
- అనారోగ్యం, కుటుంబ కలహాలు, స్ట్రెస్, నిద్రలేమి ప్రాబ్లమ్స్‌తో సతమతం
- గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది బాధితులు
- పిల్లలు పట్టించుకోక ఒంటరితనంతో డ్రిపెషన్‌లోకి వెళ్తున్న వృద్ధులు కూడా ఎక్కువే..
- బాధితులు డిప్రెషన్ నుంచి బయటపడేలా కౌన్సెలింగ్ ఇస్తున్న డాక్టర్లు
- 24/7 అందుబాటులో టెలీమానస్ సెంటర్.. 14416 టోల్ ఫ్రీ నంబర్
హైదరాబాద్, వెలుగు: మహిళలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. మానసిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టెలీమానస్‌కు వస్తున్న ఫోన్ కాల్స్‌లో మగవాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది ఉంటున్నారు. టెలీమానస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 1.39 లక్షల కాల్స్ రాగా.. అందులో మగవాళ్లు 46 వేల మంది ఉండగా, 92 వేల మంది (67శాతం) మహిళలు ఉన్నారు. టెలీమానస్‌కు కాల్ చేసిన మహిళల సమస్యలు విని, వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు డాక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు కాల్ బ్యాక్ చేస్తూ వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. వారు పూర్తిగా కోలుకున్నాకా... మరోసారి డిప్రెషన్‌కు లోనుకాకుండా కౌన్సెలింగ్ ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు.
ఎక్కువగా మెడికల్ ఇష్యూస్..
టెలీమానస్‌కు కాల్స్ చేస్తున్న మహిళలు ఎక్కువగా అనారోగ్యం, కుటుంబ కలహాలు, ఒత్తిడి, నిద్రలేమి, ఆత్మహత్య ఆలోచనలు తదితర సమస్యలతో బాధపడుతున్నారు.టెలీమానస్ ఏర్పాటు చేసిన నాటి నుంచి మొత్తం 92 వేల మంది మహిళలు వివిధ మానసిక సమస్యలతో కాల్స్ చేశారు. వీరిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌కు లోనై మానసికంగా కుంగిపోతున్నవాళ్లు 32 వేల మంది ఉన్నారు. మరో 15 వేల మంది సైకలాజికల్ సమస్యలతో, 13 వేల మంది ఒత్తిడితో, 13 వేల మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ కాల్స్ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఆత్మహత్య ఆలోచనలతో కాల్స్ చేసిన 700 మంది మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రాణాలను కాపాడారు. టెలీమానస్‌కు కాల్స్ చేసే మహిళల్లో ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాల కారణంగా మానసికంగా కుంగిపోతూ తమను సంప్రదిస్తున్నారని చెబుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఒత్తిడికి లోనై మహిళల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని అధికారులు చెప్పారు.
ఒంటరితనంతో వృద్ధులు...
టెలీమానస్‌కు కాల్స్ చేస్తున్న వారిలో వృద్ధుల శాతం కూడా అధికంగానే ఉంది. ముఖ్యంగా 65 ఏండ్ల పైబడిన వృద్ధులు 13,600 మంది టెలీమానస్‌కు మానసిక సమస్యలతో కాల్స్ చేశారు. వీరిలో ఎక్కువశాతం అర్బన్ ప్రాంతాల ఉంచే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిల్లలు తమను పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో డిప్రెషన్‌కు లోనవుతున్నామని ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటి వృద్ధులకు వారి సమస్యలను బట్టి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని సూచిస్తూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
24/7 అందుబాటులో టెలీమానస్ సేవలు...
రాష్ట్రంలో 2022 అక్టోబర్‌లో టెలీమానస్ సెంటర్ ఏర్పాటైంది. ఇది ఎర్రగడ్డలోని ప్రధాన కార్యాలయం నుంచి నడుస్తున్నది. ఈ కేంద్రంలో 25 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరు సైకియాట్రిస్టులు, ఒక క్లినికల్ సైకాలజిస్ట్, 14 మంది కౌన్సెలర్లు, ఇద్దరు టెక్నికల్ కో-ఆర్డినేటర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్, కోఆర్డినేషన్ టీమ్ ఉన్నారు. 14416 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రతిరోజూ సగటున 150 నుంచి 200 కాల్స్ స్వీకరిస్తూ.. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని, వాళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అవసరమైన వారికి మెడికేషన్ కోసం రిఫరల్స్ కూడా ఇస్తున్నారు. రెగ్యులర్ మానిటరింగ్ ద్వారా బాధితుల పరిస్థితిలో మార్పులను పరిశీలిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో కలిసి బాధితుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో కూడా టెలీమానస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా కూడా కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 547 కాలేజీల్లో 31,024 మంది విద్యార్థులకు, 942 స్కూళ్లలో 41,350 మంది స్టూడెంట్స్ కు స్క్రీనింగ్ నిర్వహించారు.
మేమున్నాం.. మాకు ఫోన్ చేయండి
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహకరించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఆ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించరు. రెగ్యులర్ యాక్టివిటీలో మార్పులు గుర్తిస్తే మీరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లే. సాధ్యమైనంత వరకు ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్ తోనో చర్చించండి. కుదరపోతే 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు.
డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ,
సీనియర్ సైకాలజిస్ట్, టెలీమానస్