త్రివర్ణ శోభితం..  సంబురంగా స్వాతంత్ర్య దినోత్సవం

త్రివర్ణ శోభితం..  సంబురంగా స్వాతంత్ర్య దినోత్సవం

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : 79వ స్వాతంత్ర్య దినోత్సవాలు పండుగ వాతావరణంలో సంబురంగా జరిగాయి. స్కూల్స్, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎక్కడికక్కడ ఉత్సవాలు జరుపుకొన్నారు. యాదాద్రిలో శాసనమండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి, నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం గురించి వివరించారు. స్టూడెంట్స్ చేసిన​ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. డిపార్ట్​మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్​ను వారు సందర్శించారు. శకటాలను ప్రదర్శించారు. వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు, ఉద్యోగులను ఉత్తమ ఆఫీసర్లుగా గుర్తించి, ప్రశంసాపత్రాలను అందించారు. స్వాంతంత్ర్య సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 

నల్గొండ.. బంగారు కొండగా తీర్చిదిద్దుతా:   మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లాను సహచర మంత్రుల సహకారంతో బంగారు కొండగా తీర్చిదిద్దుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నల్గొండను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. దేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించేలా కులగణన చేపట్టామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. ప్రపంచ ఔషధ రంగంలో మొదటి స్థానంలో జిల్లా నిలుస్తోందన్నారు.

వచ్చే ఎడ్యుకేషన్​ ఇయర్ నుంచి విద్యాసంస్థల్లో బీఫార్మసీ, డీఫార్మసీతోపాటు ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం కోర్సులను ప్రారంభిస్తామని వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ కాల్వకు 110 కిలోమీటర్ల పొడవున లైనింగ్ పనులు చేయడానికి రూ.442 కోట్లు మంజూరయ్యాయని, సెప్టెంబర్​లో టెండర్లు పూర్తిచేసి అక్టోబర్​లో పనులు ప్రారంభిస్తామన్నారు. రెండో దశలో ఎస్‌ఎల్‌బీసీ అన్ని డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనులను రూ.300 కోట్లతో చేపడుతామని చెప్పారు.

అభివృద్ధికి జీవనాడులైన రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, దీనికోసం ఆర్ అండ్ బీ శాఖ ద్వారా హైబ్రిడ్ యూన్యుటీ మోడ్ రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్-–విజయవాడ మధ్య ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా సర్వీస్ రోడ్లతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ హై వేగా విస్తరించబోతున్నామని వివరించారు. రూ.6,500 కోట్లతో చేపట్టే ఈ పనులు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమవుతాయన్నారు.

ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ రేడియో స్టేషన్ వరకు, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్‌కు అనుసంధానంగా రూ.500 కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించబోతున్నామని చెప్పారు. నల్గొండ రింగ్ రోడ్‌ను రూ.596 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎంఏ, ఆఫీజ్ ఖాన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేశ్, ఏసీపీ మౌనిక పాల్గొన్నారు. 

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్య మిస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు నిర్మించి ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చామన్నారు.

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆధునీకరణ పనుల్లో భాగంగా లైనింగ్‌ పనులకు రూ.29 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్, జాన్‌పాడ్‌ లైనింగ్‌ పనులకు రూ.184.60 కోట్లు, రూ.52.11 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇవేకాకుండా మూసీ కాల్వల ఆధునీకరణ పనులను చేపడుతున్నామని, చెక్‌ డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా నీరిచ్చి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. వేడుకల్లో కలెక్టర్​తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె.నర్సింహ, అడిషనల్ కలెక్టర్​పి.రాంబాబు, ఆర్డీవో వేణుమాధవ్ పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు అందలంశాసనమండలి చైర్మన్ గుత్తా

ప్రభుత్వం ఆడబిడ్డలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మహాలక్ష్మి, ఫ్రీ కరెంట్, గ్యాస్​సబ్సిడీ కారణంగా ప్రజలకు కలుగుతున్న లబ్ధిని తెలియజేశారు.

మహిళాభ్యున్నతి, సంక్షేమమే ప్రధానంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే అన్ని స్కీమ్స్ లో వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడానికి సోలార్​ప్లాంట్లు, ఆర్టీసీకి బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటిన్ల నిర్వహణ వంటి స్కీమ్స్ ను ప్రభుత్వం​అమలు చేస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా రేషన్​కార్డులు, అందరికీ సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.

రుణమాఫీ ఇప్పటికే అమలు చేశామన్నారు. కొత్తగా చేనేత రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. భూభారతి చట్టంతో భూసమస్యలను పరిస్కరిస్తున్నామని వెల్లడించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్​రావు, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి ఉన్నారు.