
- డిజైన్ లోపంతోనే మునిగినయ్.. ప్రభుత్వానికి ఇంజనీర్ల బృందం నివేదిక
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్‌ల ముంపుతో రూ. 1,020 కోట్ల నష్టం వాటిల్లిందని ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో అడిషనల్ టీఎంసీ కోసం ఏర్పాటు చేసిన ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, అవి అక్కరకు రావని తేల్చిచెప్పింది. వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లను గత నెలలో ఇంజనీర్ల బృందం పరిశీలించి, ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. డిజైన్ లోపంతోనే పంపుహౌస్‌లు మునిగిపోయాయని, మానవ తప్పిదమే ఇందుకు కారణమని పేర్కొంది. మేడిగడ్డ డిశ్చార్జ్ కెపాసిటీ కన్నా 23వేల క్యూసెక్కుల వరద మాత్రమే ఎక్కువ వచ్చిందని, అయినా కన్నెపల్లి పంపుహౌస్ మునిగిపోయిందని, ఇందుకు డిజైన్ లోపమే కారణమని ప్రస్తావించింది. ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) కన్నా దిగువకు ఫోర్‌బే నిర్మించడం, స్విచ్చ్‌డ్ గేర్ ఎక్విప్‌మెంట్, కంట్రోల్ ప్యానళ్లు కిందనే ఏర్పాటు చేయడంతో ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలిపింది. కన్నెపల్లితో పోల్చితే అన్నారం పంపుహౌస్ ఎఫ్‌ఆర్‌ఎల్ కన్నా ఎక్కువ లోతులో ఉందని ఇంజనీర్ల టీమ్ వివరించింది. కన్నెపల్లి వద్ద ఎఫ్‌ఆర్‌ఎల్ 100 మీటర్లు కాగా ఫోర్‌బే 101 మీటర్ల ఎత్తులో ఉండాల్సిందని, గరిష్ట నీటిమట్టం కన్నా 12 మీటర్లు దిగువలో ఉందని తెలిపింది. మోటార్లు దిగువన ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదని, స్విచ్చ్‌డ్ గేర్ ఎక్విప్‌మెంట్, కంట్రోల్ ప్యానళ్లు కూడా 12 మీటర్ల కిందే ఏర్పాటు చేశారని పేర్కొంది. అన్నారం పంపుహౌస్ వద్ద ఎఫ్‌ఆర్‌ఎల్ 121 మీటర్లు కాగా... అక్కడా అంతకన్నా కిందనే మోటార్లు, కంట్రోల్ ప్యానళ్లు, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్ ఉన్నాయని వివరించింది. ఈ పంపుహౌస్ నిర్మాణంలో ఎగువ నుంచి వచ్చే వరదను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, గోదావరిలో కలిసే ఇతర వాగులను ప్రమాణికంగా తీసుకోలేదని టీమ్ తెలిపింది. దీంతోనే వరుసగా రెండేండ్లు ఈ పంపుహౌస్‌ల్లోకి నీళ్లు వచ్చాయని పేర్కొంది. మేడిగడ్డ గరిష్ట డిశ్చార్జ్ కెపాసిటీ 28.23 లక్షల క్యూసెక్కులు కాగా జులై 14న 28.46 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, డిజైన్‌కు మించి 23 వేల క్యూసెక్కులే అదనంగా వచ్చినా కన్నెపల్లి పంపుహౌస్ నీట మునిగిందని వివరించింది.
కొత్త సామగ్రి ఏర్పాటుకు ఎక్కువ టైమే పడ్తది
కాళేశ్వరం పంపుహౌస్‌ల కోసం ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, చైనా, జర్మనీ, జపాన్ దేశాలకు చెందిన ఆండ్రిచ్, ఏబీబీ, జైలం, కేబీఎల్, డబ్ల్యూపీఎల్, సిమెన్స్ కంపెనీల నుంచి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసి తెచ్చారని, మోటార్లతో పోల్చితే వీటి ధర తక్కువైనా పంపుహౌస్‌లకు సరిపడా కొత్త సామాగ్రి సమకూర్చడానికి ఎక్కువ టైం పట్టే అవకాశముందని తెలిపింది. మొత్తంగా కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లు, ఇతర ఎక్విప్‌మెంట్‌కు కలిపి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. అన్నారం పంపుహౌస్ నష్టం రూ.20 కోట్ల వరకు ఉండొచ్చని వివరించింది. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌ల్లోకి మళ్లీ వరద నీళ్లు చేరకుండా పటిష్టమైన కరకట్టలు నిర్మించడంతోపాటు స్విచ్చ్‌డ్ గేర్ యూనిట్, కంట్రోల్ ప్యానళ్లను ఎఫ్‌ఆర్‌ఎల్ కన్నా ఎత్తులో ఏర్పాటు చేయాలని సూచించింది.