సూపర్ ఫాస్ట్ 5జీ.. మీ ఫోన్లో ఎప్పట్నుంచి అంటే..

సూపర్ ఫాస్ట్ 5జీ.. మీ ఫోన్లో ఎప్పట్నుంచి అంటే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు ఎట్టకేలకు మనదేశంలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)  వేదికగా 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ, ముంబయి, వారణాసి, బెంగళూరు సహా దేశంలోని 8 నగరాల్లో ఇవాల్టి నుంచే 5జీ సేవలకు శ్రీకారం చుట్టామని ఎయిర్ టెల్ ప్రకటించింది. దీపావళి నుంచి 5జీ సేవలను మొదలుపెట్టేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అత్యంత ఫాస్ట్ గా ఉండే 5జీ సేవలను ఎప్పుడెప్పుడు వినియోగించాలా  అని ప్రజలు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలోగా 5జీ సర్వీసెస్ మొదలవుతాయి  అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

5జీ సేవలను ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవడం అసాధ్యం. ఎందుకంటే.. అందుకు అవసరమైన టెలికాం మౌలిక వసతులు సిద్ధంగా లేవు. అందుకే విడతల వారీగా పట్నం నుంచి పల్లె దాకా 5జీ సర్వీసెస్ ను విస్తరించేందుకు టెలికాం కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా తొలిదశలో ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నో నగరాల్లో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 2024 మార్చికల్లా దేశమంతటా 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) వేదికగా టెలికాం కంపెనీల అధినేతలు, ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యల్లోనూ ఆ అంశమే ఉంది. 

ఎయిర్ టెల్

5జీ సేవల్లో ఎయిర్ టెల్ ముందడుగు వేసింది.  ఢిల్లీ, ముంబయి, వారణాసి, బెంగళూరు సహా దేశంలోని 8 నగరాల్లో ఇవాల్టి నుంచే 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి 4జీ రేట్లకే  5జీ  సేవలను ఎయిర్ టెల్ అందిస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా 5జీ సేవలకు  వేరే టారిఫ్ లను నిర్ణయించనుంది. 2023 చివరికల్లా అన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని భారతీ  ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఐఎంసీ సమావేశంలో వెల్లడించారు. దేశంలోని ప్రధానమైన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2024 మార్చి కల్లా సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 5జీ సేవలను అందించేందుకు మల్టిపుల్ ఇన్ పుట్ మల్టిపుల్ ఔట్ పుట్ (ఎంఐఎంఓ) టెక్నాలజీని ఎయిర్ టెల్ వినియోగిస్తోంది.ఇప్పటికే దీనితో బెంగళూరు, కోల్ కతా సహా పలు నగరాల్లో టెస్టింగ్ కూడా చేసింది. 

జియో

దీపావళి (అక్టోబరు 24  ) నాటికి ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై సహా పలు నగరాల్లో తొలి విడతగా 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని జియో యోచిస్తోంది. 2023 డిసెంబరు నాటికి దేశంలోని ప్రతి పట్టణం,  ప్రతి తాలూకా, ప్రతి తహసీల్ కు 5జీ సేవలను విస్తరిస్తామని ఐఎంసీ సమావేశంలో  రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ను విస్తరించడానికి మరో 18 నెలలు పడుతుందని రిలయన్స్ జియో భావిస్తోంది. ప్రస్తుతమున్న 4జీ నెట్ వర్క్ నుంచి ఎలాంటి సాంకేతిక సహాయం పొందకుండా స్వతంత్రంగా 5జీ సేవలు అందించగల అధునాతన టెలికాం పరిజ్ఞానం జియో వద్ద ఉంది. జియో బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ.. రానున్న రోజుల్లో 5జీ మొబైల్ ఫోన్లతో టెలికాం విప్లవానికి సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. ఎల్ వై ఎఫ్ కంపెనీతో కలిసి దీపావళి పండుగ నాటికి జియో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే చాన్స్ ఉంది. దీని ధర రూ.8వేల నుంచి రూ.12వేల  మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లో ఫ్రీక్వెన్సీ కలిగిన 700 మెగా హెర్ట్జ్ బ్యాండ్ లో ఖరీదైన స్పెక్ట్రమ్ ను పొందిన టెలికాం కంపెనీ జియో ఒక్కటే. దీన్ని పొందేందుకు జియో రూ.40వేల కోట్లు వెచ్చించింది. జనసాంద్రత అధికంగా ఉండే మెట్రో నగరాల్లో 700 మెగా హెర్ట్జ్ బ్యాండ్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది. ఇప్పటికే శాంసంగ్, షావోమి, యాపిల్, ఒప్పో, వన్ ప్లస్, రియల్ మి, వీవో కంపెనీ 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. త్వరలో జియో కూడా ఈ జాబితాలో చేరే చాన్స్ ఉంది. 

వొడాఫోన్ ఐడియా

వొడాఫోన్ ఐడియా కంపెనీ ఇప్పటికే తమ 4జీ నెట్ వర్క్ ను 5జీకి అప్ గ్రేడ్ చేసింది. ఇందుకోసం డైనమిక్ స్పెక్ట్రమ్ రిఫార్మింగ్ (డీఎస్ఆర్), మల్టిపుల్ ఇన్ పుట్ మల్టిపుల్ ఔట్ పుట్ (ఎంఐఎంఓ) టెక్నాలజీలను వాడింది. దేశ ప్రజలకు 5జీ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ‘వన్ ప్లస్’ తో జతకట్టామని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. 

బీఎస్ఎన్ఎల్ 

5జీ స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్  పాల్గొనలేదు. అయితే టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికల్లా బీఎస్ఎన్ఎల్ కూడా 5జీ సేవలను ప్రారంభిస్తుందని తెలిపారు. ఢిల్లీలో 5జీ కారిడార్ ను నిర్మిస్తామని 2019లో బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే ఆ దిశగా ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా పడలేదు. 

5జీ సిమ్ తీసుకోవాలా ? 

5జీ సేవలను వాడుకునేందుకు ప్రస్తుతమున్న 4జీ సిమ్ ను 5జీకి అప్ గ్రేడ్  చేసుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే ఆ అవసరం లేదని ఎయిర్ టెల్ కంపెనీ అంటోంది. ఇప్పటికే 4జీ ఎల్టీఈ సర్వీసులను వాడుతున్న వినియోగదారులు 5జీకి సిమ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. 4జీ ఎల్టీఈ సిమ్ 5జీకి  కూడా సపోర్ట్ చేస్తాయని తెలిపింది. దీనిపై జియో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అది కూడా ఎయిర్ టెల్ తరహా నిబంధనలే అమలు చేసే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ రెండింటి టెక్నాలజీలు దాదాపు ఒకే రకమైనవి. అయితే దీనిపై అవి ఎలాంటి ప్రకటన చేస్తాయో వేచి చూడాల్సిందే.