గుడ్ న్యూస్: కొత్త పాస్బుక్ వచ్చిన వారందరికీ రైతు బీమా.!

గుడ్ న్యూస్:  కొత్త పాస్బుక్ వచ్చిన వారందరికీ రైతు బీమా.!

 

  • ఈ ఫస్ట్​వీక్​లోగా ఏఈవోల వద్ద అప్లయ్ చేసుకునే వెసులుబాటు
  • ఈ నెల 13కు ముగియనున్న పాత బీమా గడువు
  • 14 నుంచి  రైతు బీమా ఇయర్ షురూ
  • కొత్త పట్టాదారుల్లో 18 నుంచి 59 ఏండ్ల వారికి ఇన్సూరెన్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి 2025=26  బీమా సంవత్సరం ఈ నెల 14 నుంచి షురూ కానుంది. ఈ నెల 13వరకు గత ఏడాది  బీమా గడువు ముగియనుంది. గత జూన్  నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులను వ్యవసాయశాఖ గుర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్​ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో  18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న  రైతులు రైతు బీమా పథకానికి అర్హులు. కాగా, అర్హులైన రైతులు కొత్తగా రైతుబీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్​ వీక్​లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యేడు 2025=26 రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పడు క్షేత్రస్థాయి అగ్రికల్చర్​ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హులను ఈ నెల 9 వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్​లో అధికారులు అప్​లోడ్​ చేయనున్నారు. 

గత జూన్​ నెలాఖరకు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల వివరాలను ఏఈవోలు సేకరించగా.. వారిలో బీమాకు అర్హులను ఏఓలు,  వ్యవసాయశాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలు, ఏఓస్థాయి, జిల్లాస్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు. రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్నా..  7లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి  సైతం ఈ సారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి  వ్యవసాశాఖ అనుమతించనుంది. ఈ యేడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కలిపి దాదాపు రెండు లక్షల వరకు ఉండవచ్చిన ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయేడు రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది.   

రెన్యువల్​​ డేటా పరిశీలనకు కసరత్తు

జులై 30వ తేదీ వరకు గత ఏడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యూవల్స్​ కు సంబధించి డేటా పరిశీలనకు రానుంది. నిరుడు రైతు బీమా అమలైన వారిలోనూ 60 ఏండ్లు నిండిన వారిని తొలగించి.. మిగతా అర్హులైన 45 లక్షల మందికి పైగా రైతులకు బీమాను రెన్యూవల్​ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరి పూర్తి వివరాలను ఏఈవోలు రైతు బీమా పోర్టల్లో రెన్యూవల్ అప్లోడ్  ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇలా పాత రెన్యూవల్స్​తో పాటు కొత్తగా అర్హులైన వారివి కలిపి ఈయేడు మొత్తం 48లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం రూ.3,600 వరకు సర్కారు ఎల్ఐసీకీ చెల్లించింది. ఈయేడు ఎంత ప్రీమియం అనేది త్వరలో తేల్చనున్నారు.  రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైనా, ఏవిధంగా  చనిపోయినా సదరు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందుతుంది.