ఆస్తి కోసం వేధిస్తున్నాడని తండ్రిని చంపేశాడు..మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన

ఆస్తి కోసం వేధిస్తున్నాడని తండ్రిని చంపేశాడు..మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
  •  నవాబుపేట మండలం కామారం గ్రామంలో ఘటన

నవాబుపేట, వెలుగు: భూమి తన పేరిట మార్చాలని వేధిస్తున్నాడని తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం కామారం గ్రామంలో జరిగింది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. కామారం గ్రామానికి చిలుకల కృష్ణయ్య(52) 2015లో భార్యను చంపిన కేసులో  జైలుకు వెళ్లాడు. శిక్ష పూర్తి చేసుకొని కొన్నేండ్ల కింద వచ్చాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతడి కొడుకు వెంకటేశ్ ​తండ్రి ఆస్తిని తన పేరిట బదలాయించుకున్నాడు. దీనిపై తండ్రి, కొడుకుల మధ్య గొడవలు జరిగేవి. 

30 గుంటల పొలాన్ని తన పేరిట మార్చాలని కొడుకుతో గొడవపడుతూ అతడిని కొట్టేవాడు.శుక్రవారం తెల్లవారుజామున భూమి విషయంలో మరోసారి  ఇద్దరు గొడవపడ్డారు. వెంకటేశ్​ను తండ్రి కట్టెతో కొట్టగా, కృష్ణయ్యను వెంకటేశ్​ రోకలిబండతో తలపై కొట్టాడు. తీవ్రగాయాలైన కృష్ణయ్య అక్కడికక్కడే చనిపోగా, గ్రామంలో ఉంటున్న బాబాయ్​ సత్యనారాయణకు ఫోన్​ చేసి విషయం చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి అన్న చిలుకల చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.