పిల్లలను పిచ్చోళ్లను చేస్తున్న స్మార్ట్​ఫోన్

పిల్లలను పిచ్చోళ్లను చేస్తున్న స్మార్ట్​ఫోన్

ఏడాది, రెండేండ్లకే చేతుల్లోకి సెల్​
మొబైల్ అడిక్షన్‌‌తో మానసిక సమస్యలు
సైకోల్లా మారుతున్న కొందరు పిల్లలు
మందలిస్తే ఇంటి నుంచి పరారీ
మొబైల్ లాక్కుంటే హత్యలు,
ఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్యలు
టీనేజర్ల దాకా ఇదే పరిస్థితి
సైకియాట్రిస్టుల దగ్గరకు తీసుకెళ్తున్న పేరెంట్స్‌‌
8 ఏండ్లలోపే మొబైల్ అడిక్షన్ మాన్పించాలంటున్న డాక్టర్లు

ఏడేండ్ల బుడతడు.. ఫోన్‌‌ లేకుండా క్షణం ఉండలేకపోతున్నాడు. ఫోన్ లాక్కుంటే బూతులు తిడుతున్నాడు. ఫోన్ ఇచ్చేదాక నానా హంగామా చేస్తున్నాడు. తలను గోడకు బాదుకోవడం, తండ్రిని కొట్టడం, బిల్డింగ్‌‌పై నుంచి దూకుతానని బెదిరించడం వంటి వయసుకు మించిన చేష్టలను చూసి తండ్రికి భయం పట్టుకుంది. అన్ని ప్రయత్నాలూ చేసి.. చివరకు ఓ సైకాలజిస్ట్‌‌ను ఆశ్రయించాడు. మొదట ఆ బుడతడు సరదాగా మాట్లాడినా.. ఫోన్ వాడొద్దని చెప్పడంతో డాక్టర్‌‌‌‌ను కూడా తిట్టడం, కొట్టడం స్టార్ట్‌‌ చేశాడు.

ఆ పాప వయసు పదకొండేండ్లు. చదివేది ఫోర్త్​ క్లాస్. ఓరోజు ఆ పిల్ల పాములా నాలుకను ఆడించడం, మెలికలు తిరగడం చూసి పేరెంట్స్ ఆశ్చర్యపోయారు. సైకియాట్రిస్ట్‌‌ వద్దకు తీసుకెళ్లగా.. పాములా మారాలనుకుంటున్నానని డాక్టర్​తో చెప్పింది. నాగిని సీరియల్‌‌లో అమ్మాయి పాములా మారుతుందని, తానూ అలాగే మారుతానని చెప్పడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. ఇంట్లో రోజూ నాగిని సీరియల్‌‌.. స్మార్ట్ ఫోన్ లో పాముల వీడియోలు చూస్తునట్టు తేలింది.

హైదరాబాద్‌‌, వెలుగుపిల్లలకు మొబైల్​ ఫోన్ల బీమార్​ పట్టుకుంది. ఏడాది, రెండేండ్ల వయసులోనే స్మార్ట్‌‌ఫోన్లకు బానిసలవుతున్నారు. ఆరేడు ఏండ్లు వచ్చేసరికి ఫోన్‌‌ తీసుకుంటే సైకోల్లా మారిపోయి.. తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. ఇంకాస్త పెద్దోళ్లైతే ఇల్లు వదిలి పారిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు, హత్యలకూ వెనకాడటం లేదు. పిల్లల ఏడుపు ఆపడానికో, ఓ ముద్ద మింగడానికో, తమను డిస్టర్బ్‌‌ చేయకుండా ఉండటానికి ఒకట్రెండేండ్ల వయసులోనే పేరెంట్స్‌‌ స్మార్ట్‌‌ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీంతో పిల్లలు వాటికి బానిసలవుతున్నారు. చదవు సంగతి కూడా పట్టించుకోకుండా ఫోన్​లో లీనమైపోతున్నారు. ఇవన్నీ గమనించి ఫోన్ తీసుకుంటే పేరెంట్స్​ మీదకు మర్లపడుతున్నారు. కొందరు తమను తామే గాయపర్చుకుంటూ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. ఆల్కహాల్ డి అడిక్షన్‌‌ మాదిరిగానే మొబైల్ డి అడిక్షన్ కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

క్రియేటివిటీ తగ్గిపోతది

పిల్లలకు ఎనిమిదేండ్ల వరకూ అసలు ఫోన్ ఇవ్వొద్దు. 16 ఏండ్ల లోపు ఫోన్ ఇచ్చినా పేరెంట్స్ పక్కనే ఉండాలి. 16 ఏండ్ల తర్వాత సొంత మొబైల్ ఇచ్చినా, పిల్లలు ఏంచేస్తున్నారు.. ఏం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. 8 ఏండ్లలోపు ఫోన్ అలవాటు మానిపించకపోతే, ఆ తర్వాత మానడం చాలా కష్టం. ఆ ప్రభావం చదువు, ఆరోగ్యంపై పడుతుంది. వాళ్లలో క్రియేటివిటీ తగ్గిపోతుంది. నలుగురితో కలవలేరు. చిన్న చిన్న సమస్యకూ కుంగిపోతారు, ఓవర్‌‌‌‌గా రియాక్ట్‌‌ అవుతారు. మొండిగా తయారై పేరెంట్స్‌‌పై తిరగబడతారు, బెదిరిస్తారు.

