
న్యూఢిల్లీ: రెండు చేతుల్లో రెండు మూటలు. అప్పుడే రైలు కదులుతోంది. దబదబా ఉరికాడు. ఓ బ్యాగును బోగీలో పెట్టాడు. బోగీకి ఉన్న స్టీల్ హ్యాండిల్‌ను పట్టుకొని రైలెక్కబోయాడు. అంతే.. కాలుజారి రైలుకు, ఫ్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. అతనితోపాటు రైలెక్కబోయిన మరో వ్యక్తి, అక్కడే ఉన్న కానిస్టేబుల్ వెంటనే స్పందించి అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లిద్దరూ ఒకరికొకరు తగిలి కింద పడిపోయారు. ఈలోగా బోగీ హ్యాండిల్‌ను పట్టుకున్న మొదటి ప్యాసింజర్‌ను రైలు ముందుకు ఈడ్చుకెళ్లింది. పడిపోయిన కానిస్టేబుల్ మళ్లీ లేచి వెళ్లి ప్యాసింజర్‌ను వెనక్కి లాగాడు. ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన అక్కడి కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను ఆర్పీఎఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కాపాడిన కానిస్టేబుల్ రాజ్‌వీర్ సింగ్‌ను హీరో అని పొగిడింది.