
ప్రపంచాన్ని చుట్టేయాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ.. ఆ కలను నిజం చేసుకోవాలంటే బోలెడంత డబ్బు, టైం, ప్లానింగ్ ఉండాలి. అవిలేని ఎంతోమందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. కానీ.. ఏది ఏమైనా తమ ట్రావెలింగ్ కలని సాకారం చేసుకోవాలి అనుకున్నారు వీళ్లు. కష్టనష్టాలకు ఓర్చి వరల్డ్‌ని చుట్టేస్తున్నారు.
మోలీ జాయ్ ట్రావెలింగ్ మొదలుపెట్టినప్పుడు ఆమెకు 51 ఏండ్లు. పదేండ్ల క్రితం ట్రావెలింగ్ మొదలుపెట్టేవరకు ఓ చిన్న కిరాణా కొట్టు నడిపేది. అప్పటివరకు ఆమె తన ఊరు దాటి వెళ్లింది లేదు. కానీ.. ఇప్పుడు ఖండాలు దాటి వెళ్తోంది. అట్లనే, 2020లో కారులో రెండు నెలల పాటు ఇండియా మొత్తం ట్రావెల్ చేసింది మరో మహిళ నాజీనౌషి. అంతేకాదు సంవత్సరం తర్వాత ఒంటరిగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లింది ఈ ఐదుగురు పిల్లల తల్లి.
ప్రపంచాన్ని చూడాలనే కోరిక
మోలీ జాయ్‌ది సింపుల్ లైఫ్. ఆమెది కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని చిత్రపూజ. ఆమెకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం. కానీ.. తన పేరెంట్స్ దగ్గర డబ్బు లేక స్కూల్ డేస్‌లో టూర్లకు కూడా పంపేవాళ్లు కాదు. ఆ తర్వాత పెండ్లి జరిగింది. బాధ్యతలు పెరిగాయి. పద్దెనిమిది ఏండ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లల్ని పెంచే బాధ్యత పూర్తిగా తన మీదే ఉండేది. దాంతో కలను పక్కకు పెట్టింది. కానీ.. పిల్లలు సెటిలయ్యాక.. ట్రావెలింగ్ చేయాలనే కోరికతో పైసా పైసా కూడబెట్టుకుంది. తన కిరాణా షాపు మీద వచ్చిన డబ్బును దాచుకుని,11 దేశాలు తిరిగింది. అందుకోసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ‘‘వచ్చేదే తక్కువ ఆదాయం.. అయినా అంత డబ్బు ఎలా దాచగలిగావు?’’ అని అడిగితే.. ‘‘ప్రపంచాన్ని చూడాలనే నా బలమైన కోరికే డబ్బు దాచేలా చేసింది” అని సమాధానం చెప్తుంది మోలీ. ఫస్ట్ ట్రావెలింగ్ టూర్ 2012లో 51 ఏండ్ల వయసులో మొదలు పెట్టింది.
మొదటి అవకాశం
మోలీ ఇంటిపక్కవాళ్లు ఒకసారి ఆమెని టూర్‌కి ఇన్వైట్ చేశారు. దానికి.. ఆమె ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే.. అప్పటికే కూతురు పెండ్లి చేసుకుని వెళ్లిపోయింది. కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటిదగ్గర కిరాణా కొట్టు నడిపేవాళ్లు లేరు. కానీ.. ట్రావెలింగ్ మీద ఆమెకు ఉన్న ఇష్టం వల్ల చివరికి ఒప్పుకుంది. పళని, మధురై, ఊటీ, కొడైకెనాల్, మైసూరు, కోవలం లాంటి ప్లేస్‌లు తిరిగింది. అప్పుడే ఆమెకు ఫారిన్ టూర్లకు వెళ్లగలననే నమ్మకం కుదిరింది. దాంతో 2010లో పాస్‌పోర్ట్ తీసుకుంది. 2012లో వరల్డ్ టూర్ మొదలుపెట్టింది.
యూరప్ ట్రిప్
మోలీ మొదటగా ఒక టూర్ కంపెనీ సాయంతో యూరప్‌కు వెళ్లింది. అదే ఆమె మొదటి విమాన ప్రయాణం. ఆ తర్వాత ఇండియాలోని నార్త్ స్టేట్స్‌ని చుట్టేసింది. తర్వాత ఇటలీ, సింగపూర్, మలేసియాలకు కూడా వెళ్లొచ్చింది. పోయినేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లి న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీలు చూసొచ్చింది. ప్రస్తుతం ఆమెకు 61 ఏండ్లు. అయితేనేం.. నెక్స్ట్ట్రిప్కు రెడీ అవుతోంది.
ఐదుగురు పిల్లలకు తల్లి అయినా...
నాజీ నౌషిది పుదుచ్చేరిలోని మాహే. ఈమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ.. 19 ఏండ్లకే పెండ్లి కావడంతో ఇంటికే పరిమితమైపోయింది. ఇప్పుడామెకు 33 ఏండ్లు. ఐదుగురు పిల్లలకు తల్లి. అయినా.. తన ట్రావెలింగ్ కలను సాకారం చేసుకోవాలనుకుంది. అందుకే 2012లో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకుంది. అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు. తర్వాత ఒకసారి చెన్నై నుంచి బెంగళూరుకు కారు డ్రైవ్ చేస్తూ వెళ్లింది. అప్పుడే ఆమెకు ట్రావెలింగ్ చేయగలననే నమ్మకం కలిగింది. దాంతో నెక్స్ట్ ఇండియా టూర్‌కి ప్లాన్ వేసింది.
ఇండియా టూర్
తాను అనుకున్నట్టే ఇండియాలోని అన్ని ప్రాంతాలు తిరగాలని కారులో ట్రావెలింగ్ మొదలుపెట్టింది. రెండు నెలల్లో 17 రాష్ట్రాలను కవర్ చేసింది. దాదాపు 13,000 కిలోమీటర్లకు పైగా తిరిగింది. పల్లెటూరి జీవితాలను తెలుసుకోవాలనే కోరికతో ఎక్కువగా పల్లెటూర్లలోనే బస చేసింది. అక్కడి ప్రజల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంది. ఆమెకు కాస్త హిందీ కూడా తెలుసు. కాబట్టి కమ్యూనికేషన్‌కు పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేసింది. అంతేకాదు.. నాజీ 50 రోజుల సోలో హిచ్‌హైకింగ్ ట్రిప్‌కు కూడా వెళ్లింది. 50 రోజుల్లో కుట్టనంద్ నుంచి నేపాల్ వరకు జర్నీ చేసింది.