సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం

సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం
  • గత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఫైర్
  • రూ.1,552 కోట్ల అంచనాలను రూ.23 వేల కోట్లకు పెంచారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే  సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట గత ప్రభుత్వం భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ల కోసం కాదన్నట్లుగా గత ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా వాటర్ గురించి బీఆర్ఎస్ వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇరిగేషన్ శాఖలోనే రూ.18 వేల కోట్లు వడ్డీలు, రూ.9 వేల కోట్లు అన్ పెయిడ్ బిల్స్ కింద చెల్లించాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ చేసిన తర్వాత మీడియాతో భట్టి, ఉత్తమ్ మాట్లాడారు.

రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ విజిట్

‘‘గతంలో రాజీవ్‌‌ దుమ్ముగూడ, ఇందిరాసాగర్‌‌ అని రెండు వేర్వేరు ప్రాజెక్టులు ఉండేవి. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదు. కేసీఆర్‌‌ సీఎం హోదాలో అసెంబ్లీలోనూ సీతారామ ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పారు” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. కేఆర్ఎంబీ విషయంలో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కూడా తెలంగాణకు తీసుకురాలేదు. ఒక్క ప్రాజెక్టుకు సైతం సరైన ఫార్మాట్ లో జాతీయ హోదా కోసం అప్లై చేయలేదు” అని మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు త్వరలోనే జాతీయ హోదా కోరుతామని, కేంద్రం అమలు చేస్తున్న పథకాల నుంచి నిధులు తీసుకుంటామని తెలిపారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి తమ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపిందని.. తాము సమాధానం చెప్పలేదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ విజిట్ చేస్తామని చెప్పారు.

ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలే

ఇంతటి దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ అవినీతిని చూస్తే కడుపు తరుక్కుపోతున్నదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి భారీ అవినీతిని ఎన్నడూ చూడలేదని అన్నారు. ‘‘2014లో కేవలం రూ.1,552 కోట్లతో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేవి. రూ.1,552 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి రూ.23 వేల కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి పది సంవత్సరాలుగా ఒక ఎకరానికి కూడా గత ప్రభుత్వం గోదావరి నీళ్లను అందించలేదు” అని మండిపడ్డారు. గోదావరి - శబరి నది కలిసే ప్రాంతం నుంచి ఇందిర సాగర్ ప్రాజెక్టును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేయగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రీ డిజైన్ వల్ల ఈ నది నుంచి 365 రోజుల పాటు వచ్చే నీళ్లను తెలంగాణ ప్రజలు కోల్పోయారన్నారు.