కేసు దర్యాప్తే ఓ శిక్ష!

కేసు దర్యాప్తే ఓ శిక్ష!

చట్టం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. అంటే చట్టాన్ని శాసనకర్తలు మార్చవచ్చు. వాళ్లు మార్చకున్నా హైకోర్టులు, సుప్రీంకోర్టులు శాసనాలపై కాలనుగుణంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాయి. అందుకే చట్టం ఎప్పుడూ ఒకే తరహాలో ఉండదని, మారుతూ ఉంటుందని అంటారు. మద్యపానాన్ని నిషేధిస్తూ ఎన్టీఆర్​ జమానాలో ఓ చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం అమల్లో ఉన్నప్పుడు మద్యం తాగడం లేదా మద్యం బాటిల్స్ కలిగి ఉండటంగానీ నేరం. కానీ, ఆ తరువాత సంపూర్ణ మద్యపానాన్ని ఎత్తివేశారు. ఒకప్పుడు..సంపూర్ణ మద్యపాన నిషేధం చట్టం రాకముందు మద్యం తాగడం నేరం కాదు. ఆ చట్టం వచ్చిన తరువాత మద్యం తాగడం నేరమైంది. ఈ విధంగా న్యాయం మారుతూ ఉంటుంది.  ఈ విధంగానే కాకుండా కోర్టులు చట్టంలోని నిబంధనలకు ఇచ్చిన వ్యాఖ్యానం ద్వారా చట్టం మారుతూ ఉంటుంది. అర్థాలు మారతాయి. సమాజాన్ని బట్టి ఆ నిబంధనలకు వ్యాఖ్యానం చేస్తూ నిబంధనల అర్థాలను కోర్టులు మారుస్తాయి. అదేవిధంగా కొత్త చట్టాల్లోని నిబంధనల్లో ఉన్న వాక్యాలను బట్టి కోర్టులు తమ భాష్యాన్ని కొత్తగా చెపుతుంటాయి. అలాంటి భాష్యమే రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రకటించింది. బెయిల్​ విషయంలో ఈ భాష్యాన్ని ‘ఉపా’ కేసులో ప్రకటించింది. ఈ భాష్యం గురించి తెలుసుకునే ముందు బెయిల్​ గురించి సుప్రీంకోర్టు గతంలో ఎలాంటి వ్యాఖ్యానం చేసిందో చూద్దాం. 

మోతీరాం అండ్​ అదర్స్​వర్సెస్​ స్టేట్ ఆఫ్​ఎంపీ ఏఐఆర్ 1978 సుప్రీంకోర్టు 1594 కేసులో  జైల్లో ఉన్న ఓ ముద్దాయి గురించి సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా చెప్పింది. ‘అతను తప్పు చేయడం వల్ల జైల్లో లేడు. అతడి మీద కోర్టు శిక్ష విధించడం వల్ల అతను జైల్లో లేడు. అతను కోర్టులో విచారణకి అందుబాటులో ఉండే అవకాశం లేనందువల్ల జైల్లో లేడు. అతను జైల్లో ఉండటానికి ఒకే ఒక కారణం.. అతను బీదవాడు కావడం’.  కోర్టులో హాజరుకావడానికి సెక్యూరిటీ అంటే జమానత్​ ఇచ్చి లీగల్​ కస్టడీ నుంచి విడుదల కావడాన్ని బెయిల్​ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21 ప్రకారం  వ్యక్తి జీవితాన్ని , వ్యక్తి స్వేచ్ఛను శాసనబద్ధమైన ప్రొసీజర్​ ప్రకారం తప్ప మరోవిధంగా హరించడానికి వీల్లేదు. చాలామంది పేదలు చిన్న చిన్న నేరాలు చేసి జామీను ఇచ్చుకోలేక జైలులో మగ్గిపోవడాన్ని చూసి సుప్రీంకోర్టు మోతీరామ్​ కేసులో పై విధంగా అన్నది. బెయిల్​ అనేది నియమమని, జైలులో ఉంచడం మినహాయింపు అని జస్టిస్​ క్రిష్ణయ్యర్​ స్టేట్ ఆఫ్​ రాజస్థాన్ వర్సెస్​ బాల్ చంద్​ కేసులో అన్నారు. 1977వ సంవత్సరంలో ఈ కేసును న్యాయస్థానం పరిష్కరించింది. వ్యక్తి స్వేచ్ఛ, న్యాయం, ప్రజల రక్షణ, రాజ్యంమీద భారం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బెయిల్​ అనేది నియమమని, నిరాకరించడం అనేది మినహాయింపు అని జస్టిస్​ క్రిష్ణయ్యర్ చార్​చంద్​ కేసులో, అదేవిధంగా పడికంటి నర్సింహులు కేసులోనూ అన్నారు. అయితే ఈ బెయిల్​ జ్యురిస్ప్రుడెన్స్​ మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఎస్ఎస్​ మామాబై వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ మహారాష్ట్ర   కేసులో జస్టిస్​ దల్వీర్​ బండారీ ఈ విధంగా అన్నారు. బెయిల్ ఇవ్వడంలో, అదేవిధంగా నిరాకరించడంలో సమాజ హితమనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ప్రతి నేరమనేది రాజ్యానికి వ్యతిరేకంగా జరిగినది. అందుకని కోర్టు జారీచేసే ఉత్తర్వులు సమాజ హితానికి వ్యక్తిగత స్వేచ్ఛకి మద్య సమతుల్యతను పాటించాలి. ఇంతవరకు ఫర్వాలేదు. కానీ, ఇటీవల వస్తున్న శాసనాల్లో బెయిల్​ పొందడమనేది కఠినతరంగా మారిపోయింది. 

