విశ్లేషణ: 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో అనూహ్య మార్పులు

విశ్లేషణ: 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో అనూహ్య మార్పులు

2009లో అమెరికా ప్రెసిడెంట్​గా గెలిచిన తర్వాత ఒబామా ఒక స్టేట్ మెంట్​ ఇచ్చారు. ‘‘ఎలక్షన్ల తర్వాత మార్పులు తప్పవు”అనేది ఆయన చెప్పిన మాట. ప్రతి ఎన్నికతోనూ మార్పులు వస్తాయని, కొత్త లీడర్లు పుట్టుకొస్తారని ఆయన అంచనా వేశారు. ఒబామా చెప్పినట్టుగానే  ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మనదేశ రాజకీయాల్లో భారీ మార్పులను మనం ఆశించవచ్చు. ఈ ఎన్నికల తర్వాత చాలా మంది కొత్త లీడర్లు పుట్టుకొస్తారు. అందులో చాలా మంది జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపవచ్చు. మరికొందరు తమ వైఫల్యాలతో అధ:పాతాళానికి పడిపోవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులను తీసుకురావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం మన దేశంలో ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే.. ఏ రీజినల్​ పార్టీ కూడా ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో లేదు. కానీ, జాతీయ పార్టీలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పవర్​లో ఉన్నాయి. అది కేసీఆర్ అయినా, స్టాలిన్, మమతాబెనర్జీ, అరవింద్​ కేజ్రీవాల్​ ఇలా ఎవరైనా వీరందరూ కేవలం ఒకే రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన నాయకులు. ఎన్నికల కమిషన్​ నిబంధనల ప్రకారం ఏ పార్టీ అయినా దేశవ్యాప్తంగా ఒకే ఎలక్షన్​ సింబల్​తో నేషనల్​ పార్టీ హోదాను పొందాలంటే, ఆ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో కనీస సంఖ్యలో సీట్లను గెలవాల్సి ఉంటుంది.

ఒకానొక దశలో కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలో తమ ప్రభుత్వాలను కలిగి ఉండేవి. కానీ ఇప్పుడు, కమ్యూనిస్టు పార్టీలు కేవలం కేరళకు పరిమితం అయిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ ఉనికిని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆమ్​ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, పశ్చిమబెంగాల్​ సీఎం మమతాబెనర్జీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్​లో తాము ప్రభావం చూపించగలమని, తద్వారా జాతీయ పార్టీ హోదాను దక్కించుకోగలమని వారిద్దరూ భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు చాలా మంది పొలిటీషియన్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు అనూహ్యంగా తెరపైకి వస్తే, మరికొందరు పాతాళానికి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి పరిశీలిస్తే..

యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్​లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే, యోగి ఆదిత్యనాథ్​ మరోసారి ముఖ్యమంత్రి కావడమే కాదు, బీజేపీకి ఆయన నంబర్​ 2 లీడర్​గా ఎదుగుతారు. 51 ఏండ్ల వయసులోనే ప్రధానమంత్రి పదవి కోసం నరేంద్రమోడీ వారసునిగా యోగి తెరపైకి వస్తారు. ఉత్తరప్రదేశ్​లో బీజేపీ మళ్లీ గెలిస్తే, అప్పుడు యోగి ఆదిత్యనాథ్​ ఎన్నో రికార్డులను బద్ధలు కొడతారు. 1985 తర్వాత ఏ ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి కూడా రెండో టర్మ్​ అధికారంలోకి రాలేదు. ఆ అడ్డంకిని అధిగమించి యోగి మళ్లీ సీఎం అవుతారు. అలాగే యూపీలో విజయం యోగి చేసిన పనులన్నీ సరైనవే అన్న కాన్ఫిడెంట్​ను ఇస్తారు. కానీ, ఒకవేళ బీజేపీ ఉత్తరప్రదేశ్​లో ఓటమిపాలైతే మాత్రం.. యోగి ఆదిత్యనాథ్​ పొలిటికల్​ కెరీర్​కు సడెన్​ బ్రేక్​ పడినట్లే. అక్కడ తప్పులన్నీ యోగి ఆదిత్యనాథ్​వేనని, బీజేపీ ఎలాంటి పొరపాటు లేదని చెప్పేందుకు చాలా మంది శత్రువులు ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఉత్తరప్రదేశ్​లో ఓటమితో యోగి ఆదిత్యనాథ్​కు పెద్ద షాక్​ తప్పకపోవచ్చు.

అఖిలేశ్​ యాదవ్
ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం కావాల్సిన మరో నాయకుడు అఖిలేశ్​ యాదవ్. 2017 నుంచి ఆయన నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఒకవేళ ఈసారి ఓటమిపాలైతే ఆ పార్టీ అధికారానికి దూరమై 10 ఏండ్ల పాటు ఉండాల్సి వస్తుంది. అది అఖిలేశ్​పై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో విజయంతో 80 ఎంపీ సీట్లతో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంపై ఆయన కంట్రోల్​ సాధించగలుగుతారు. అప్పుడు ఆయన వచ్చే లోక్​సభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి పదవికి పోటీపడవచ్చు. లేదంటే కింగ్​మేకర్​గా మారవచ్చు. అందువల్ల యూపీ ఎన్నికలు అఖిలేశ్​ యాదవ్​కు చాలా కీలకమైనవిగా మారాయి.

