ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రారంభం..పేదలకు ఉచితంగా వైద్య సేవలు

ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రారంభం..పేదలకు ఉచితంగా వైద్య సేవలు
  •     రూ.కోటితో హాస్పిటల్  నిర్మాణం

పానగల్, వెలుగు : వనపర్తి జిల్లా పానగల్  మండలంలోని రేమెద్దుల గ్రామంలో ఓ ఎన్ఆర్ఐ లక్ష్మీదేవి ఫౌండేషన్  ఆధ్వర్యంలో పది పడకల ఆసుపత్రిని నిర్మించి శుక్రవారం ప్రారంభించారు. రేమద్దుల గ్రామానికి చెందిన డాక్టర్  సురేఖ, డాక్టర్​ జాఫ్రీ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న ఆయన తన సొంత గ్రామం రేమద్దులకు ఏదైనా చేయాలనే సంకల్పంతో కోటి రూపాయల వ్యయంతో తమ తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బాలయ్య ఆచారి పేరిట ట్రస్టు ఏర్పాటు చేశారు.

హాస్పిటల్  నిర్మించి పేదలకు ఉచితంగా సేవలు చేసేందుకు ఓ డాక్టర్, సిబ్బందిని  నియమించారు. తాము ప్రారంభించిన హాస్పిటల్లో వైద్య సదుపాయాలను ఉచితంగా అందజేస్తామని డాక్టర్ సురేఖ జాఫ్రీ తెలిపారు. తమ ఫౌండేషన్  ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను చుట్టుపక్కల గ్రామస్థులు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.

పుట్టిన ఊరు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని, మానవతా దృక్పథంతో  ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని సురేఖ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, గ్రామ సర్పంచ్  మోటూరి మంజుల తదితరులు పాల్గొన్నారు.