గరీబోళ్ల పిల్లలకు కొత్తరకం బడి

గరీబోళ్ల పిల్లలకు కొత్తరకం బడి

శ్రీ రామ్ సొంతూరు చెన్నై. ఢిల్లీలో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ జాబ్‌‌ చేసేవాడు. ‘పేదవాడిగా పుట్టడం తప్పుకాదు. పేదవాడిగా చనిపోవడం తప్పు’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాడు నలభై ఎనిమిదేండ్ల శ్రీ రామ్‌‌. అందుకే కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. చదువుకు దూరమై కుటుంబ భారాన్ని మోస్తున్న పేదపిల్లల జీవితాల్ని మార్చడానికి పెట్టిందే నలంద వే ఫౌండేషన్‌‌. ఈ ఫౌండేషన్‌‌లో చదువు ఒకటే కాకుండా మ్యూజిక్‌‌, థియేటర్‌‌‌‌, డాన్స్‌‌, పెయింటింగ్‌‌, ఫొటోగ్రఫీ, ఫిల్మ్‌‌మేకింగ్‌‌ లాంటివి నేర్పుతున్నాడు. ఉద్యోగం మానేసి, ఈ ఫౌండేషన్‌‌ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే..

ఆ సంఘటనల వల్లే..   

అది 2002వ సంవత్సరం. ప్రాజెక్ట్‌‌ కోసం గుజరాత్‌‌ వెళ్లాడు శ్రీ రామ్‌‌. అప్పుడు గుజరాత్‌‌లో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రులు చనిపోయి చాలామంది పిల్లలు రోడ్డున పడ్డారు.  ‘ఇలాంటివాళ్లను రోడ్డున వదిలేయకుండా, వాళ్లను చదివించి మంచి పొజిషన్‌‌లోకి తీసుకురావాల’ని అప్పుడే అనుకున్నాడు. తరువాత 2004లో ఒక చిన్న పిల్లాడు ట్రాఫిక్‌‌ సిగ్నల్స్‌‌ దగ్గర అగర్‌‌‌‌బత్తులు అమ్ముకుంటూ శ్రీ రామ్‌‌ దగ్గరికి వచ్చాడు. ‘కొనండి సార్‌‌’‌‌ అని బతిమిలాడుతుంటే అతన్ని దగ్గరికి పిలిచి ‘చదువుకోకుండా ఇవి ఎందుకు అమ్ముతున్నావ’ని అడిగాడు శ్రీ రామ్‌‌.  ‘మా నాన్న కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అమ్మ, అక్క కలిసి అగర్‌‌‌‌బత్తులు చేస్తుంటే... నేను వాటిని అమ్ముతున్నాన’ని చెప్పాడు. ‘స్కూల్‌‌కి వెళ్తే టీచర్లు కొడుతున్నారు. అందుకే స్కూల్‌‌కి వెళ్లట్లేద’ని కొంతమంది పిల్లలు చెప్పేవాళ్లు.  

స్కూల్‌‌ పెట్టి...

ఇలాంటి పిల్లలకు సరైన గైడెన్స్‌‌, మెంటార్స్‌‌ లేకపోవడంవల్లే వాళ్లు ఇలా తయారవుతున్నారు. మధ్యలోనే చదువు ఆపేసిన వాళ్లను, అనాథలను, స్కూల్‌‌కి వెళ్లలేని పేద పిల్లల్ని ఒక దగ్గర చేర్చాడు. వాళ్లకోసం ‘నలంద వే’ని స్థాపించాడు. వాళ్ల దగ్గరికి వెళ్లి ‘ఇది అన్ని స్కూళ్లలా కాదు. ఇందులో టీచర్లు మిమ్మల్ని ఏం అనరు. మీకు ఏ విషయంలో ఇంట్రెస్ట్‌‌ ఉంటే అందులో చేరండ’ని చెప్పేవాడు. ఇక్కడ చేరాక పిల్లల్లో భయం పోయింది. తొందరగా అన్ని విషయాలు నేర్చుకున్నారు. చెన్నైలో నలంద వేతో చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్‌‌ అయినందుకు ఢిల్లీ, బీహార్‌‌‌‌, తమిళనాడు, జమ్మూకాశ్మీర్‌‌‌‌లో కూడా మొదలుపెట్టాడు శ్రీ రామ్‌‌. ఈయన చేస్తున్న పని నచ్చి కొన్ని ఆర్గనైజేషన్‌‌లు డబ్బులు సమకూరుస్తున్నాయి. ఇంకొందరు వాళ్ల టీచింగ్‌‌ స్టాఫ్‌‌ను నలంద వేలో టీచ్‌‌ చేయడానికి పంపుతున్నారు. 

ఇక్కడ చదివిన చాలామంది పిల్లలు ఇప్పుడు వివిధ రంగాల్లో ప్రొఫెషనల్స్‌‌గా మారారు. సంగీతంలో బ్యాండ్స్‌‌ పెట్టుకొని విదేశాల్లో ప్రోగ్రామ్స్‌‌ ఇవ్వడానికి వెళ్తున్నారు. డైరెక్షన్‌‌ ఫీల్డ్‌‌లోకి అడుగుపెట్టారు. ఆర్టిస్ట్‌‌లుగా రాణిస్తున్నారు. ఇదే కాకుండా అవసరమైన చాలామంది పేద పిల్లలకి స్కాలర్‌‌‌‌షిప్స్‌‌ రూపంలో డబ్బులు కూడా ఇస్తున్నారు. నెలాఖరున పడే లక్షల జీతం, మధ్య మధ్యలో ప్రాజెక్ట్‌‌లో బాగంగా ఫారెన్‌‌ ట్రిప్‌‌లు, సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో కలిసి దేశమంతా సరదా టూర్లు. ఒక మనిషికి ఆనందంగా ఉండటానికి ఇంతకన్నా ఏం కావాలి? కానీ, శ్రీ రామ్‌‌ వి. అయ్యర్‌‌‌‌కి మాత్రం అవేవీ ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకే జాబ్ వదిలేశాడు. రోడ్లవెంట తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే పిల్లల జీవితాలని మార్చాలను కున్నాడు. అందుకే ‘నలందా వే ఫౌండేషన్‌‌’ పెట్టి లక్షల మంది పిల్లలకి ఆసరాని ఇస్తున్నాడు.