లోక్‌సభలో కలకలం.. నలుగురు కాదు ఆరుగురు

లోక్‌సభలో కలకలం.. నలుగురు కాదు ఆరుగురు

పార్లమెంట్‌ దాడి ఘటన విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి..  దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని  ఢిల్లీ పోలీసులు తేల్చారు.. రెండు గ్రూపులుగా విడిపోయి ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.  ఇప్పుటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న  మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

ఈ ఘటన ద్వారా అలజడి సృష్టించి.. తద్వారా తమ గళాన్ని వినిపించాలని భావించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.   నాలుగు నెలల క్రితమే పార్లమెంట్‌పై దాడికి నిందితులు ప్లాన్‌ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన విషయాలను ఇప్పటికే స్పీకర్‌కు పోలీసులు పంపించారు.  

హోంశాఖ కార్యదర్శికి ఓం బిర్లా లేఖ

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పీకర్‌ ఓం బిర్లా లేఖ రాశారు.. పార్లమెంట్‌ సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆ లేఖలో కోరారు.. పార్లమెంట్‌ గేట్ల వద్ద వద్ద ఫుల్‌ బాడీ స్కానింగ్ చేయాలని తెలిపారు.  పార్లమెంట్‌ ఆవరణలో మరింత  భద్రతను పెంచాలని కోరారు.  కాగా  పార్లమెంట్‌ లోక్‌సభ దాడి ఘటనపై సన్‌సద్‌మార్గ్‌లోని పీఎస్‌లో కేసు నమోదైంది. 

 భద్రతను మరింత కట్టుదిట్టం
 
పార్లమెంటులో ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు  ఢిల్లీ పోలీసులు. పార్లమెంటు వైపు వెళ్లే దారులన్నింటిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.  పార్లమెంటు వాయిదా పడటంతో ప్రత్యేక అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగతా వాటిని నిలిపివేస్తున్నారు అధికారులు.  పార్లమెంటు భవనానికి సుమారు 200 మీటర్ల దూరంలో ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు.