దారుణం.. 65 ఏళ్ల మహిళపై మైనర్ల గ్యాంగ్ రేప్

దారుణం.. 65 ఏళ్ల మహిళపై మైనర్ల గ్యాంగ్ రేప్

మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయనగా.. ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన 
మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. సింగ్రౌలికి చెందిన 65 ఏళ్ల మహిళ రోడ్ల మీద టూత్ క్లీన్సర్ అమ్మూతూ జీవనం సాగిస్తోంది. ఆమె ఆగష్టు 14న రాత్రి సమయంలో సోదరి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తుండగా.. జయంత్ పోలీస్ అవుట్‌పోస్ట్ రైల్వే క్రాసింగ్ వద్ద అయిదుగురు యువకులు అడ్డగించారు. అనంతరం ఆమెను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత బాధితురాలు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అయిదుగురు గుర్తు తెలియని యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ‘క్రైమ్ స్పాట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని.. బాధితురాలికి చూపించగా వారిని ఆమె గుర్తించింది. దాంతో మైనర్లను విచారించగా.. మిగతా ముగ్గురి గురించి చెప్పారు. అయిదుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఘటనకు పాల్పడిన సమయంలో వారందరూ మద్యం మత్తులో ఉన్నారు. నిందితులలో నలుగురు మైనర్లు కాగా.. ఒకరు మేజరు. వీరంతా ఘటనాస్థలానికి సమీపంలోనే నివసిస్తున్నారు’ అని జయంత్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ అభిమన్యు దివేది తెలిపారు.