పైసల వర్షం కురిపిస్తామని.. రూ.21 లక్షలు స్వాహా ..చేవెళ్లలో ‘బ్లఫ్మాస్టర్’ మూవీని మించిన ఘటన

పైసల వర్షం కురిపిస్తామని..  రూ.21 లక్షలు స్వాహా ..చేవెళ్లలో ‘బ్లఫ్మాస్టర్’ మూవీని మించిన ఘటన
  • రూ.21 లక్షలను రూ.4 కోట్లు చేస్తామని టోకరా
  • ముఠాలోని ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
  • రూ.18 లక్షల నగదు, గ్రాము గోల్డ్, ఫేక్ నోట్ల కట్టలు స్వాధీనం

చేవెళ్ల, వెలుగు:  మీరు ఎప్పుడైనా పైసల వర్షం చూశారా.. చూడకపోతే మేం చూపిస్తామని చెప్పి ఓ ముఠా రూ.21 లక్షలు స్వాహా చేసింది. ‘బ్లఫ్​ మాస్టర్’ మూవీని మించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగురు, తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ముగ్గురు మొత్తం ఏడుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. 

గండిపేటకు చెందిన బాధితుడిని నమ్మించి ఈ నెల 18న ఆదిలాబాద్​లో పైసల వర్షం కురిపిస్తామని డెమో ఇచ్చారు. రూ.21 లక్షలు తీసుకొని వస్తే వాటిని రూ.4 కోట్లుగా వర్షం కురిపిస్తామని నమ్మించారు. వీరి బుట్టలో పడిన బాధితుడు ఈ నెల 25న శుక్రవారం చేవెళ్ల మండలం ముడిమ్యాల అటవీ ప్రాంతానికి రూ.21 లక్షలు తీసుకొని వెళ్లాడు. పూజకు వచ్చేటప్పుడు నిందితులు బాధితుడి కారులోనే వచ్చి, అతనికి తెలియకుండా వేరే కారు తెప్పించుకుని పూజలు మొదలుపెట్టారు. 

ఆ కాంతిని మీరు తట్టుకోలేరు!

పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి, నిమ్మకాయలు, అగరుబత్తీలు పెట్టి, ఫోన్​లు స్విచాఫ్ చేయించారు. పూజ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు,  కాంతులు వస్తాయని, దానిని మీరు చూసి తట్టుకోవడం సాధ్యం కాదని, ఇది కేవలం స్వామిజీలైన తమకు మాత్రమే సాధ్యమన్నారు. ఆ తర్వాత బాధితుడిని కారులో కూర్చోబెట్టి, రూ.21 లక్షలతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు.  వీరి నుంచి రూ.18 లక్షల నగదు, 1 గ్రాము బంగారం, ఆర్బీఐ, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనో రంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్లతో కూడిన రూ.500, రూ.100 ఫేక్ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు వీరే..

ఏ1 సిద్దేశ్వర్ దత్త వాంఖడే (మహారాష్ట్ర), ఏ2 ప్రకాశ్ మరోత్ రావు మాధవి (మహారాష్ట్ర), ఏ3 సింగారె ధర్మేందర్ (ఆదిలాబాద్), ఏ4 ములుకుంట్ల సంజీవ్​కుమార్ (పెద్దపల్లి), ఏ5 కౌమండ్ల శ్రీనివాస్ (మంచిర్యాల) ను అరెస్ట్ చేయగా, ఏ6 దేవ్లోవ్ షిండే (మహారాష్ట్ర), ఏ7 ప్రశాంత్ పాటిల్ (మహారాష్ట్ర) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా పైసల వర్షం పేరిట తొలుత ఒక డెమో చేసి నమ్మిస్తుందని, ఆ తర్వాత ఫేక్ నోట్లను పెట్టి అసలైన నోట్లతో ఉడాయిస్తారని తెలిపారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని చేవెళ్ల ఎస్ఐ సంతోష్​రెడ్డి సూచించారు.