కుక్కలు పీక్కుతింటుంటే  ఏం చేస్తున్నరు?

కుక్కలు పీక్కుతింటుంటే  ఏం చేస్తున్నరు?

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్​లో కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్  గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన అత్యవసర  సమావేశం వాడివేడిగా జరిగింది. సిటీలో కుక్కలు మనుషులను పీక్కు తింటుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తున్నదని మేయర్​ను బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్​ కార్పొరేటర్లు నిలదీశారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో  కుక్కల నియంత్రణకు ఏం చేద్దాం, ఎలా చేద్దామన్న దానిపై చర్చించారు. సిటీలో 30 సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 17 మంది వెటర్నరీ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. కుక్కలను పట్టి వ్యాక్సిన్  వేసేందుకు 30 సర్కిల్లో కేవలం 364 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. 30 వెహికల్స్​, ఆపరేషన్లు చేసేందుకు ఐదు ఆపరేషన్  థియేటర్లు, 5 షెల్టర్ హోమ్స్  మాత్రమే ఉన్నాయి. డాక్టర్లు, వెహికల్స్, స్టాఫ్​ను పెంచాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బాగ్​అంబర్​పేటలో కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేయగా డబుల్ బెడ్రూం ఇంటితో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఎంఐఎం కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 

సలహాలు సూచనలు ఇవ్వండి: మేయర్

వీధికుక్కల నివారణకు సూచనలు, సలహాలు ఇవ్వాలని సభ్యులను మేయర్  విజయలక్ష్మి కోరారు. సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అఖిలపక్ష కమిటీ వేస్తామని, అందుకు ఆయా పార్టీల నుంచి ఇద్దరి పేర్లను ప్రతిపాదించాలని తెలిపారు. అంబర్​పేట్ ప్రమాదంలో మరణించిన చిన్నారి కుటుంబానికి తన తరఫున రూ.2 లక్షలతో పాటు తన నెలసరి గౌరవ వేతనం రూ.65 వేలు అందిస్తానని మేయర్  చెప్పారు. ఈ సాయానికి అదనంగా జీహెచ్ఎంసీ తరఫున రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని మేయర్ తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వానికి నివేదిక పంపి బాలుడి కుటుంబానికి తగిన సహాయం అందేలా కృషిచేస్తామని ఆమె హామీ ఇచ్చారు. వీధి కుక్కల నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్, స్టెరిలైజేషన్  వంటి చర్యలు తీసుకుంటామన్నారు. రోజూ జరుగుతున్న 150 స్టెరిలైజేషన్ ప్రక్రియను ఇకపై 400 నుంచి 450కు పెంచుతామన్నారు. ప్రస్తుతం ఉన్న 30 వాహనాలతో పాటు అదనంగా మరో 20 వెహికల్స్ ఏర్పాటు చేసి ఒక్కో వాహనానికి ఐదుగురు సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామన్నారు. కాగా, డిప్యూటీ మేయర్  తన గౌరవ వేతనం రూ.32 వేల 500, మీటింగ్​కు హాజరైన 17 మంది కార్పొరేటర్లు ఒక్కొక్కరు రూ.7,800 గౌరవ వేతనాన్ని బాలుడి కుటుంబానికి సాయంగా అందించాలని తీర్మానించారు. తమ తరపున రూ.లక్ష అందిస్తామని బీజేపీ కార్పొరేటర్లు ప్రకటించారు. దీంతో రూ.10 లక్షలకు పైగా బాలుడి కుటుంబానికి సాయం ప్రకటించినట్లయింది.

మాంసం షాపులకు ప్రత్యేకంగా కవర్లు : కమిషనర్

హైదరాబాద్  నగరంలో మటన్, చికెన్ షాపుల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా కవర్లను అందజేస్తామని కమిషనర్ డీఎస్​ లోకేశ్ కుమార్ తెలిపారు. సమావేశంలో పలు విషయాలను ఆయన వెల్లడించారు. కార్పొరేటర్లు ఐదు యానిమల్ కేర్ సెంటర్లను సందర్శించి అక్కడ అవసరమైన సదుపాయాలు సూచించాలన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్లను నియమిస్తామన్నారు. ఆనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, రేబిస్ టాకాల పై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఇకపై ఏటా కుక్కలు ఎన్ని ఉన్నాయో గుర్తిస్తామన్నారు. కుక్కల బెడదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కోతుల బెడదకూ చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్  తెలిపారు. కుక్కలను పట్టే వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీధికుక్కలను పెంచుకోవడానికి ముందుకు వచ్చినవారికి ఫ్రీ లైసెన్సు, రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు.