పల్లె నుంచి ఆకలితో సిటీకొచ్చిన పిల్లాడు.. ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాడు

పల్లె నుంచి ఆకలితో సిటీకొచ్చిన పిల్లాడు.. ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాడు

గుప్పెడు మెతుకుల విలువ ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది. ఒకప్పుడు ఒక ముద్ద అన్నం కోసం ఆరాటపడ్డవాడు కాబట్టే ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ల ఆకలి తీరుస్తున్నాడు. అలా అని అతనేం కోటీశ్వరుడు కాదు, పెద్ద లీడర్ కాదు మనం రోజూ చూస్తున్న అందరిలోనే ఒకడు. పెద్ద ఫంక్షన్ లలో, రెస్టారెంట్‌‌లలో మిగిలిపోయిన ఫుడ్ చెత్త కుప్పల్లోకి చేరకుండా ఆకలితో ఉన్నవాళ్లకి చేర్చే బాధ్యత నెత్తిన వేసుకున్న మామూలు యువకుడు. కోవిడ్ టైంలో కనీసం రోజుకి 50వేలమందికిపైగా ఫుడ్, రేషన్ అందించిన  ఈ అబ్బాయి. ఇప్పటికీ రోజూ హైదరాబాద్ లో వందల మంది ఆకలి తీరుస్తున్నాడు… ఓ పల్లెటూరినుంచి ఆకలితో బయల్దేరిన  ఆ పిల్లవాడు ఇప్పుడు 16 నగరాల్లో ఎంతో మందికి ఆకలి తీర్చటానికి పరోక్షంగా కారణం అయ్యాడు. ఆ జర్నీ అతని మాటల్లోనే…

మాది రాజమండ్రి దగ్గర ఓ పల్లెటూరు, వ్యవసాయం చేయటానికి అక్కడ ఉన్న కొంత భూమిని అమ్మేసి నాగపూర్ చేరుకున్న మా నాన్న అక్కడ కూడా నష్టం రావటంతో నిజామాబాద్ జిల్లా వర్ని కి వచ్చేశాడు. అమ్మా నాన్నా, నేనూ తమ్ముడు. అందరి బాధా ఒక్కటే ఆకలి. రోజూ నాన్న కూలీకి వెళ్లి ఆరోజుకు సరిపొయే సరుకులు తెచ్చేవాడు. నేనూ తమ్ముడూ పొద్దున స్కూలుకీ సాయంత్రాలు హొటల్లో పనికి వెళ్ళేవాళ్లం. ఒకరోజు బయట ఆడుకుంటూంటే మా హొటల్ ఓనర్ పని ఎగ్గొట్టానని వచ్చి రోడ్డుమీదే కొట్టాడు. అటు వైపే వెళ్తున్న మా స్కూల్ టీచర్ విషయం తెలుసుకొని అమ్మా నాన్నలతో మాట్లాడి హేమలతా లవణంగారి ఆశ్రమం లో చేర్పించారు. పదో తరగతి వరకూ అక్కడే ఉండేవాన్ని. అలా హేమలతమ్మ చని పోయేదాకా చదువుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చాను. 2008 లో ఆవిడ క్యాన్సర్ తో చనిపోయాక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాను.

నెలకి ఆరువేల జీతానికి

ఇంటర్ కోసం ఓ కాలేజ్ లో జాయినయిన రోజూ క్లాసులకు వెళ్లటం కుదిరేది కాదు. అదే సమయంలో నాన్న ఆరోగ్యం పాడైంది. ఇంటి బాధ్యత నా మీద పడింది. తెలిసిన ఫ్రెండ్‌‌తో మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో పనికి చేరాను. అక్కడకి ట్రీట్ మెంట్ కోసం వచ్చిన వాళ్లు కొందరు. ఇంకా చదువు కొమ్మని చెప్తూ ఉండేవాళ్లు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన కొందరు ఫ్రొఫెసర్లు  ట్యూషన్లు చెప్పేవాళ్లు. అలా ఎమ్​సెట్‌‌లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది.