మాయావతి
1995 నుంచి ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశారు బహుజన్​ సమాజ్​పార్టీ చీఫ్​ మాయావతి. 2012 నుంచి మాయావతి ఓటింగ్​ పర్సంటేజ్​ తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే ఆమె అధికారానికి దూరమై దాదాపు దశాబ్దం పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఆమె ఓటమి పాలైనా.. అఖిలేశ్​ యాదవ్​ కూడా అధికారానికి దూరంగా ఉన్నంత కాలం పెద్దగా ఆమె నష్టం ఉండకపోవచ్చు. కానీ, అఖిలేశ్​ యాదవ్​ గెలిస్తే మాత్రం, మాయావతి తన ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుంది. అదే అఖిలేశ్ యాదవ్​ ఓడితే మాత్రం, వచ్చే ఎన్నికల వరకు ఆమె సర్వైవ్​ కావాల్సి ఉంటుంది. రాజకీయ మనుగడ ప్రకారం చూస్తే, ఉత్తరప్రదేశ్​లో బీజేపీ విజయం సాధించినా మాయావతికి పర్లేదు కానీ, అఖిలేశ్​ యాదవ్​ మాత్రం తప్పకుండా ఓడిపోవాలి. అందువల్ల మాయావతి రాజకీయ భవితవ్యం ఇతర లీడర్ల తలరాతపై ఆధారపడి ఉంటుంది. తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికల్లో అఖిలేశ్​ యాదవ్​ను ఓడించేందుకు మాయావతి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.

అరవింద్​ కేజ్రీవాల్
ఈ ఎన్నికలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌ కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. కేజ్రీవాల్ పంజాబ్‌‌లో విజయం సాధించి, ఉత్తరాఖండ్, గోవాల్లో మెరుగైన పనితీరు కనబరిస్తే, అప్పుడు దేశంలోనే టాప్​ అపొజిషన్ లీడర్​గా ఆయన నిలుస్తారు. అఖిలేశ్​ యాదవ్, మమతాబెనర్జీ లేదా ఏ ప్రతిపక్ష నాయకుడు/నాయకురాలు కూడా కేజ్రీవాల్​తో సమానం కాలేరు. పంజాబ్‌‌లో విజయం కేజ్రీవాల్‌‌ను దేశంలోని ప్రతిపక్షాల రాజకీయ నాయకత్వంలో అగ్రస్థానానికి తీసుకెళుతుంది. అలాగే వచ్చే లోక్​సభ ఎన్నికల నాటికి నరేంద్రమోడీకి ప్రధాన పోటీదారుగా నిలిచేందుకు అవకాశం కల్పిస్తుంది.

రాహుల్​గాంధీ
పంజాబ్​లో అటు కాంగ్రెస్​ పార్టీ, ఇటు రాహుల్​గాంధీ తీవ్రమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంజాబ్​ రాజకీయాల్లో ఎక్కువగా కలుగజేసుకున్న రాహుల్.. అక్కడ సీఎంగా ఉన్న కెప్టెన్​ అమరీందర్​సింగ్​ను తప్పించి చరణ్​జీత్​సింగ్​ చన్నీని ముఖ్యమంత్రిని చేశారు. ఒకవేళ పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీ ఓటమిపాలైతే మాత్రం ప్రతిపక్షాల నుంచే కాదు.. సొంత పార్టీ నాయకుల నుంచి కఠిన సవాళ్లను రాహుల్​ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు రాహుల్​ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. ఒకవేళ పంజాబ్​లో కాంగ్రెస్​ విజయం సాధిస్తే మాత్రం, అది రాహుల్​గాంధీకి బిగ్​ బూస్ట్​గా చెప్పవచ్చు. అందువల్ల పంజాబ్​పై రాహుల్​గాంధీ చాలా ఆశలే పెట్టుకున్నారు.

మమతాబెనర్జీ
పశ్చిమబెంగాల్​ సీఎం, తృణముల్​ కాంగ్రెస్​ చీఫ్​ మమతాబెనర్జీ ఇప్పుడు చాలా పెద్ద రిస్క్​ చేస్తున్నారు. నేషనల్​ లీడర్​షిప్​ కోసం ఆమె పోటీపడుతున్నారు. ఆమెకు ప్రధాన అవరోధం ఏమిటంటే.. బెంగాల్​లో తప్పించి మరే ఇతర రాష్ట్రంలో కూడా ఆమె పార్టీ అధికారంలో లేదు. ఆ పార్టీ ప్రభావమూ లేదు. అందువల్ల గోవాలో విజయం సాధించేందుకు ఆమె అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ గోవాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమె ఓట్ల శాతాన్ని సాధించినట్లయితే అప్పుడు ఆమె జాతీయ ఆశలు మరింత పెరుగుతాయి. కానీ, గోవాలో ఎలాంటి ప్రభావం చూపించనట్లయితే మమత తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే జాతీయ స్థాయి లీడర్​గా ఎదగాలన్న ఆమె ప్రయత్నాలకు ఈ ఓటమి అడ్డంకిగా మారుతుంది.

నరేంద్రమోడీ, బీజేపీ పరిస్థితి
వివిధ రాష్ట్రాలకు చెందిన లీడర్లయిన యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్, మమత, రాహుల్​గాంధీలను పక్కనపెడితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీపై చాలా ప్రభావాన్నే చూపుతాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్​లో బీజేపీ విజయం సాధించినట్లయితే, అప్పుడు బీజేపీ డెవలప్​మెంట్ అజెండా, ఇతర పాలసీలు, రామమందిర నిర్మాణం అన్నీ సరైనవే అన్న పరిస్థితులు వస్తాయి. కానీ, బీజేపీ ఉత్తరప్రదేశ్​లో ఓటమిపాలైతే అప్పుడు కొత్త వ్యూహాలను, కొత్త లీడర్లను ఆ పార్టీ అనుసరించాల్సి వస్తుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సులువుగా గట్టెక్కగలదా లేదంటే కష్టపడాల్సి వస్తుందా అనేది తేలుస్తాయి. లేదంటే మాత్రం కొత్త ప్లాన్లతో చాలా కష్టపడాల్సి వస్తుంది.  -పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్.