– డాక్టర్‌‌‌‌ రిషి, సైకియాట్రిస్ట్‌‌, నిలోఫర్‌‌‌‌

గంటల కొద్ది మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చూడడం, గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడడం వల్ల పిల్లల బ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కండ్లు, మెడ నరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మానసిక రోగాలు వస్తున్నాయి. పిల్లల చేతిలో నుంచి మొబైల్ తీసుకుంటే చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో కలవలేక ఆత్మన్యూనతకు లోనవడంతోపాటు తమలో తామే మాట్లాడుకుంటూ మానసిక రోగాలకు గురవుతున్నారు. నిద్రలేమి, మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని గోడకు తల బాదుకోవడం, బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నుంచి దూకుతానని బెదిరించడం తాను చాలా కేసుల్లో చూశానని సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషి తెలిపారు. మొబైల్ అడిక్ట్ అవుతున్న పిల్లల్లో బెదిరించడం, తమను తామే గాయపర్చుకోవడం, ఏంచేస్తున్నామో తెలియకుండా వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.

ఫిజికల్​ హెల్త్​పైనా తీవ్ర ప్రభావం

మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవడంతో పిల్లల ఫిజికల్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతోంది. పిల్లలకు మొబైల్ చూపిస్తూ ఫుడ్ తినిపిస్తున్నారు. మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్యాసలో ఎంత తింటున్నామన్న దానిపై నియంత్రణ ఉండదు. దీని వల్ల ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతూ ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమవుతున్నారని, దీంతో చిన్న వయసులోనే ఒబెసిటీ, బీపీ సమస్యల బారినపడుతున్నారని సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. పిల్లలు ఎక్కువసేపు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూడడం వల్ల మెడ నరాలు, కంటి చూపు దెబ్బ తినే ప్రమాదముందని పీడియాట్రిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరహరి వార్నింగ్​ ఇచ్చారు.

మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి అడిక్షన్ సెంటర్లు పెడ్తున్న డాక్టర్లు

విదేశాల్లో మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఅడిక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడొక కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కౌన్సిలర్లు నేరుగా ఇంటికే వచ్చి ట్రీట్ చేస్తున్నారు. పిల్లలతో వాళ్లకు నచ్చేట్టుగా ఎలా టైమ్ స్పెండ్ చేయాలి.. వాళ్లతో ఏం ఆటలు ఆడాలి వంటివన్నీ వీరు నేర్పిస్తారు. మనదేశంలోని పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి అడిక్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇవి మొదలయ్యాయి. పిల్లలను ఫోన్లకు ఎట్ల దూరం చేయాలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కో సైకియాట్రిస్ట్ వద్దకు సగటున వారానికి 5 నుంచి 10 మొబైల్ అడిక్షన్ కేసులు వస్తున్నాయి. ఈ కేసుల్లో 6 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. త్వరలోనే ఇక్కడా డి అడిక్షన్ సెంటర్లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ పిలగాడు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు కావడంతో ఫుల్ బిజీ. హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటూ టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాక్ వీడియోలు చేసుడు మొదలుపెట్టాడు. మస్తు లైకులు రావడంతో, సినిమా యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. చదువు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడ్తున్నట్టు చెప్పి పేరెంట్స్​కు షాక్ ఇచ్చాడు. ఇంజనీరింగ్ పూర్తి చేయాలని చెప్పినా వినలేదు. చివరకు ఓ సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. చదువుకునేది సంపాదించడానికేగా, అదేదో యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నై సంపాదిస్తానని డాక్టర్​కు చెప్పి బయటకు వెళ్లిపోయాడు ఆ పిలగాడు.

మతిమరుపు వస్తది

పిల్లల్లో సైకలాజికల్ సమస్యలకు పేరెంట్సే కారణం. తమను డిస్టర్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండా ఉండడానికి మొబైల్ ఇస్తున్నారు. అదే అలవాటుగా, అడిక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతోంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఒబెసిటీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడి మతిమరుపు వస్తోంది. పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. బయటకు తీసుకెళ్లి వేరే పనిలో వాళ్లను ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పిల్లలు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెండ్ చేసేలా చూడాలి. ఆటలు ఆడించాలి. రాత్రి త్వరగా పడుకునేలా ప్రోత్సహించాలి.

– డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి,
కిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మొబైల్ మాన్పించడం ఎలా..

ఇంట్లో పేరెంట్స్ ఫోన్ వాడకం తగ్గించాలి.
పిల్లలతో ఎక్కువసేపు సమయం గడపాలి.
వాళ్లతో సరదాగా ఆటలాడాలి.. బయటకు తీసుకెళ్లాలి
గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లి ఇతర పిల్లలతో ఆడుకునేలా ప్రోత్సహించాలి.
సంగీతం, మార్షల్​ ఆర్ట్స్ నేర్పించాలి. గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి పెరిగేలా చేయాలి.
గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాళ్లను దగ్గర చేయాలి
వాళ్లతో పిల్లలకు జీవిత కథలు చెప్పించాలి, వాళ్లతో బయటకు పంపించాలి.
రాత్రి త్వరగా నిద్రపోయేలా చూడాలి.