అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం వివాహం, విడాకులు, బాల్య వివాహాలపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పెళ్లి ప్రస్తావన సమయంలో బాలిక మౌనంగా ఉంటే ఆమె సమ్మతి తెలిపినట్లుగానే పరిగణిస్తారు. మైనర్ల వివాహాలపై తండ్రి, తాతల మాటే ఫైనల్ కానుంది.
కాబూల్: ఆఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం వివాహం, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి తమ ఇస్లామిక్ చట్టాల (షరియా) వివరణతో కూడిన సరికొత్త కుటుంబ నియమావళిని తీసుకువచ్చింది. తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదం తెలిపిన ఈ 31 ఆర్టికల్స్ నిబంధనల పత్రాన్ని ‘విడాకుల నిబంధనలు’ అనే పేరుతో గెజెట్‌లో ప్రచురించారు. ఇందులోని పలు నిబంధనలు మహిళల హక్కులను కాలరాసేలా ఉన్నాయంటూ అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- బాలబాలికలకు వేర్వేరు రూల్స్
ఈ కొత్త నిబంధనలలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం ‘సమ్మతి’కి సంబంధించినది. తన పెళ్లి ప్రస్తావన సమయంలో యుక్తవయస్సు వచ్చిన కన్య మౌనంగా ఉంటే ఆమె సమ్మతి తెలిపినట్లుగానే పరిగణిస్తారు. అయితే, అబ్బాయిలు, ఇదివరకే వివాహమైన మహిళలు మాత్రం స్పష్టంగా అనుమతి తెలపాల్సిందేనని చట్టం చెబుతోంది. మైనర్ల వివాహాలపై తండ్రులు, తాతలకు ఈ చట్టం విస్తృత అధికారాలను కట్టబెట్టింది. బంధువులు నిశ్చయించిన బాల్య వివాహాలు కూడా కొన్ని షరతులతో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
- వివాహ రద్దు హక్కు
ఈ చట్టంలో ఇస్లామిక్ సూత్రమైన 'ఖియార్ అల్-బులూగ్'ను చేర్చారు. దీని ప్రకారం, చిన్నతనంలోనే పెళ్లయిన బాలబాలికలు పెద్దయ్యాక తమ వివాహాన్ని రద్దు చేయమని కోరవచ్చు. అయితే, ఈ రద్దుకు తాలిబన్ మతపరమైన కోర్టుల అనుమతి తప్పనిసరి.
