దక్షిణ మధ్య రైల్వేలో 5 ప్రైవేట్ రూట్లు

దక్షిణ మధ్య రైల్వేలో 5 ప్రైవేట్ రూట్లు

హైదరాబాద్‌‌, వెలుగు:   త్వరలో దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్‌‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మొత్తం 5 రూట్లలో ఈ రైళ్లను నడపనున్నట్టు తెలిసింది. దీనికి కేంద్రం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. నీతి ఆయోగ్ సూచన మేరకు దేశ వ్యాప్తంగా 100 రూట్లలో 150 రైళ్లకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మన దగ్గరా ప్రైవేట్‌‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. 10 నుంచి 15 రోజుల్లో ఓపెన్‌‌ బిడ్లు వేయనున్నారు. ఈ రైళ్లలో వరల్డ్‌‌క్లాస్‌‌ ఫెసిలిటీస్‌‌ కల్పించనున్నారు. రైలు 15 నిమిషాల కన్నా ఆలస్యంగా వస్తే సమయాన్ని బట్టి ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌‌-–విశాఖపట్నం, సికింద్రాబాద్‌‌–-చెన్నై, హైదరాబాద్‌‌–-బెంగళూరు, హైదరాబాద్‌‌–-గుజరాత్‌‌–-రాజస్థాన్‌‌, విశాఖపట్నం–-తిరుపతి రూట్లలో రద్దీ ఉంటోంది. దీంతో ఈ రూట్లనే ఫైనల్‌‌ చేయనున్నట్లు తెలిసింది. వయా వెళ్లే రైళ్లు కూడా ఈ రైల్వే పరిధిలోకి వచ్చి వెళ్లనున్నాయి. బెంగళూరు–-పాట్నా  రైలు హైదరాబాద్‌‌ మీదుగా, కోల్‌‌కతా– -చెన్నై  రైలు విజయవాడ మీదుగా, చెన్నై-– ముంబై రైలు అనంతరపురం మీదుగా వెళ్తాయని సమాచారం.

ట్రాక్​ ఒక్కటే రైల్వేది… మిగతావన్నీ ప్రైవేటువే…

దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్‌‌ అయిన తేజస్ ఎక్స్‌‌ప్రెస్ ను ఢిల్లీ–-లక్నో రూట్​లో అక్టోబర్‌‌లో ప్రారంభించారు. ఇది సక్సెస్‌‌ కావడంతో మిగతా రైళ్లకు కూడా పర్మిషన్​ ఇస్తున్నారు. ట్రాక్‌‌ మినహా మిగతావన్నీ ప్రైవేట్‌‌ వాళ్లే చూసుకుంటారు. రైళ్లు కూడా వారే తెచ్చుకోనున్నారు. స్టాఫ్‌‌, లోకోపైలట్‌‌, టీసీలు ఇలా అందరూ ప్రైవేట్‌‌ వాళ్లే ఉంటారు. టికెట్‌‌ ధరలను కూడా వారే నిర్ణయిస్తారు. ఈ రైళ్లను గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిపే అవకాశం ఉంది.  60 రోజుల ముందే టికెట్​బుక్​ చేసుకోవచ్చు.