అమెరికాకు సంబంధమే లేదు.. కాల్పుల విరమణ ఒప్పందంపై విదేశాంగ శాఖ

అమెరికాకు సంబంధమే లేదు.. కాల్పుల విరమణ ఒప్పందంపై విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిత్వం లేదని భారత విదేశాంగ శాఖ కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాలు ద్వైపాక్షికంగా తీసుకున్న నిర్ణయమే తప్ప అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని మిస్రీ పునరుద్ఘాటించారు. పాక్, భారత్ మధ్య జరిగిన యుద్ధం సంప్రదాయ యుద్ధ విధానంలోనే జరిగిందని.. పాక్ నుంచి ఎలాంటి అణు సంకేతాలు గానీ హెచ్చరికలు గానీ లేవని చెప్పారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ట్రంప్ బహిరంగంగా ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికానే కారణమని ఏడుసార్లు ప్రకటించుకుంటే భారత్ ఎందుకు స్పందించలేదని ఈ పానెల్లోని ఒక మెంబర్ విదేశాంగ శాఖను నిలదీశారు. ఇందుకు మిస్రీ సమాధానమిస్తూ.. ట్రంప్ అలా తెరపైకి వచ్చి ప్రకటనలు చేసుకున్న సందర్భంలో తమ అనుమతి తీసుకోలేదని, ఆయన రావాలని అనుకున్నారని.. వచ్చారని చెప్పారు.

ALSO READ | ట్రంప్ ఇండియాపై కక్షగట్టాడా..? మామిడి పండ్లు రిజెక్ట్, రైతులకు రూ.4 కోట్లు నష్టం

భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మధ్యవర్తిత్వం వహించి ఇరుదేశాల ప్రధానులతో రాత్రంతా చర్చలు జరిపానని వెల్లడించారు. ‘‘తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణ పాటించేందుకు భారత్, పాక్ అంగీకరించాయని ప్రకటించేందుకు సంతోషిస్తున్నా. కామన్ సెన్స్, గొప్ప తెలివితేటలను ప్రదర్శించిన ఆ రెండు దేశాలకూ నా అభినందనలు. ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు” అని ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ ఆ సమయంలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ పలుమార్లు ప్రకటించుకున్నారు.