రాష్ట్రంలో ఆరు నెలల్లో బ్యాంకుల నుంచి రూ. 5,500 కోట్ల లోన్లు తీసుకున్నరు

రాష్ట్రంలో ఆరు నెలల్లో బ్యాంకుల నుంచి రూ. 5,500 కోట్ల లోన్లు తీసుకున్నరు
  •  హౌసింగ్​కు 4,950 కోట్లు.. ఎడ్యుకేషన్​కు  550 కోట్లు 
  • పెరిగిన ఇంటి నిర్మాణ ఖర్చు, ఎడ్యుకేషన్​ ఫీజులతో జనం అప్పులపాలు
  • ఊర్లలోనూ ఇల్లు కట్టుకోవాలంటే లోన్లే దిక్కు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లకు, చదువులకే సగటు జీవి లోన్ల మీద లోన్లు తీసుకుంటున్నాడు. ఈ రెండింటికీ గత ఆరునెలల్లో వివిధ రూపాల్లో బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రజలు తీసుకున్న లోన్లు దాదాపు రూ. 5,500 కోట్లు. సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు, కొనుగోలు చేసేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం పడుతుండటంతో జనం అప్పుల కోసం చూస్తున్నారు. ఆస్తులు, బంగారం కుదువ పెట్టి కొందరు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటుండగా.. మరికొంత మంది ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. పిల్లల చదువులకు భారీగా ఫీజులు పెరిగిపోవడంతో వాటి కోసం కూడా అప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలోనే (ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ వరకు) బ్యాంకులు హౌసింగ్​ లోన్ల కింద రూ. 4,950 కోట్లు, ఎడ్యుకేషన్ లోన్ల కింద రూ. 550 కోట్లు ఇచ్చాయి. ఇటీవల జరిగిన  బ్యాంకర్ల మీటింగ్​లో ప్రత్యేకంగా ఈ రెండు సెక్టార్లలో అప్పులపై చర్చించారు. అగ్రికల్చర్ తర్వాత హౌసింగ్, ఎడ్యుకేషన్  లోన్లకే బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

ఊర్లె ఇల్లు కట్టాలన్నా..!
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో సొంత ఇండ్ల నిర్మాణానికి, ఇండ్ల కొనుగోలుకు లోన్లు తీసుకుంటారు.  ఇప్పుడు ఈ పరిస్థితి గ్రామాలకు కూడా చేరింది. సాధారణంగా ఊర్లో ఒక డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి గంప గుత్తగా మేస్త్రీకి ఇస్తే కనీసం రూ.15 లక్షల నుంచి 17 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. దీంతో రూ. 4 లక్షల నుంచి 6 లక్షల వరకు అప్పటికే దాచుకున్న నగదుతో పాటు మిగతా మొత్తాన్ని అప్పుల రూపంలో తీసుకుంటున్నారు. ఇందుకోసం బ్యాంకులతో పాటు ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ఐటీ రిటర్న్స్​ ఇవ్వలేని వాళ్లు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక, పట్టణాల్లో ఇండ్లు కొంటున్న ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటూనే ఉన్నారు. ఇలా అంతా కలిపి ఈ ఆరు నెలల్లోనే  రూ. 4,950 కోట్లు ఇండ్ల కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బ్యాంకుల నుంచి హౌసింగ్ లోన్ల మొత్తం టార్గెట్ రూ.10,178 కోట్లు ఉన్నది. 

చదువులకు కనీస అప్పు రూ. 4 లక్షలు
ఒకప్పుడు బీటెక్, ఎంబీబీఎస్ వంటి చదువులకే ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు స్కూల్ లెవెల్ నుంచే పెద్ద మొత్తంలో ఫీజులు కట్టాల్సివస్తున్నది. పిల్లల ఇంటర్మీడియెట్​ చదువుల కోసం కూడా తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుంటున్నారని  బ్యాంకర్లు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ. 2,714 కోట్లు ఎడ్యుకేషన్ల లోన్ల కింద ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ఇందులో ఇప్పటికే ఆరునెలల్లో రూ. 550 కోట్లు ఇచ్చాయి. అన్ని కోర్సుల అడ్మిషన్లు పూర్తయితే లోన్లు ఇంకా పెరగనున్నాయి. ఎడ్యుకేషన్ కోసం మధ్యతరగతి ప్రజలు తీసుకుంటున్న కనీస అప్పు రూ. 4 లక్షలుగా ఉందని, గరిష్టంగా అది రూ. 12 లక్షల వరకు ఉందని బ్యాంకర్లు చెప్తున్నారు. 

చదువులకు ఫీజులు పెరగడంతో లోన్లు తీసుకుంటున్నరు
ఫారెన్​ స్టడీస్​ కోసం ఎడ్యుకేషన్​ లోన్లు తీసుకోవడం సాధారణమే. అయితే కరోనా తర్వాత  ప్రైవేట్​సెక్టార్​లో స్కూల్, ఇంటర్మీడియెట్, బీటెక్​ ఇతర ప్రొఫెషనల్​ కోర్సుల్లో ఫీజులు చాలా పెరిగాయి. దీంతో బ్యాంకు లోన్లు, ప్రైవేట్​ వడ్డీ వ్యాపారులపైన పేరెంట్స్​ ఆధారపడాల్సివస్తున్నది. ప్రైవేట్​వర్సిటీలు రావడంతో వాటిల్లోనూ ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాపులర్​ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్లలోనే  కాకుండా పర్లేదు అనుకునే కాలేజీల్లోనూ డిమాండ్​ కోర్సులకూ చాలా ఫీజు అడు గుతున్నారు. ఫీజుల విషయంలో మాని టరింగ్​తో పాటు ఎడ్యుకేషన్​ లోన్ల విష యంలో వడ్డీలపై బ్యాంకులతో ప్రభుత్వం మా ట్లాడి.. జనంపై భారం పడకుండా చూడాలి. 
- పగడాల లక్ష్మయ్య, పేరెంట్స్​ యూనియన్​ స్టేట్​ సెక్రటరీ

పల్లెల్లోనూ ఇండ్ల లోన్లకు క్యూ కడుతున్నరు
హౌసింగ్​ లోన్ల కోసం బ్యాంకులకు ప్రజలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్​ అనే కాకుండా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఉండే బ్యాంకులకు హౌసింగ్​ లోన్​ అప్లికేషన్లు వస్తున్నాయి. మూడు, నాలుగేండ్ల కిందటి వరకు అసలు పల్లెల్లో ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుల నుంచి అప్పు ఇవ్వడం అనేది చాలా అరుదు. ఇప్పుడు ఒక్కో ఊరు నుంచి పదుల సంఖ్యలో హౌసింగ్​ లోన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. నిర్మాణ వ్యయం పెరగడమూ ఇందుకు ఒక కారణం. 
- ఆర్.వెంకటేశ్వర్లు, బ్యాంకు రీజినల్​ మేనేజర్​