మూసీ సుందరీకరణకు ముందడుగు

మూసీ సుందరీకరణకు ముందడుగు
  •     హైడ్రాలజీ స్టడీ కోసం కన్సల్టెన్సీ నియామకం
  •     విలేజ్‌ రెవెన్యూ మ్యాప్‌ ఆధారంగా బార్డర్ల నిర్ధారణ
  •     రూ. 58 వేల కోట్లతో 55 కిలోమీటర్ల మేర పనులు

హైదరాబాద్, వెలుగు : మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వికారాబాద్‌‌‌‌లోని అనంతగిరి అడవుల్లో పుట్టి మహానగరంలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీని సుందరీకరించడంతో పాటు పేదలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీని థేమ్స్‌‌‌‌ నది తరహాలో అభివృద్ధి చేసి నది పొడవునా వాణిజ్య, వినోద కారిడార్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నిర్ణయించారు. 

దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ప్రభుత్వం స్పీడప్‌‌‌‌ చేసింది. మూసీ పరీవాహక ప్రాంతాలను ఇప్పటికే సర్వే చేసిన ఆఫీసర్లు వచ్చే మూడు నెలల్లో హద్దుల నిర్ధారణ పూర్తి చేయనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి అంచనాలతో సమగ్ర నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి అందజేసేందుకు హెచ్‌‌‌‌ఎండీఏ ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. 

రూ. 58 వేల కోట్లతో పనులు

గౌరెల్లి ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు నుంచి నార్సింగి రింగ్‌‌‌‌ రోడ్డు వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో మూడేళ్లలో మూసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. విదేశాల్లో పలు రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ ప్రాజెక్టులను పరిశీలించిన ఆఫీసర్లు మూసీ అభివృద్ధికి రూ.58 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. 

నదికి ఇరువైపులా వాణిజ్య, వినోద కారిడార్లు

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి పూర్తిస్థాయిలో సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు నదికి ఇరువైపులా అందుబాటులో ఉన్న భూమిని మౌలిక సదుపాయల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మురుగును పూర్తిగా మళ్లించడం, ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయడంపై దృష్టి పెట్టనున్నారు. 

మూసీనది అభివృద్ధిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు, సైకిల్‌‌‌‌ ట్రాక్‌‌‌‌లు, గ్రీన్‌‌‌‌వేలు, హాకర్‌‌‌‌ జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్‌‌‌‌ స్థలాలతో పాటు ప్రైవేట్‌‌‌‌ సంస్థల సహకారంతో రెస్టారెంట్లు, వాటర్‌‌‌‌ అమ్యూజ్‌‌‌‌మెంట్‌‌‌‌ పార్క్‌‌‌‌లు ఏర్పాటయ్యేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. మురికి కూపంగా మారిన మూసీని ఉపాధి కల్పన జోన్‌‌‌‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్‌‌‌‌లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. 

మూసీ ప్రవాహంపై హైడ్రాలజీ స్టడీ

మూసీ పరివాహక సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియను చేపట్టేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు మూసీలో ప్రవాహాలు ఎలా ఉన్నాయన్న దానిపై స్టడీ చేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. నది వెడల్పు ఎక్కడెక్కడ ఎంత ఉండాలని విలేజ్‌‌‌‌ రెవెన్యూ మ్యాప్‌‌‌‌ ఆధారంగా నిర్ధారించనున్నారు. నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలు తొలగించక తప్పదని ఆఫీసర్లు నిర్ణయించారు. అవసరమైతే మరింత భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆఫీసర్లు వెల్లడించారు. 

మూసీలోకి ప్రతి రోజు 1,800 మిలియన్‌‌‌‌ లీటర్ల మురుగు కలుస్తుందని గుర్తించిన ఆఫీసర్లు ఆ నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నదీ పరివాహక ప్రాంతాల్లో రోజుకు 700 మిలియన్‌‌‌‌ లీటర్ల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు ఉన్నప్పటికీ, మిగిలిన 1,100 మిలియన్‌‌‌‌ లీటర్ల మురుగును శుద్ధి చేసేందుకు అవసరమైన ఎస్టీపీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సుమారు రూ.3,820 కోట్లతో 38 ఎస్టీపీల పనులు చేపట్టగా ప్రస్తుతం అవి చివరి దశలో ఉన్నాయి. 

పదేళ్లలో ఇచ్చింది రూ. 9 కోట్లే... 

మూసీ సుందరీకరణ చేపడతామని ప్రకటించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ నిధుల మంజూరులో మాత్రం నిర్లక్ష్యం చేసింది. ప్రతి ఏటా బడ్జెట్‌‌‌‌లో వందల కోట్లు కేటాయించినా నిధులు మాత్రం విడుదల చేయలేదు. మూసీ అభివృద్ధికి 2017 – 18 బడ్జెట్‌‌‌‌లో రూ. 377.35 కోట్లను కేటాయించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం రూ. 32 లక్షలను, 2018- – 19 లో కూడా రూ.377.35 కోట్లను కేటాయించి రూ.2.80 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇక 2021 – 22, 2022 – 23, 2023 -– 24 ఆర్థిక సంవత్సరంలో రూ. 200 కోట్ల చొప్పున కేటాయించినా ఒక్క పైసా కూడా రిలీజ్‌‌‌‌ చేయలేదు. మొత్తంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో మూసీ అభివృద్ధికి 1354.70 కోట్లు కేటాయించి కేవలం రూ.9.12 కోట్లు మాత్రమే విడుదల చేసింది..