక్కన సర్వే నంబర్ 87లో దాదాపు ఎకరంన్నర భూమి ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో ఉన్నది. దీనిపై కొన్నేండ్లుగా హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. అందులో చిరువ్యాపారులు 40 ఏండ్లుగా షాపులు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. 2023లో దుకాణాలను తీసేయాలని బెదిరింపులకు గురిచేయడంతో చిరువ్యాపారులు హైకోర్టును ఆశ్రయించగా, కేసు నడుస్తున్నది.
మరోవైపు బాధితులకు అనుకూలంగా స్టే ఆర్డర్ రాకముందే షాపులను ఖాళీ చేయించాలని ప్రైవేటు వ్యక్తుల్లో ఒకరు మంచిర్యాలకు చెందిన ప్రజాప్రతినిధిని సంప్రదించాడు. రోడ్డు విస్తరణ పేరిట షాపులను తొలగించడంతో పాటు ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ నిర్మించుకునేంత వరకు సపోర్టుగా ఉండాలని కోరగా, ఈ సెటిల్మెంట్ కోసం సదరు ప్రజాప్రతినిధికి రూ.3 కోట్ల నజరానా ముట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోడ్డు విస్తరణ సాకుతో..
మంచిర్యాల మార్కెట్, బస్టాండ్ ఏరియాల్లో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ1 హోటల్ నుంచి మార్కెట్ రోడ్డు వరకు ఉన్న షాపులను తొలగించాలని మున్సిపల్, పోలీసు అధికారులు చిరువ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, అది ప్రైవేట్ ల్యాండ్, పైగా వంద ఫీట్ల రోడ్డు మధ్యలోని డివైడర్ నుంచి 50 ఫీట్లకు పైగా వదిలేసి, అధికారులు ఇచ్చిన మార్కింగ్ లోపలే షాపులు ఏర్పాటు చేసుకున్నారు.
అధికారుల తీరుపై అనుమానంతో చిరువ్యాపారులంతా ఏకమై హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా స్టే ఆర్డర్ వచ్చే అవకాశం ఉండడంతో అంతకుముందే కూల్చివేతలకు పూనుకున్నారు. జూన్ 23న ఉదయం 5 గంటలకే దాదాపు 200 మంది పోలీసు బందోబస్తు నడుమ జేసీబీలతో దుకాణాలను నేలమట్టం చేశారు. దీంతో వారి కుటుంబాలు జీవనాధారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
కోట్ల విలువైన జాగపై కన్ను..
మంచిర్యాల నడిబొడ్డున ఉన్న రూ.50 కోట్లకు పైగా విలువైన ఈ జాగపై ప్రజాప్రతినిధి కన్ను పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. ఓ వ్యక్తికి అనుకూలంగా హైకోర్టు ఆర్డర్ రాగానే ఈ స్థలాన్ని కారు చౌకగా కొట్టేయాలనే ప్లాన్‌తో తన సన్నిహితులను రంగంలోకి దించినట్టు సమాచారం.
వారు సదరు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిసింది. కానీ, అగ్రిమెంట్ జరిగిందా? లేదా? అనేది క్లారిటీ రాలేదు. ఓ ప్రజాప్రతినిధి తన స్వలాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పావుగా వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
విలువైన స్థలం కోసమే షాపులు కూల్చేసిన్రు
ప్రైవేట్ జాగలో ఉన్న మా షాపులను మున్సిపల్, పోలీస్ అధికారులు అన్యాయంగా, అక్రమంగా కూల్చివేశారు. హైకోర్టు స్టే మేరకు తిరిగి షాపులు ఏర్పాటు చేసుకుందామంటే రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం కోసం గుంతలు తవ్వి వదిలేశారు.
మున్సిపల్ అధికారులు గుంతలు పూడ్చడం లేదు. విలువైన స్థలం కోసమే మా షాపులను తొలగించారు. 40 ఏండ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఈ స్థలంపై మాకు హక్కు ఉంది.
ఖలీల్, బాధితుడు
