భగుళాముఖి గుడిలో లక్ష హరిద్రార్చన

భగుళాముఖి గుడిలో లక్ష హరిద్రార్చన

హాజరైన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడి

మెదక్/శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని భగుళాముఖి అమ్మవారి ఆలయంలో ఆదివారం నిర్వహించిన లక్ష హరిద్రార్చన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఫారెస్ట్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి పూజలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా నిర్మిస్తున్న భగుళాముఖి అమ్మవారి శక్తిపీఠం ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ శివ్వంపేట జడ్పీటీసీ పబ్బా మహేశ్​గుప్తా కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆలయ నిర్మాణానికి దానం చేయడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. జడ్పీటీసీ మహేశ్​గుప్తా, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను మంత్రి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా కమిషన్ చైర్​పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆలయానికి విరాళంగా రూ. 3 లక్షల చెక్కు అందజేశారు. హైదరాబాద్ వ్యాపారవేత్త శ్యాంప్రసాద్ రెడ్డి రూ.18 లక్షల చెక్కు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, టీఆర్ఎస్ మండల  అధ్యక్షుడు రమణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, హైకోర్టు లాయర్​శివకుమార్ గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్​మన్సూర్ అలీ, సొసైటీ చైర్మన్ వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.