వాగులో కొట్టుకుపోయిన ఎడ్ల బండి... నాగర్ కర్నూల్ జిల్లా నాగులపల్లి వద్ద ఘటన

వాగులో కొట్టుకుపోయిన ఎడ్ల బండి... నాగర్ కర్నూల్ జిల్లా నాగులపల్లి వద్ద ఘటన
  • ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
  • మెడకు తాళ్లు ఉండడంతో మృతిచెందిన రెండు ఆవులు  
  • నాగర్ కర్నూల్ జిల్లా నాగులపల్లి వద్ద ఘటన

కోడేరు, వెలుగు: వాగులో ఎండ్ల బండి కొట్టుకుపోయి రెండు ఆవులు మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.  గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కోడేరు మండలం నాగులపల్లికి చెందిన బోయ జక్కుల వెంకటస్వామి, అడివమ్మ దంపతులు మంగళవారం తమ పొలం వద్దకు ఎడ్ల బండిపై వెళ్తున్నారు. నాగులపల్లి నుంచి వెళ్లే బండ్ల బాటలో కమ్మరోని ఓడిక వాగును దాటుతుండగా.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఎడ్ల బండితో పాటు  కొట్టుకుపోయారు. దంపతులు వాగులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆవుల మెడకు తాళ్లు ఉండడంతో తప్పించుకోలేక మృతి చెందాయి.  రెండు ఆవుల మృతితో రూ. లక్ష నష్టం వాటిల్లిందని బాధిత దంపతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు, గ్రామస్తులు కోరారు.