టెడ్డీబేర్‌‌ సూట్‌‌లో ఏకంగా 683 కిలోమీటర్ల నడక

టెడ్డీబేర్‌‌ సూట్‌‌లో ఏకంగా 683 కిలోమీటర్ల నడక

కొందరు తమ సంతోషం కోసం ఎందాకైనా వెళ్తారు.  అవసరమైతే మోసాలకు పాల్పడతారు.  కానీ, అమెరికాకు చెందిన  జెస్సె లాసియోస్‌‌  స్వార్థం లేనోడు. అవతలి వాళ్ల సంతోషం కోసం ఏమైనా చేస్తుంటాడు.  టెడ్డీ బేర్‌‌ సూట్ వేసుకుని మారథాన్‌‌లలో పాల్గొనే జెస్సెకి ‘బేర్‌‌సన్‌‌’ అనే  ముద్దు పేరుంది కూడా. అయితే ఈసారి అతను ఏకంగా పెద్ద సాహసానికే దిగాడు. టెడ్డీబేర్‌‌ సూట్‌‌లో ఏకంగా 683 కిలోమీటర్లు నడుస్తున్నాడు.

లాస్‌‌ ఏంజెలెస్‌‌ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో దాకా రోడ్డు మార్గం గుండా నడుస్తూ వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నాడు బేర్‌‌సన్‌‌.  ఏప్రిల్‌‌12 ఉదయం అతని నడక మొదలైంది. వారం రోజుల్లో గమ్యాన్ని చేరుకోవాలని,  రోజూ 50 నుంచి 80 కిలోమీటర్లు నడవాలని అనుకున్నాడు. కానీ, అది గుట్టలు ఎక్కువగా ఉండే రూట్‌‌.  దీంతో  అతను మరో వారం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆడుతూ.. పాడుతూ ముందుకెళ్తున్నాడు బేర్‌‌సన్‌‌.

దారిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిని..  రాత్రిళ్లు రోడ్ సైడ్‌‌ టెంట్‌‌ వేసుకుని పడుకుంటున్నాడు. అంత దూరం నడకలో ఆనందం ఏముందంటారా?  ఈ నడక ద్వారా 17 వేల డాలర్లు సంపాదించాలన్నది అతని ఉద్దేశం.  ఆ డబ్బును క్యాన్సర్‌‌తో బాధపడుతున్న చిన్నారుల ఛారిటీస్‌‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ‘గో మీ ఫండ్‌‌’ ద్వారా ఏడు వేల డాలర్లకు పైగా  వసూలు చేశాడు.  అవతలి వాళ్ల ఆనందం కోసం ఎంతదాకా అయినా వెళ్లడానికి తాను సిద్ధమని ఇన్‌‌స్టాగ్రామ్‌‌(@iambearsun) ద్వారా చెబుతున్నాడు జెస్సె. ఇతని నడక మధ్యలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయట.  లాస్‌‌ఏంజెలెస్‌‌ దాటాక సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అయితే బేర్‌‌సన్‌‌ ఫీట్‌‌ను వెనకాల వెహికల్‌‌లో షూట్ చేస్తూ వస్తున్న ఫొటోగ్రాఫర్‌‌..  అసలు విషయం చెప్పడంతో పోలీసులు బేర్‌‌సన్‌‌ను మెచ్చుకుని మరీ వదిలేశారు.