‘ప్లూటో’ లోయకు ఇండియన్​ పేరు

‘ప్లూటో’ లోయకు ఇండియన్​ పేరు

సౌర వ్యవస్థలో మరుగుజ్జు గ్రహం ప్లూటో. దాన్నే తెలుగులో యమ/వరుణ గ్రహం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ గ్రహానికి నేరుగా భూమిపై ఉన్న ఇండియాతో ఓ లింక్​ ఉండబోతోంది. ఆ గ్రహంపైన ఉన్న ఓ లోయకు మన సైంటిస్టు పేరు పెట్టింది ఇంటర్నేషనల్​ ఆస్ట్రానమికల్​ యూనియన్​ (ఐఏయూ). గత నెలలో ప్లూటో లోయలకు రెండో సెట్​ పేర్లను పెట్టింది. 2015లో న్యూ హొరైజాన్స్​ స్పేస్​క్రాఫ్ట్​తో నాసా ప్లూటో మిషన్​ను చేపట్టింది. అక్కడ కనుగొన్న లోయలకు నాసా టీం 14 పేర్లను సూచించింది. అందులో బిషున్​​ ఖారే పేరునూ ప్రతిపాదించింది. గత నెలలోనే ఖారే సహా ఆ 14 పేర్లను ఐఏయూ ఖరారు చేసింది. 1933 జూన్​ 27న వారణాసిలో పుట్టిన ఖారే, బెనారస్​ హిందూ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మేథ్స్​లలో డిగ్రీలు చశారు. తర్వాత న్యూయార్క్​లోని సైరాక్యూజ్​ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్​లో పీహెచ్​డీ పూర్తి చేశారు. స్టోనీ బ్రూక్​లోని స్టేట్​ యూనివర్సిటీ ఆఫ్​ న్యూయార్క్​, యూనివర్సిటీ ఆఫ్​ టొరంటోలో పోస్ట్​ డాక్టోరల్​ రీసెర్చ్​ చేశారు. 1960 నుంచి 1990 వరకు కార్నెల్​ యూనివర్సిటీలో పనిచేశారు. ఫిజిక్స్​లో 100 రీసెర్చ్​ పేపర్లు రాశారు. తర్వాత 1996లో నాసా ఏమ్స్​లో సీనియర్​ రీసెర్చ్​ ఫెలోగా చేరారు. 1998లో సెటీ ఇనిస్టిట్యూట్​లో సైంటిస్టుగా పనిచేశారు. 2013 ఆగస్టులో 80 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఆయన సైంటిస్టుగా ఉన్న సమయంలో శని చందమామలైన టైటాన్​, ఎన్సిలాడస్​లపై ఏర్పడిన మీథేన్​, ఇతర ఆర్గానిక్​ మూలకాలు, వాటి మబ్బులపై పరిశోధన చేశారు. అంతేగాకుండా ప్లూటోపై ఎరుపు రంగు రావడానికి కారణం థోలిన్స్​ అనే కర్బన అణువేనని ఆయన కనిపెట్టారు. అందుకు గుర్తుగానే ప్లూటో లోయకు బిషున్​ ఖారే పేరు పెడుతున్నామని ఐఏయూ ప్రకటించింది. అంతకుముందు రెండేళ్ల క్రితం ప్లూటోపై రెండు కొండలకు మొదటి సెట్​ పేర్లను ఐఏయూ పెట్టింది.