నిర్బంధం స్వేచ్ఛాహక్కుకు భంగం

బెయిల్​ పొందడాన్ని కఠినతరం చేసినప్పుడు కేసు దర్యాప్తు, విచారణ సత్వరం జరగాలి. అలా జరగకుండా ముద్దాయిలను జైలులో నిర్బంధించడం వల్ల రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛాహక్కుకి, జీవించే హక్కుకి భంగం వాటిల్లుతుంది. ఫిబ్రవరి 8, 2024 రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం ‘ఉపా’ చట్టంలోని ఓ బెయిల్​ అప్లికేషన్ని పరిష్కరిస్తూ గతంలో జస్టిస్​ క్రిష్ణయ్యర్ చెప్పిన ‘బెయిల్​ అనేది నియమం,  నిరాకరించడం అనేది మినహాయింపు’ అనే సూత్రానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఖలిస్థాన్​ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న ఓ వ్యక్తి బెయిల్​ దరఖాస్తుని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, అరవింద్​ కుమార్​లు భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉపా చట్టం ప్రకారం బెయిల్​ పొందడం అనేది మినహాయింపు, జైలు అనేది నియమం అని అన్నారు. అక్కడితో ఊరుకోలేదు. కేసు విచారణలో జాప్యం ఉండటం అనేది బెయిల్​ పొందడానికి ఆధారం కాదని పేర్కొన్నారు.

‘ఉపా’ కేసుల్లో బెయిల్​ దుస్సాధ్యం 

రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం తీవ్రవాద నేరాల్లో ఇరుక్కున్న వ్యక్తులు 97.5శాతం జైలులోనే మగ్గుతున్నారు. కేసు విచారణ ముందుకు సాగడం లేదు. బెయిల్​ రావడం లేదు. సెషన్స్ కోర్టు ఈ కేసుల్లో బెయిల్​ ఇవ్వడానికి జంకుతున్నాయి. నిబంధనలు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఉపా, మాదకద్రవ్యాలు తదితర కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు బెయిల్ పొందడం దుస్సాధ్యంగా మారిపోయింది. సుప్రీంకోర్టు మొన్న 8వ తేదీన ప్రకటించిన వ్యాఖ్యానాలను చూసిన సెషన్స్​ జడ్జీలు ఈ కేసుల్లో బెయిల్​ను ఇస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్​ ఇలా అన్నారు. ఇప్పుడు వాడుకలో ఉన్న బెయిల్​ జ్యురిస్ప్రుడెన్స్​ ప్రకారం ‘బెయిల్​ అనేది నియమం. జైలు అనేది మినహాయింపు’ అనేది ‘ఉపా’ కేసులకి వర్తించదు. ఈ కేసుల్లో బెయిల్​ ఇవ్వడం అనేది చాలా పరిమితమైనది. దాని పరిధి కూడా తక్కువ. ‘ఉపా’ చట్టం లోని సెక్షన్​ 43డి (5) ప్రకారం బెయిల్​ ఇవ్వకూడదన్న అర్థం అనిపిస్తుంది. అదే క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని పదాల రూపం ప్రకారం బెయిల్​ను మంజూరు చేయవచ్చన్న అర్థం కనిపిస్తుంది. ఉపా చట్టంలోని ‘విడుదల చేయకూడదని’ కనిపిస్తుంది. అదే క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రకారం విడుదల కావొచ్చు అన్న ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. 

మేధావులను తొలుస్తున్న ప్రశ్న

పోలీసులకు అపరిమిత అధికారాలు ‘ఉపా’ చట్టంలో ఉన్నాయి. అవి దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఏదో ఒక కారణం చూపిస్తూ ప్రభుత్వాలను వ్యతిరేకించే వ్యక్తుల మీద ఈ చట్టం ప్రకారం కేసులను పెట్టి వాళ్లను జైలులో ఉంచే పరిస్థితి ఎక్కువగా ఉంది. ‘ట్రయలే ఓ శిక్ష అని నేను ఓ కవితలో అన్నాను. కేసు విచారణల్లో జరుగుతున్న జాప్యాన్ని చూసి ఆ కవితలో అలా అన్నాను. ఇప్పుడు  దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ‘కేసు దర్యాప్తే ఓ శిక్ష’ అని ఇప్పుడు రాయాల్సి ఉంది. నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియ అనేవి శిక్షలుగా మారిపోతున్న కాలంలో కోర్టులు ముద్దాయిలను ఎప్పుడు కరుణిస్తాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎప్పుడు తమ వ్యాఖ్యానాలను మార్చుకుంటాయో చూడటం తప్ప మరో మార్గం లేదా?. ఇది మేధావులను తొలుస్తున్న ప్రశ్న. 

కేసు విచారణలో జాప్యం ఉన్నా..నో బెయిల్​

శాసనకర్తల ఉద్దేశ్యం ప్రకారం‘బెయిల్​ అనేది మినహాయింపు. జైలు అనేది నియమం’.  సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం, ప్రాసిక్యూటర్​ వాదనలు విన్న తరువాత, కేసులోని డాక్యుమెంట్స్​ను పరిశీలించిన తరువాత ముద్దాయిపై ఉన్న ఆరోపణలు ప్రాథమిక దృష్టిలో చూసినప్పుడు నిజమని అనిపించినప్పుడు బెయిల్​ను ఇవ్వకూడదు.  బెయిల్​ తిరస్కరించడానికి అవకాశం కన్పించినప్పుడు కోర్టు ట్రిపాడ్​ పరీక్ష ప్రకారం విచారించి బెయిల్​ మంజూరు చేయాల్సి ఉంటుంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని, సాక్ష్యాలను తారుమారు చేయరని, ప్రమాదం లేదని భావించినప్పుడు మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘ఉపా’ చట్టం కింద అరెస్టయిన వ్యక్తులకు బెయిల్​ రావడం లేదు. కేసు విచారణల్లో జాప్యం ఉన్న కేసుల్లో కోర్టులు కొన్నింటిలో బెయిల్​ను మంజూరు చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులతో ఆ ఆశ కూడా పోయింది. విద్యార్థి నాయకుడు ఉమర్​ ఖలీద్​ సెప్టెంబర్​ 2020లో ‘ఉపా’ చట్టం కింద అరెస్ట్​ అయినాడు. అతని బెయిల్​ పిటిషన్​ ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది. రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తున్నది. ‘ఉపా’ లాంటి చట్టాల కింద దాఖలు అవుతున్న బెయిల్​ దరఖాస్తులను గమనించినప్పుడు బెయిల్​ పొందడమన్నది దుస్సాధ్యం అనిపిస్తుంది. కేసు విచారణలో జాప్యం ఉన్నంతమాత్రాన కూడా బెయిల్​  మంజూరు చేయకూడదన్నది సుప్రీంకోర్టు తాజా అభిప్రాయం. 

- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్)

  • Beta
Beta feature
  • Beta
Beta feature