20 ఏళ్ల క్రితమే తొగుటలో ‘జై భీమ్’ తరహా కేసు

20 ఏళ్ల క్రితమే తొగుటలో ‘జై భీమ్’ తరహా కేసు
  • కస్టడీ నుంచి పరారయ్యాడని ప్రచారం
  • విచారణలో లాకప్​డెత్​గా నిర్ధారణ
  • సీఐ, ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్​ 
  • అదే ఏడాది వారికి సేమ్​ప్లేస్​లో మళ్లీ పోస్టింగ్

సిద్దిపేట, వెలుగు: జై భీమ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా మీదే చర్చ. పోలీసుల దాష్టికానికి బలైన నిరుపేద దళిత కుటుంబం వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. ఈ సినిమా చూసిన చాలామంది దాదాపు 20 ఏండ్ల కింద  సిద్దిపేట జిల్లా తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగిన పంది యాదగిరి లాకప్ డెత్​ గుర్తుకొస్తుందంటున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన పంది యాదగిరి అనే వ్యక్తిని పోలీసులు ఒక మర్డర్ కేసులో చిత్ర హింసలకు గురి చేయడంతో లాకప్​లోనే మృతిచెందాడు.  సినిమాలో మాదిరిగానే యాదగిరి డెడ్ బాడీని రహస్యంగా పోలీస్ స్టేషన్ నుంచి తరలించి సమీపంలోని గుట్టలో పాతి పెట్టారు. అతడు స్టేషన్ నుంచి రాత్రిపూట పారిపోయినట్టు పోలీసులు ప్రచారం చేశారు. యాదగిరి కుటుంబసభ్యులు న్యాయపోరాటం చేయడంతో లాకప్​ డెత్ ​విషయం బయటపడింది. అప్పట్లో ఏం జరిగిందో పంది యాదగిరి సోదరుడు లింగం ‘వెలుగు’కు వివరించారు.

విచారణ కోసం తీసుకువెళ్లి..

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మిరుదొడ్డి మండలం వెంకట్రావుపేటకు చెందిన పంది యాదగిరి(25)ని  2002 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న రాత్రి 9 గంటలకు తొగుట పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. అదే ఊరికి చెందిన అనుముల ప్రభాకర్ అనుమానాస్పద మరణం కేసులో యాదగిరితోపాటు మరికొందరిని పోలీసులు విచారించారు. పోలీసు కస్టడీలో ఉన్న యాదగిరికి అతని కుటుంబీకులు ప్రతిరోజు భోజనం తీసుకుపోయినా వారిని కనీసం యాదగిరితో మాట్లాడనివ్వలేదు, చూడనివ్వలేదు. ఏప్రిల్ 8న రాత్రి యాదగిరి కస్టడీ నుంచి పారిపోయాడని, బంధువుల ఇండ్లలో వెతకాలని మర్నాడు పోలీసులు అతని తల్లిదండ్రులకు చెప్పారు. వారు తమ చుట్టాలు, తెలిసిన వారందరినీ విచారించినా ఆచూకీ తెలియలేదు. దాంతో ఏప్రిల్ 10న తమ కొడుకు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. అప్పటి సిద్దిపేట డీఎస్సీ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని కలిసి కంప్లైంట్​ చేయడంతో ఆయన సిద్దిపేట టౌన్ సీఐ వెంకటరెడ్డిని విచారణ జరపాలని ఆదేశించారు.

విచారణలో వాస్తవాలు వెలుగులోకి..

సీఐ వెంకటరెడ్డి ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపారు. ఆయన విచారణలో లాకప్​డెత్ ​విషయం బయటకొచ్చింది. ఇంటరాగేషన్ పేర తీవ్రంగా కొట్టడం వల్ల యాదగిరి బాత్ రూంలో టవల్ తో ఉరి వేసుకుని చనిపోయినట్టు కానిస్టేబుల్ శంకర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. యాదగిరి చనిపోయాడని తెలియగానే సీఐ మధుకరస్వామి ఆదేశాల మేరకు శవాన్ని రహస్యంగా తరలించామని, మధ్యలో అతని బట్టలను కాల్చేసి, శవాన్ని బంజేరుపల్లి పెద్దగుట్ట దగ్గర పాతి పెట్టినట్టు వెల్లడించారు. బంజేరుపల్లి గుట్టల్లో శంకర్ ​చూపించిన చోట  సిద్దిపేట ఆర్డీఓ సమక్షంలో  పోలీసులు తవ్వగా శవం కనిపించింది. అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటనతో సంబంధమున్న సీఐ మధుకర స్వామి, ఎస్సై కరీముల్లా షావలి, హెడ్ కానిస్టేబుల్ రాంరెడ్డి, కానిస్టేబుళ్లు  శంకర్, భూమయ్య,  సంగప్పను సస్పెండ్​చేసి కేసు నమోదు చేశారు. తర్వాత వారు బెయిల్ మీద విడుదలయ్యారు. లాకప్​డెత్​ తదితర ఆరోపణలతో సస్పెండ్​ అయిన వారికి తిరిగి పాత పోస్టులు ఇవ్వరు. వెకెన్సీ రిజర్వ్​లో పెడుతుంటారు. కానీ  వీరికి 2002 చివర్లో అంతకుముందు పని చేసినచోటే పోస్టింగ్​ ఇచ్చారు.

హైకోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం

యాదగిరి లాకప్ డెత్ కేసు పోలీసులే విచారిస్తే వాస్తవాలు మరుగున పడతాయని, ఈ ఘటనమీద సీబీఐతో విచారణ జరిపించాలని, శవానికి రీ పోస్ట్ మార్టం చేయించాలని  మృతుని తండ్రి రాములు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు  మే 21న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి డాక్టర్లతో  రీ పోస్ట్ మార్టం చేయించి రిపోర్టు ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసింది. జులై 11న యాదగిరి శవానికి రీ పోస్ట్ మార్టం​ చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే మృతుని తల్లిదండ్రులు రాములు, యాదమ్మ ఇద్దరూ రోడ్డు యాక్సిడెంట్​లో చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. యాదగిరి లాకప్ డెత్ పై గవర్నమెంట్​మెజిస్టీరియల్​ఎంక్వైరీ చేపట్టింది. రెండు విడతలుగా జరిగిన ఎంక్వైరీలో చాలా  వాస్తవాలు వెలుగు చూశాయి.  కస్టడీలో ఉన్న యాదగిరిని పోలీసులు ఎలా చిత్రహింసలు పెట్టారో 2002 ఆగస్టు 12న కొండపాక ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన మెజిస్టీరియల్ ​విచారణలో ప్రత్యక్షంగా చూసిన కొందరు వ్యక్తులు వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పుడు యాదగిరిని తీవ్రంగా కొట్టారని, అతను కనీసం నడవలేకపోయాడని చెప్పారు. యాదగిరిని తాను ఏప్రిల్​7న చివరిసారి చూశానని, తర్వాత అతని గురించి అడిగితే పారిపోయాడని చెప్పారని కస్టడీలో ఉన్న భీమరి కనకయ్య అనే వ్యక్తి చెప్పారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నవాడు  ఎలా పారిపోయాడో అర్థం కాలేదని వెల్లడించారు.

సుప్రీంకోర్టులో పిటీషన్

యాదగిరి లాకప్ డెత్ కేసులో న్యాయం చేయాలంటూ మృతుని సోదరి లక్ష్మి నర్సవ్వ 2005 ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేసును సీబీఐకి అప్పగించాలని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని, యాదగిరి మృతితో సంబంధమున్న పోలీసులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె అదే ఏడాది ఫిబ్రవరి 23న హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఈ కేసు గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు.