దీనివల్ల భాషను బతికించుకోగలం

దీనివల్ల భాషను బతికించుకోగలం

భాష.. మనుగడకు సూచిక. ప్రతీ భాషకు ఒక చరిత్ర ఉంటుంది. దానివల్ల ఆ ప్రాంతానికి గుర్తింపు వస్తుంది. అందుకే దేశంలో అంతరించిపోతున్న భాషలకు తిరిగి జీవం పోయడానికి కంకణం కట్టుకుంది ‘రీడింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ రిట్రైవల్‌‌‌‌ మూవ్​మెంట్‌‌‌‌.’  

‘రీడింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ రిట్రైవల్‌‌‌‌ మూవ్​మెంట్‌‌‌‌’ అంటే అంతరించి పోతున్న మాతృ భాషల్ని కాపాడుకోవడం అని అర్థం. ఈ ఉద్యమాన్ని తమిళనాడు, నీలగిరి జిల్లాలోని సెమ్మనారై ఊళ్లో ఉండే గిరిజన గురుకుల పాఠశాలలో మొదలుపెట్టారు. దీన్ని ముందుండి నడిపిస్తోంది ఆ స్కూల్ టీచర్‌‌‌‌‌‌‌‌ ఒడియన్‌‌‌‌ లక్ష్మణన్‌‌‌‌. 

దీని ద్వారా ఏం చేస్తారు..

మన దేశంలో దాదాపు 1,700లకు పైగా భాషలున్నాయి. వాటిలో చాలావరకు లిపి లేని గిరిజన భాషలే అయినా, ఇదివరకు అన్ని భాషలు వాడుకలోనే ఉండేవి. అయితే కాలం మారుతుంటే నాగరికత పేరిట సొంత భాష మాట్లాడే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతేకాకుండా సొంత భాషలో మాట్లాడితే పేరుపోతుందని అనుకునేవాళ్లూ, ఇతర భాషల్ని సొంత భాషలతో కలిపి మాట్లాడేవాళ్లూ ఉన్నారు. దానివల్ల భాషలోని సొంత పదాలు వాడుకలోకి రావడం లేదు. ఇది కూడా భాష అంతరించి పోవడానికి ఒక కారణమే. ఏండ్లుగా భాషను కాపాడుకోవాలని మాతృ భాషా దినోత్సవాలు జరుపుతున్నా, వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు.

ఈ మూవ్​మెంట్‌‌‌‌లో ఏం చేస్తారంటే.. పిగ్గీ బ్యాగ్‌‌‌‌లా ఉండే ఒక బాక్స్‌‌‌‌ ఉంటుంది. దాన్ని లాంగ్వేజ్‌‌‌‌ బాక్స్‌‌‌‌ అంటారు. ఈ బాక్స్‌‌‌‌ను స్కూల్స్‌‌‌‌, కాలేజీల్లో పెడతారు. వాడుకలో లేని పదాలను ఒక పేపర్ పైన రాయాలి. దానర్థాన్ని ఇంగ్లీష్‌‌‌‌లోనో, సొంత భాషలోనో ఆ పదం కింద రాసి, ఆ పేపర్‌‌‌‌‌‌‌‌ని తీసుకెళ్లి లాంగ్వేజ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో వేయాలి. వాటన్నింటిని కలెక్ట్‌‌‌‌ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తారు. పిల్లలతో వాటిని మాట్లాడించేలా ప్రోత్సహిస్తారు. ఇదొక్కటే కాకుండా మాతృ భాషలో ఉండే పాటలు, కథల్ని ఆ భాషలోనే పిల్లలతో రికార్డు చేయించి రేడియోలో ప్రసారం చేయిస్తున్నారు.

‘తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వాళ్ల పిల్లలకు భాష నేర్పించడానికి కృషి చేయాలి. ఇంగ్లీష్‌‌‌‌ ఒక్కటే భాష కాదు. అందుకే, ఇంగ్లీష్‌‌‌‌తో పాటు మాతృ భాష నేర్పే స్కూల్‌‌‌‌లో చేర్పించాలి. దీనివల్ల కొంత మార్పు తీసుకురాగలం. భాషను బతికించుకోగలం’ అని చెప్తున్నాడు ఒడియన్‌‌‌‌ లక్ష్మణన్‌‌‌‌.