79 మంది ఎంపీల సస్పెన్షన్​

79 మంది ఎంపీల సస్పెన్షన్​
  • 79 మంది ఎంపీల సస్పెన్షన్​ .. లోక్​సభలో 33 మంది, రాజ్యసభలో 46 మంది
  • సెక్యూరిటీ బ్రీచ్​పై కేంద్రం ప్రకటనకు ప్రతిపక్షాల డిమాండ్​
  • ప్లకార్డులతో సభలో నిరసన
  • సభా నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో అపోజిషన్ పార్టీ లీడర్లు ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే కొందరు సభ్యులు స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని సభను అడ్డుకున్నారు. సెక్యూరిటీ బ్రీచ్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో సభా నియమాలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన లోక్​సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సోమవారం ఒకే రోజు 79 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. 

పోయిన వారం లోక్​సభ నుంచి 13 మంది, రాజ్యసభ నుంచి ఒకరు (డెరెక్‌‌ ఓబ్రియెన్‌‌)పై వేటు వేశారు. దీంతో ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన వారి సంఖ్య మొత్తం 93కు చేరుకుంది. సోమవారం కూడా లోక్‌‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. సభ్యుల నిరసన కొనసాగడంతో ఉభయ సభలను సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు

కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్​పై వేటు 

లోక్​సభ నుంచి మొత్తం 33 మంది ఎంపీలను స్పీకర్ సోమవారం సస్పెండ్ చేశారు. ఉదయం నుంచి వాయిదాపడుతూ వచ్చిన లోక్​సభ.. మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ ప్రారంభమైంది. అయినా ప్రతిపక్ష పార్టీల లీడర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. దీంతో 33 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ సభ్యుడు రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి సస్పెండ్ అయిన వారి పేర్లను చదివి వినిపించారు.

 ఇందులో కాంగ్రెస్‌‌ సభాపక్ష నేత అధిర్‌‌ రంజన్‌‌ చౌదురితో పాటు టీఎంసీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఆర్ఎస్​పీ, జేడీ(యూ) పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు.  వీరిని శీతాకాల సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్ చేశారు. 33 మందిలో జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఖ్​లు మాత్రం ప్రివిలేజెస్ కమిటీ నివేదిక అందేవరకు సస్పెండ్​లో ఉంటారని స్పీకర్ ప్రకటించారు.

జైరామ్ రమేశ్, కనిమొళి సస్పెండ్​

రాజ్యసభ నుంచి మొత్తం 46 మందిని చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ సస్పెండ్ చేశారు. వీరిలో 35 మందిపై ఈ శీతాకాల సమావేశాల వరకు వేటు వేశారు. మిగిలిన 11 మంది ప్రివిలేజెస్​ కమిటీ నివేదిక అందేవరకు సస్పెండ్​లో ఉంటారని స్పష్టం చేశారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ సభ్యులు జైరామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా డీఎంకే నుంచి కనిమొళి, ఆర్​జేడీ నుంచి మనోజ్ కుమార్, తదితరులు ఉన్నారు. ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌‌ ఓబ్రియెన్‌‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌‌ అమల్లో ఉంది.

నిరసనల మధ్యే పోస్ట్ ఆఫీస్ బిల్లుకు ఆమోదం

సభ్యుల నిరసనల మధ్యే పోస్ట్ ఆఫీస్ బిల్లు లోక్​సభలో ఆమోదం పొందింది. వై​సీపీ నుంచి బీవీ సత్యవతి, బీజేపీ నుంచి భోలా సింగ్, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, బీఎస్పీ నుంచి రామ్ శిరోమణి వర్మలు ఈ బిల్లు చర్చలో పాల్గొన్నారు. కాగా, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించిన రెండు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. 

ఎంపీలపై వేటు.. ప్రజాస్వామ్యంపై దాడే: కాంగ్రెస్

ప్రధాని మోదీ నియంతృత్వ పాలన పీక్​కు చేరుకుందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలన్నీ డస్ట్ ​బిన్​లో పడేశారని మండిపడ్డారు. కొందరు పార్లమెంట్​పై అటాక్ చేస్తే.. మోదీ మాత్రం పార్లమెంట్​తో పాటు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎంపీలపై వేటు ప్రజాస్వామ్యంపై దాడేనని, సస్పెన్షన్​ను వెంటనే ఎత్తేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆధీనంలోకి టెలికాం!

కొత్త టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023 ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం లోక్​సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే.. ఎమర్జెన్సీ టైమ్​లో, నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బందులు ఎదురైనపుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన టెలి కమ్యూనికేషన్ నెట్​వర్క్​ను తాత్కాలికంగా తమ చేతుల్లోకి తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది.

 ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని.. అవసరమైతే ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్​ను అడ్డుకునే, అవసరమైతే నెట్​వర్క్​ను సస్పెండ్ చేసే పవర్ కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. 1998 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1993 వైర్​లెస్ టెలిగ్రఫీ యాక్ట్, 1950 టెలిగ్రాఫ్​ వయర్స్ యాక్ట్​ను ఈ బిల్లు ద్వారా కేంద్రం సవరిస్తున్నది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా టెలికమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తే.. వారికి మూడేండ్ల జైలు లేదా రూ.2 కోట్ల పెనాల్టీ వేస్తారు.