
కామారెడ్డి, వెలుగు: ట్రాక్టర్బొమ్మ ఉన్న పాత నోటు చూపితే రూ.11 లక్షలు ఇస్తామని ఆశ చూపి దశలవారీగా రూ.8.35 లక్షలను ఓ వ్యక్తి నుంచి నొక్కేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన కస్తూరి నర్సింహులుకు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ఫోన్చేశారు. ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటు తమకు అప్పగిస్తే రూ.11 లక్షలు ఇస్తామంటూ చెప్పారు. తన వద్ద అలాంటి నోట్లు ఉన్నాయని నర్సింహులు చెప్పగానే నీకు రూ.11 లక్షలు ఇవ్వాలంటే ఐటీ, ఇతర ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినట్లుగా విడతలవారీగా ఆన్లైన్ బ్యాంకింగ్ద్వారా రూ.8.35 లక్షల వరకు పంపారు. తర్వాత అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మోసపోయానని బాధితుడు గ్రహించారు. దేవునిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.