ఎప్పుడూ క్లాస్ బయటే

కొందరు చేసిన హెల్ప్ తో 2012 లో హైద్రాబాద్ చేరుకున్నాను. ఫస్ట్ సీబీఐటీ లో చేరాను. కానీ అక్కడ వచ్చే అందరినీ చూసాక. నా బట్టలూ, నన్నూ చూసుకుంటే చాలా ఇన్ ఫియర్ గా అనిపించేది. ఇలాకాదని సిద్దార్థ కాలేజ్‌‌కి మారిపోయాను. ఇక్కడ కూడా పెద్ద చేంజ్ ఏమీ లేదు.  డ్రాఫ్టర్, ఎప్రిన్ లు కూడా లేకపోవటంతో ఎప్పుడూ క్లాస్ బయటే ఉండేవాన్ని. రాత్రి పూట ఫ్రెండ్ దగ్గర డ్రాఫ్టర్ తీసుకొని డ్రాయింగ్ వేసుకునే వాన్ని. అప్పుడే హాస్టల్ లో ఉన్న ఫ్రెండ్ నన్ను తనతో క్యాటరింగ్ కి తీసుకు వెళ్లాడు.  ఒక్కరోజులో క్యాటరింగ్ వాళ్లు ఇచ్చే డబ్బులకంటే టిప్పులే ఎక్కువ వచ్చాయి. ఆ డబ్బులతో నాకు కావాల్సినవి కొనుక్కున్నాను. అలా సీజన్ ఉన్నన్నాళ్లూ క్యాటరింగ్ లోనే గడిచిపోయేది. ఒక్కొక్క రోజు అక్కడ లేట్ అయ్యి, ఫుడ్ కూడా మిగలక,హాస్టల్  కి కూడా వెళ్లలేక బస్ స్టాండ్‌‌లోనే ఆకలితో నిద్రపోయేవాన్ని. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల వచ్చిన చిన్న చిన్న అల్సర్స్ ఇప్పటికీ ఇబ్బంది పెడుతుతూనే ఉన్నాయి.

కళ్లలో నీళ్లు తిరిగేవి

ఒకరోజు జూబ్లి హిల్స్ దగ్గర ఓ ఫంక్షన్లో చాలా ఫుడ్ మిగిలి పోయింది. రోజూ ఆకలితోనే ఉండేవాళ్లం కాబట్టి. మేం తినగా మిగిలిపోయిన ఫుడ్ మొత్తాన్ని చూస్తే కళ్లు తిరిగి పోయాయి. కనీసం అయిదు వందలమంది హాయిగా తినేంత ఫుడ్. దాన్ని అలా వదిలేయబుద్ది కాలేదు. అందరినీ కూచోబెట్టి ‘ఈ ఫుడ్ రోడ్డు మీద ఉన్నవాళ్లకి పంచుదామా’ అని అడిగాను. యాభై మందిలో ఓ పది మంది నాతో కలిసారు. ఆ ఫుడ్ పంచుకుంటూ తిరిగాం. ఇక ఆ రోజునుంచీ ఎక్కడ ఫుడ్ మిగిలినా అదే పని చేసేవాళ్లం. ఒక పక్క చదువు నడుస్తుండగానే ఈ వర్క్ చేసేవాళ్లం. ఒక్కొక్కళ్లకీ అన్నం అందిస్తుంటే ఆ ప్యాకెట్ విప్పుకొని కనీసం చెయ్యి కూడా కడుక్కోకుండా తినేస్తోంటే కళ్లలో నీళ్లు తిరిగేవి. అయితే క్యాటరింగ్ సీజనల్ బిజినెస్.  వరుసగా ప్రతీరోజూ ఉండదు. మిగతా రోజుల్లో కూడా వాళ్లకి ఫుడ్ ఎలా? అనిపించేది. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన. హైదరాబాద్ మొత్తంలో కొన్ని వేల హొటల్స్ ఉన్నాయి. ఒక్కో హొటల్‌‌లో కనీసం పది మందికి సరిపోయే ఫుడ్ మిగులుతుంది. అదంతా రెండో రోజు వేస్ట్ ఫుడ్ అయిపోతుంది. ఆ ఫుడ్ కలెక్ట్ చేసి పంచాలనుకున్నాను. హొటల్స్ కి వెళ్లి అడిగే వాన్ని. అయితే మొదట్లో కొందరు నమ్మలేదు. నేను ఆ ఫుడ్ ని అమ్ముతున్నాననుకునే వాళ్లు. కొన్నాళ్ల పాటు నాకు తెలియకుండా నేను నిజంగా పంచుతున్నానా లేదా అని చూడటానికి నా వెనుక నాకు తెలియకుండా ఫాలో అయ్యారట. నమ్మకం కుదిరాక వాళ్లే సాయంత్రం ఫుడ్ తీసుకు వెళ్లమని ఫోన్ చేసే వాళ్లు. అలా ‘‘డోంట్ వేస్ట్ ఫుడ్’’ అనే మా టీమ్‌‌వర్క్ ఊపందుకుంది. కానీ వాళ్లంతట వాళ్లు కాల్ చేసి ఫుడ్ తీసుకు పొమ్మని చెప్పటానికి అయిదేళ్లు పట్టింది. రోడ్డు పక్కన ఉండేవాళ్లకి, సికింద్రాబాద్‌‌ రైల్వేస్టేషన్‌‌లో ఉండే కార్మికులకు, ఆటో కార్మికులకు కూడా ఫుడ్ అందిస్తున్నాం.

 

వందకు పైగా మృతదేహాలని క్రిమేట్ చేశాం

అలా అంతా బావుందనుకుంటున్న టైం కి కోవిడ్ వచ్చి పడింది. లాక్ డౌన్ ముందు రోజు చాలామంది కి మిగిలిపోయిన ఫుడ్ అందించాం. ఆ తర్వాత రోజుల్లో కష్టం అవుతుందేమో అనుకుంటున్న సమయానికి. ఇంకా కొందరు ముందుకొచ్చారు. అలా సుధాకర్ రావు గారు అనే ఆయన, సింగర్ స్మిత గారు, ఎం కే ట్రావెల్స్ వాళ్లు అంతా కలిసి హెల్ప్ చేయటంతో రోజుకి డెబ్బై వేలమందికి ఫుడ్ అందించగలిగాం. కానీ ఆటైంలో కూడా ఎక్కువ ఫుడ్ ఇవ్వటం వల్ల వేస్టేజ్ ఎక్కువ ఉండేది. దాంతో ఇలా కాదనుకొని డైరెక్ట్‌‌గా సరుకులు పంచాలని అడిగాను. స్మితగారు ఒప్పుకున్నారు. అంతే కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి నాకు రెండు ట్రక్కుల నిండా ఫుడ్, రేషన్ వచ్చేది. భద్రాచలం, నిజామాబాద్, మెదక్ ఇలా ప్రతీ చోటా అవసరమైన వాళ్లకి అవి అందించాం. కోవిడ్ వల్ల చని పోయిన వాళ్ల క్రిమేషన్ కి ఇబ్బంది అవుతుంది అన్న ప్పుడు కూడా బాధ అనిపించింది. అప్పుడు తెలిసిన ఫ్రెండ్ ఒక కారు వెనుక సీట్లు తీసేసి ఇచ్చారు.  దాన్ని మార్చురీ వ్యాన్ లాగా చేసి. వందకు పైగా మృతదేహాలని క్రిమేట్ చేశాం. ఇక అన్ లాక్ మొదలవుతుంటే మళ్లీ రోడ్డు మీద ఉండేవాళ్ల కోసం నా రెగ్యులర్ వర్క్ మొదలయ్యింది. అయితే ఇప్పుడు హొటల్స్ లో కూడా ఎక్కువ ఫుడ్ ఉండటం లేదు. ఉన్న కొద్ది దాన్లోంచే. అందినంతవరకూ హెల్ప్ చేయగలుగుతున్నాను.

పదహారు ఊళ్లలో

ఫుడ్ పంచటానికి స్లమ్స్‌‌కి వెళ్లే వాళ్లం. అక్కడ ఉండే పిల్లలకోసం ఫుడ్‌‌తో పాటు కొందరు బట్టలు ఇచ్చేవాళ్లు. ఆ పిల్లలకి అవి అందించాక వాళ్లకి ట్యూషన్స్ చెప్పాలన్న ఆలోచన మొదలైంది. ఇలా నా కాలేజ్ ఫ్రెండ్స్, ఫేస్​బుక్​లో ఉన్న వాళ్లతో మాట్లాడినప్పుడు. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు కూడా కలిసారు. వాళ్ల హెల్ప్‌‌తో అక్కడా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. అలా ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్‌‌తో పాటు. రాజమండ్రి, అమలా పురం లాంటి16 ఊళ్లలో ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి.

26 అవార్డులు

 

బీటెక్‌‌ పూర్తయ్యాక ఢిల్లీ వెళ్లి అక్కడ ‘జోష్‌‌ టాక్స్‌‌’ డైరెక్టర్‌‌గా పని చేశాడు. ఇప్పుడు ట్రిపోరే అనే స్టార్టప్ నడుపుతున్నాడు, ఇది ఒక ట్రావెల్ బేస్ యాప్.  అంతకు ముందు యూట్యూబ్‌‌ చానెల్స్‌‌  క్రియేటివ్‌‌ వర్క్‌‌ చేశాడు. కనెక్ట్ ద హోప్ అనే ఎన్ జీవో రన్ చేస్తున్నాడు.  ఇక అవార్డులు వచ్చి పడుతూనే ఉన్నాయి.  ఫుడ్‌‌మ్యాన్‌‌గా అతడికి ఇండియన్‌‌ యంగ్‌‌ ఐకాన్‌‌ అవార్డు –2018 (నేషనల్‌‌ హ్యూమన్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఇండియా), రాష్ట్రీయ గౌరవ్‌‌ అవార్డు– 2019 (శిక్షాలయ అండ్, సి.జె గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్, ఢిల్లీ) లాంతి అవార్డులు మొత్తం 26 వచ్చాయి. ‘సన్‌‌ ఆఫ్‌‌ సాయిల్‌‌’ అవార్డు (సామ్‌‌సంగ్‌‌ అండ్‌‌ సి.జె.) కూడా అందుకున్నాడు.::: నరేష్​ కుమార్​ సూఫీ.