
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లారీ , వ్యాన్ ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. యూపీ లోని జౌన్ పూర్- వారణాసి రహదారిలో జలాల్ పూర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పికప్ వ్యాన్‌లో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా వారణాసిలో ఒక దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జౌన్ పూర్ జిల్లాలోని ఖ్వాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ నివాసి, 112 ఏళ్ల వృద్ధుడు థన్దేయీ భార్య స్వజోఖన్ యాదవ్ మృతి చెందింది. ఆ దంపతులకు కుమారులు లేరు. దీంతో వారి అల్లుడు లక్ష్మీశంకర్ యాదవ్ తన గ్రామంలోని 17 మందిని తీసుకువచ్చి స్వజోఖన్ యాదవ్‌కు వారణాసిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక వారంతా తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.